Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ : ఆఫ్ఘనిస్తాన్‌లో మొత్తంగా నెలకొన్న పరిస్థితులపై ఆఫ్ఘన్ శాంతి చర్చల ప్రతినిధి బృంద నాయకుడు అబ్దుల్లా అబ్దుల్లాతో భారత్ విదేశాంగ మంత్రి ఎస్.జై శంకర్ శుక్రవారం చర్చలు జరిపారు. అమెరికా బలగాలు వైదొలగిన నేపథ్యంలో అక్కడ హింస పెచ్చరిల్లింది. అత్యంత శక్తివంతమైన జాతీయ సామరస్యతా మండలి చైర్మన్ అబ్దుల్లా చర్చల్లో కీలక పాత్ర పోషిస్తున్నారు. ఆఫ్ఘనిస్తాన్‌లో శాశ్వత ప్రాతిపదికన శాంతి సుస్థిరతలను నెలకొల్పే దిశగా కృషి చేస్తున్నారు. ప్రైవేటు పర్యటన నిమిత్తం ఆఫ్ఘన్ నేత ప్రస్తుతం భారత్‌లో వున్నారు. ఈ ప్రాంతం పట్ల ఆయన ఆలోచనలు చాలా విలువైనవని జై శంకర్ ప్రశంసించారు. ఆయనతో సమావేశం కావడం బాగందంటూ ట్వీట్ చేశారు. మే 1న అమెరికా బలగాల ఉపసంహరణ ప్రారంభమైనప్పటి నుండి ఆఫ్ఘన్లో తీవ్రవాద దాడులు పెచ్చరిల్లుతున్నాయి. ఆగస్టు 31తో మొత్తంగా బలగాల ఉపసంహరణ పూర్తి కానుంది. ఈ పరిస్థితుల్లో గత కొద్ది వారాలుగా దేశంలో పరిస్థితి అధ్వాన్నంగా తయారైంది. దేశంలో మొత్తంగా జరుగుతున్న పరిణామాలపై ఆఫ్ఘన్ ప్రభుత్వంతో, అంతర్జాతీయ నేతలతో భారత్ భ్రుత్వం మాట్లాడుతునే వుంది. జైశంకర్-అబ్దుల్లా సమావేశానికి ఒక రోజు ముందుగా, విదేశాంగ శాఖ ప్రతినిధి అరిందమ్ బగ్చి గురువారం మాట్లాడుతూ, శాంతియుతమైన, ప్రజాస్వామ్యంతో కూడిన, సర్వతోముఖాభివృద్ధి కలిగిన భవిష్యత్‌ను సాకారం చేసుకోవాలన్న ఆఫ్ఘన్ ప్రజల ఆకాంక్షను గౌరవిస్తామని చెప్పారు. ఆఫ్ఘన్ల నేతృత్వంలో, ఆఫ్ఘన్ల నియంత్రణలో, ఆఫ్ఘన్లలకి చెందిన జాతీయ శాంతి, సామరస్య క్రమానికి భారత్ ఎల్లప్పుడూ మద్దతిస్తుందని స్పష్టం చేశారు.