Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఆర్టీసీని పరిరక్షించాలి
- కార్మికుల సమస్యలు పరిష్కరించాలి : జేఏసీ భవిష్యత్ కార్యాచరణ వెల్లడి
నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
ఆర్టీసీ పరిరక్షణ కోసం ప్రజలతో కలిసి సమైక్య ఆందోళనలు నిర్వహించనున్నట్టు టీఎస్ఆర్టీసీ కార్మికసంఘాల జేఏసీ ప్రకటిం చింది. ఈ మేరకు భవిష్యత్ కార్యాచరణను రూపొందించామని తెలిపారు. ఈనెల 20వ తేదీ ఆర్టీసీలోని పది కార్మికసంఘాలతో కూడిన జేఏసీ నేతల సమావేశం జరిగింది. దీనిపై భవిష్యత్ కార్యా చరణ గురించి విస్త్రుతంగా చర్చలు జరిపారు. రవాణాశాఖ మంత్రి, ఆర్టీసీ మేనేజింగ్ డైరెక్టర్‌కు వినతిపత్రాలు సమర్పించిన తర్వాత కూడా పరిస్థితుల్లో ఎలాంటి మార్పు లేకపోవడాన్ని జేఏసీ నేతలు తప్పుపట్టారు. పైగా రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజరుకుమార్ సంస్థలో జేఏసీ, యూనియన్లు లేవంటూ ప్రకటించడాన్ని జేఏసీ నేతలు తీవ్రంగా ఖండించారు. 20న జరిగిన సమావేశంలో తీసు కున్న నిర్ణయాలను శుక్రవారంనాడిక్కడి మగ్దూం మినీహాల్లో జరిగి న విలేకరుల సమావేశంలో జేఏసీ చైర్మెన్ కె రాజిరెడ్డి, వైస్ చైర్మెన్ కె హన్మంతు, కన్వీనర్ పి కమాల్‌రెడ్డి, కో కన్వీనర్లు జి అబ్రహం, బి సురేష్ వివరించారు. ఈనెల 31వ తేదీ లోపు రీజియన్ల వారీగా జేఏసీలు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. గ్రేటర్ హైదరాబాద్ జోన్, కరీంనగర్, నిజామాబాద్ రీజియన్ల బాధ్యతలను జేఏసీ చైర్మెన్ కె రాజిరెడ్డి తీసుకుంటారు. రంగారెడ్డి, మెదక్, మహబూబ్ నగర్, నల్గొండ రీజియన్ల బాధ్యతలను వైస్ చైర్మెన్ కె హన్మంతు, వరంగల్, ఆదిలాబాద్, ఖమ్మం రీజియన్ల బాధ్యతలు కన్వీనర్ వీఎస్ రావు తీసుకుంటారని తెలిపారు. ఆర్టీసీ పరిరక్షణ, కార్మిక సమస్యలపై కరపత్రాల ద్వారా ప్రజల్లో విస్త్రుత ప్రచారం చేయాలని నిర్ణయించారు. యాజమాన్య వైఖరిపై ఈనెల 26న లేబర్ కమిషనర్‌కు ఫిర్యాదు చేస్తారు. ఆగస్టు 3వ తేదీ హైదరాబాద్‌లో కార్మికులతో విస్త్రుత స్థాయి సమావేశం, ఆగస్టు 7న బస్‌భవన్ ఎదుట నిరసన కార్యక్రమం నిర్వహిస్తారు. ఆగస్టు 10లోపు ఆయా డిపోల పరిధిలోని ఎమ్మెల్యేలకు సమస్యలు పరిష్కరించాలని కోరుతూ వినతిపత్రాలు సమర్పిస్తారు. అలాగే పార్లమెంటు సమావేశాలు జరుగుతున్నందున కేంద్రప్రభుత్వ పరిధిలోని సమస్యల పరిష్కారాన్ని కోరుతూ కేంద్రమంత్రి నితిన్ గడ్కరీని కలిసి వినతిపత్రం సమర్పించాలని నిర్ణయించారు. ఆర్టీసీ కార్మికులకు ప్రతినెలా 1వ తేదీనే జీతాలు ఇవ్వాలనీ, వేతన సవరణ చేయాలనీ, సంపూర్ణ ఉద్యోగ భద్రత కల్పిస్తూ ఉత్తర్వులు సవరించాలనీ, ఐదు డీఏలు, రిటైర్డ్ కార్మికుల సమస్యలు పరిష్కరించాలనీ, సీసీఎస్ డబ్బుల్ని యాజమాన్యం చెల్లించాలనీ, తార్నాక ఆస్పత్రిని సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిగా తీర్చిదిద్దాలనీ డిమాండ్ చేశారు.