Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఇదంతా బీజేపీ తరఫున చేస్తున్నామని నన్ను కలిసినవారు చెప్పారు : కాంగ్రెస్ ఎమ్మెల్యే
రాంచీ : జార్ఖండ్లో ప్రభుత్వాన్ని కూల్చే ప్రయత్నాలను బీజేపీ చేస్తున్నదా? ఇందుకు ఎమ్మెల్యేలను కొనేందుకు సిద్ధమైందా? అంటే అవుననే సమాధానాలు వినబడుతున్నాయి. ఇందుకు కాంగ్రెస్ ఎమ్మెల్యే చేసిన ఆరోపణలు దీనికి బలాన్ని చేకూరుస్తున్నాయి. రాష్ట్రంలో సంకీర్ణ ప్రభుత్వాన్ని కూల్చడానికి ముగ్గురు వ్యక్తులు తనకు ఒక కోటి రూపాయలు ఆఫర్ చేశారనీ, దీనితో పాటు మైనారిటీ, గిరిజన వ్యవహారాల శాఖకు చెందిన మంత్రి బెర్త్ ఆఫర్ చేశారని ఎమ్మెల్యే నమన్ బిక్సల్ కొంగరీ తెలిపారు. రాష్ట్రంలో ఉన్న సంకీర్ణ ప్రభుత్వంలో కాంగ్రెస్ భాగస్వామిగా ఉన్న విషయం విదితమే.
'' ముగ్గురు వ్యక్తులు నా కార్యర్తల ద్వారా నన్ను సంప్రదించారు. బీజేపీ తరఫునే ఇది చేస్తున్నాం అని వారు తెలిపారు'' అని ఎమ్మెల్యే చెప్పారు. ఈ విషయాన్ని కాంగ్రెస్ శాసనసభా పక్ష నేత ఆలంగిర్ ఆలంకు, జార్ఖండ్ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జీ ఆర్పీఎన్ సింఘాకు, సీఎం హేమంత్ సొరెన్కు తెలిపినట్టు ఆయన వెల్లడించారు. ఆ ముగ్గురు తనను దాదాపు ఆరు సార్లు కలిసినట్టు వివరించారు. కాగా, కాంగ్రెస్ మరో ఎమ్మెల్యే కుమార్ జైమంగళ్ ఫిర్యాదు మేరకు ఆ ముగ్గురు వ్యక్తులపై పలు సెక్షన్ల కింద కేసులు నమోదైనట్టు తెలిపారు. ప్రస్తుతం రాష్ట్రంలో జార్ఖండ్ ముక్తి మోర్చా -కాంగ్రెస్- రాష్ట్రీయ జనతాదళ్ లతో కూడిన సంకీర్ణ ప్రభుత్వం అధికారంలో ఉన్న విషయం విదితమే. కాగా, 11 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలను టార్గెట్ చేసే ఉద్దేశంతో నిందితులు రంగంలోకి దిగినట్టు తెలిసింది.