Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ : గోవాలో ఇనుము ఖనిజ తవ్వకాల కేసుకు సంబంధించి వేదాంత కంపెనీకి, గోవా ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. ఖనిజ తవ్వకాల లీజ్‌ను రద్దుచేస్తూ గతంలో సుప్రీంకోర్టు ఆదేశాలు ఇవ్వగా, ఈ తీర్పును సమీక్షించాలంటూ వేదాంత లిమిటెడ్, గోవా ప్రభుత్వం సుప్రీంలో రివ్యూ పిటిషన్ దాఖలుచేసింది. ఈ పిటిషన్‌ను విచారణను తిరస్కరిస్తూ జస్టిస్ డి.వై.చంద్రచూడ్, ఎం.ఆర్.షాల నేతృత్వంలోని ధర్మాసనం ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసింది. ''ఇనుము ఖనిజ తవ్వకాల లీజ్ విషయంలో మీకు అనుకూలంగా తీర్పు వచ్చేందుకు చేసిన ప్రయత్నమిది. గతంలో ఈ కేసును విచారించిన న్యాయమూర్తులు రిటైర్ అయ్యేంతవరకూ ఆగి..ఆ తర్వాత రివ్యూ పిటిషన్ దాఖలుచేశారు. ఇది సరైన పద్ధతేనా?'' అంటూ ధర్మాసనం వ్యాఖ్యానించింది. రివ్యూ పిటిషన్‌పై విచారణ చేపట్టడానికి నిరాకరించింది.గోవాలో ఇనుప ఖనిజ తవ్వకాల్లో అక్రమాలు చోటుచేసుకున్నాయని, చట్టపరంగా అనుమతులు లేకుండానే గనుల తవ్వకం జరుగుతోందని ఎన్జీవో సంస్థ 'గోవా ఫౌండేషన్' సుప్రీంలో పిటిషన్ వేసింది. దీనిపై విచారణ జరిపిన జస్టిస్ మదన్ బి.లోకుర్, జస్టిస్ దీపక్ గుప్తాలతో కూడిన సుప్రీం ధర్మాసనం 2018లో తీర్పు వెలువరించింది. ఖనిజ తవ్వకాల్ని వెంటనే ఆపాలని ఆదేశించింది. కొత్తగా లీజ్‌లు పొందిన కంపెనీలు, పర్యావరణ అనుమతులు పొందాకే అక్కడ గనుల తవ్వకం చేపట్టాలని ఆదేశాల్లో పేర్కొంది. వేదాంత కంపెనీ లీజ్‌లను న్యాయస్థానం రద్దుచేసింది. అయితే కేసును విచారించిన జస్టిస్ మదన్ బి.లోకుర్ రిటైర్ అయ్యాక గోవా ప్రభుత్వం నవంబరు 2019లో రివ్యూ పిటిషన్ దాఖలుచేసింది. అలాగే జస్టిస్ దీపక్ గుప్తా రిటైర్ అయ్యాక వేదాంత కంపెనీ ఆగస్టు 2020లో నాలుగు రివ్యూ పిటిషన్లు వేసింది. దీనిని సుప్రీంకోర్టు తీవ్రంగా తప్పుబట్టింది.