Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- స్పైవేర్‌ను అడ్డుకోవటం చాలా కష్టం : సాంకేతిక నిపుణులు
- వాట్సాప్, టిక్ టాక్, గేమింగ్ యాప్స్ ద్వారా ప్రవేశపెడుతున్నారు..
- మాఫియా, నేరగాళ్లు, మోడీ సర్కార్ వంటి ప్రభుత్వాలు ఎన్ఎస్ఓ కస్టమర్లు..
- రూ.వందల కోట్లు చెల్లించి సేవలు
ఫోన్ ట్యాపింగ్, పర్సనల్ కంప్యూటర్స్ హ్యాకింగ్...మొదలైనవి ఇంతవరకూ చూశాం. ఫోన్ సంభాషణలు రికార్డు చేయటం, వినటం, పర్సనల్ కంప్యూటర్లో వ్యక్తిగత సమాచారాన్ని దొంగలించటం వంటివి భారత్ సహా వివిధ దేశాల్లో వెలుగులోకి వచ్చాయి. కానీ తాజాగా సంచలనం సృష్టిస్తున్న 'స్పైవేర్' (పెగాసస్) ఉదంతం అత్యంత అధునాతమైన హ్యాకింగ్ ప్రక్రియగా సాంకేతిక నిపుణులు చెబుతున్నారు. మోడీ సర్కార్ వంటి ప్రభుత్వాలు, మాఫియా ముఠాలు..వందల కోట్ల రూపాయలు చెల్లిస్తేనే ఎన్ఎస్ఓ (పెగాసెస్ హ్యాకింగ్ వీరిదే) నుంచి సేవలు అందుతాయని వారు చెబుతున్నారు. దీనికి సంబంధించి వారు తెలియజేసిన మరికొన్ని విషయాలు ఈ విధంగా ఉన్నాయి.
న్యూఢిల్లీ : పర్సనల్ కంప్యూటర్లో మనం నిర్వహించే పనులన్నింటికీ ఆధారం సాఫ్ట్వేర్. అలాగే స్మార్ట్ఫోన్లలోనూ ఒక సాఫ్ట్వేర్ ఉంటుంది. ఆ సాఫ్ట్‌వేర్‌పైనే యాప్‌లన్నీ పనిచేస్తాయి. యాపిల్ ఫోన్లలో 'ఐఓఎస్', గూగుల్ ఫోన్లలో 'గూగుల్', ఇతర పేరొందిన (సాంసంగ్, వివో, రెడ్మీ, ఒప్పో..) బ్రాండ్ ఫోన్లలో ఆండ్రాయిడ్ సాఫ్ట్‌వేర్‌పైన వివిధ యాప్‌లు పనిచేస్తాయి. మన స్మార్ట్‌ఫోన్‌లో సెట్టింగ్స్‌కు వెళ్లి చెక్చేస్తే..అందులో లోడైన ఆండ్రాయిడ్ వెర్షన్ ఎప్పటిదో కూడా ఉంటుంది. దీనికి అప్డేట్ వెర్షన్ వచ్చే వరకూ అదే సాఫ్ట్వేర్ ఆ స్మార్ట్‌ఫోన్‌ను నడుపుతుంది. అయితే ఏ సాఫ్ట్వేర్ అయినా.. సహజంగా దాంట్లో కొన్ని లోపాలుంటాయి. ఆ లోపాల్ని గుర్తించిన హ్యాకర్స్..దానికి తగ్గట్టు స్పైవేర్లను తయారుచేస్తారు. ఒక స్మార్ట్‌ఫోన్‌లోని సాఫ్ట్వేర్ పనిచేయకుండా అడ్డుకోవటం కోసం, లేదా దానిపై నియంత్రణ సాధించటం కోసం స్పైవేర్లను ప్రయోగిస్తారు. ఇజ్రాయెల్‌కు చెందిన ఎన్ఎస్ఓ తయారుచేసిన 'పెగాసస్' అలాంటిదే. దీనిని అడ్డుకొని స్మార్ట్‌ఫోన్‌లో సమాచారాన్ని కాపాడుకోవటం అంత సులభం కాదు. స్పైవేర్‌ను ప్రవేశపెట్టడానికి ఎన్ఎస్ఓ కొత్త కొత్త పద్ధతులు కనిపెట్టింది. ఇలాంటి సంస్థల నుంచి సేవలు పొందటం సామాన్యులకు అయ్యే పని కాదు. వారికి ఆ అవసరం కూడా లేదు. ఎన్ఎస్ఓ సేవలకు రుసుములు వందల కోట్లలో ఉంది. మోడీ సర్కార్‌లాంటి ప్రభుత్వాలు, నేరగాళ్లు, మాఫియా గ్రూపులు, బడా కార్పొరేట్ సంస్థలు వందల కోట్ల రూపాయలు చెల్లించి ఎన్ఎస్ఓ నుంచి సేవలు పొందుతున్నాయి.
జీరో క్లిక్..
ఫోన్లో బగ్ లేదా స్పైవేర్ చొరబడ్డాక దానిని వెంటనే గుర్తించటం సాధ్యం కాదు. కొంతకాలం ఆ ఫోన్‌ను తన నియంత్రణలో పెట్టుకున్నాక, కావాల్సిన సమాచారం తీసుకున్నాక..అందులో నుంచి స్పైవేర్ తొలగిపోతుంది. వాట్సాప్, ట్విట్టర్, ఐమెస్సేజ్, టిక్ టాక్, పబ్జి..వంటి గేమ్స్ యాప్‌ల ద్వారా స్పైవేర్‌ను ప్రవేశపెట్టడం మరొక పద్ధతి. ఎంపిక చేసిన ఫోన్లలో 2 లేదా 3 ఏండ్ల కాలంలో రకరకాలుగా హ్యాకింగ్ ప్రక్రియలను ఎన్ఎస్ఓ చేపట్టిందని నిపుణులు చెబుతున్నారు. ఇందులో 'జీరో క్లిక్' అనేది కూడా ఉందని వారు చెబుతున్నారు. అంటే మన స్మార్ట్‌ఫోన్‌లో మనం దేనినీ క్లిక్ చేయకుండానే స్పైవేర్ చొరబడుతుంది. దీనినే జీరో క్లిక్ అంటారు. అమెజాన్ మాజీ సీఈఓ జెఫ్ బెజోస్ వ్యక్తిగత స్మార్ట్‌ఫోన్‌ను ప్రత్యర్థులు 'జీరో క్లిక్' పద్ధతిలోనే హ్యాక్ చేశారు.
వాట్సాప్ ద్వారా దాడి చేశారు : వాట్సాప్ సీఈఓ విల్ కాత్కార్డ్
వివిధ దేశాల్లో పనిచేస్తున్న 1400 మంది ప్రభుత్వ ఉన్నతాధికారుల ఫోన్లలో వాట్సాప్ యాప్ ద్వారా పెగాసస్ చొరబడిందని వాట్సాప్ సీఈఓ విల్ కాత్‌కార్ట్ తాజాగా వెల్లడించారు. 2019లో హ్యాకింగ్ జరిగిందని ఆయన అన్నారు. దీనిపై ఎన్ఎస్ఓ కంపెనీకి వ్యతిరేకంగా న్యాయపోరాటం చేయబోతున్నామని ఆయన ప్రకటించారు. వాట్సాప్ తన వెర్షన్ అప్డేట్ చేసినప్పుడు ఫోన్లో బగ్ చొరబడిందన్న విషయం తెలియజేస్తుంది.