Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కిసాన్ సంసద్‌లో తీర్మానం
- ఆంక్షల నడుమ మూడో రోజూ విజయవంతంగా..
- బీజేపీ నాయకులకు నిరసన సెగలు
న్యూఢిల్లీ : ఏపీఎంసీ సవరణ చట్టం రద్దు చేయాలని కిసాన్ సంసద్ (రైతుల పార్లమెంట్) ఏకగ్రీవ తీర్మానాన్ని ఆమోదించింది. సంయుక్త కిసాన్ మోర్చా (ఎస్కేఎం) నేతృత్వంలో జంతర్ మంతర్ వద్ద జరుగుతున్న కిసాన్ సంసద్ శనివారం మూడో రోజూ కొనసాగింది. సింఘూ సరిహద్దు నుంచి 200 వందల మంది రైతులు ఐదు బస్సుల్లో జంతర్ మంతర్ వద్ద సభా స్థలికి చేరుకున్నారు. రైతుల కిసాన్ సంసద్ నేపథ్యంలో జంతర్ మంతర్ సమీపం మొత్తం పోలీసులు భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. పార్లమెంట్‌కు వెళ్లే అన్ని దారులను మూసివేశారు. పార్లమెంట్ చుట్టుపక్కల ఉన్న అన్ని మెట్రో స్టేషన్లను మూసివేశారు. మీడియాను రైతుల వేదిక వద్దకు అనుమతించటంలేదు. ఆంక్షల నడుమే కిసాన్ సంసద్ మూడో రోజు కూడా విజయవంతం అయింది. రైతు వ్యతిరేక ఏపీఎంసీ సవరణ చట్టంపై చర్చించింది. దానిని వెంటనే రద్దుచేయాలని తీర్మానాన్ని ఆమోదించింది. కిసాన్ సంసద్‌లో జరిగిన చర్చల్లో భాగంగా కేంద్ర బడ్జెట్ సహకారంతో ప్రస్తుత మండి వ్యవస్థను రాష్ట్ర ప్రభుత్వాలు మెరుగుపరచాల్సిన అవసరం ఉందని గుర్తించింది. ఈ అంశాన్ని కిసాన్ సంసాద్ తీర్మానంలో చేర్చారు. రైతు పార్లమెంటు క్రమబద్ధంగా, శాంతియుతంగా, క్రమశిక్షణతో నడిచింది. రైతుల చర్చలు వివరంగా, విశ్లేషణాత్మకంగా సాగాయి. వర్షాకాల సమావేశంలో పార్లమెంటులో నాలుగు రోజులుగా జరుగుతున్న చర్యలు మోడీ ప్రభుత్వ పనితీరుపై ఆందోళనలను, ప్రజాస్వామ్యం ఎదుర్కొంటున్న క్లిష్టమైన సమస్యలను ప్రతిబింబిస్తాయని కిసాన్ సంసద్ పేర్కొంది.
అలాగే దేశంలోని వివిధ ప్రాంతాల్లో మినీ-కిసాన్ సంసద్‌లు నిర్వహిస్తామని ఎస్కేఎం నేతలు బల్బీర్ సింగ్ రాజేవాల్, దర్శన్ పాల్, గుర్నమ్ సింగ్ చారుని, హన్నన్ మొల్లా, జగ్జిత్ సింగ్ దల్లెవాల్, జోగిందర్ సింగ్ ఉగ్రహన్, శివకుమార్ కక్కాజీ, యుధ్వీర్ సింగ్, యోగేంద్ర యాదవ్ తెలిపారు. ఇప్పటికే పంజాబ్‌లోని లుథియానా జిల్లాలో కిలా రారుపూర్‌లోని అదానీ పొడి ఓడరేవు (డ్రై పోర్టు) వద్ద చిన్నారులు కిసాన్ సంసద్ నడిపారు. జంతర్ మంతర్ వద్ద రైతుల ఆందోళనకు పంజాబ్‌కు చెందిన రిటైర్డ్ బ్యూరోక్రాట్స్, డిఫెన్స్ సర్వీసెస్ సిబ్బంది ఫోరం మద్దతు తెలిపారు. అదేవిధంగా రిటైర్డ్ అడ్మిరల్ లక్ష్మీనారాయణ రామ్‌దాస్ రైతు ఉద్యమానికి తన మద్దతును ప్రకటించారు.
ఢిల్లీ సరిహద్దుల్లో 240వ రోజుకు చేరిన ఉద్యమం
మరోవైపు దేశ రాజధాని ఢిల్లీ సరిహద్దుల్లో జరుగుతున్న రైతు ఉద్యమం 240వ రోజుకు చేరింది. మూడు రైతు వ్యతిరేక చట్టాలు రద్దు చేయాలనీ, కనీస మద్దతు ధరకు చట్టబద్దత కల్పించాలని రైతులు చేస్తున్న ఆందోళన ఉధృతంగా కొనసాగుతున్నది. సింఘూ, టిక్రీ, షాజహాన్‌పూర్, ఘాజీపూర్ సరిహద్దుల్లో జరుగుతున్న రైతుల ఆందోళనల వద్దకు వేలాది మంది వచ్చి చేరుతున్నారు. శనివారం సింఘూ బోర్డర్ నిరసన స్థలంలో అగ్నిప్రమాదం జరిగింది. ఈ ఘటనలో అనేక రైతు గుడారాలు ధ్వంసమయ్యాయి. అయితే ఎటువంటి ప్రాణనష్టం జరగలేదు.
బీజేపీ నాయకులకు వ్యతిరేకంగా నిరసనలు
పంజాబ్, హర్యానా రాష్ట్రాల్లో బీజేపీ నాయకులకు వ్యతిరేకంగా రైతుల నిరసనలు జరుగుతున్నాయి. ఎక్కడిక్కడే బీజేపీ నేతలను రైతులు అడ్డుకుంటున్నారు. రాజస్థాన్‌లో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు అల్వార్ నల్ల జెండాల నిరసనలను ఎదుర్కొన్నారు.
రుద్రాపూర్‌లో ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి కూడా స్థానిక రైతుల నిరసనను ఎదుర్కొవల్సి వచ్చింది. రైతులు పెద్ద సంఖ్యలో గుమిగూడి ముఖ్యమంత్రికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. పోలీసులు పలువురు రైతులను అదుపులోకి తీసుకున్నారు. పంజాబ్‌లోని ఫాగ్వారాలో సత్నంపుర గ్రామంలో బీజేపీ నాయకులు సోమ్ ప్రకాష్ (కేంద్ర మంత్రి), విజరు సంప్లాకు వ్యతిరేకంగా రైతులు నిరసన చేపట్టారు.