Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- హ్యాకింగ్ జాబితాలో ఈడీ ఉన్నతాధికారి, కేజ్రీవాల్ వ్యక్తిగత కార్యదర్శి ఫోన్ నెంబర్లు
- పీఎంఓ కార్యాలయం, నిటి ఆయోగ్ సీనియర్ అధికారులపైనా హ్యాకింగ్
న్యూఢిల్లీ : పెగాసస్ కుంభకోణంలో హ్యాకింగ్‌కు గురైన వారి ఫోన్ నెంబర్ల జాబితాలో విస్తుగొలిపే విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. దేశంలో అత్యున్నత స్థాయిలో ఉన్న అధికారులను ఎంపికచేసి హ్యాకింగ్ ప్రక్రియ చేపట్టినట్టు తెలుస్తోంది. 2జీ స్పెక్ట్రమ్, ఎయిర్‌సెల్-మాక్సిస్..వంగి హైప్రొఫైల్ కేసుల విచారణలో పాలుపంచుకున్న ఎన్ఫోర్స్మేంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారి రాజేశ్వర్ సింగ్ పెగాసస్ జాబితాలో ఉన్నారు. రాజేశ్వర్ సింగ్ రెండు ఫోన్ నెంబర్లతోపాటు, మాజీ ఐఏఎస్ అధికారి, ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ వ్యక్తిగత కార్యదర్శిగా విధులు నిర్వహిస్తున్న వి.కె.జైన్, పీఎంఓ కార్యాలయం, నిటి ఆయోగ్‌లకు చెందిన పలువురు సీనియర్ అధికారుల ఫోన్ నెంబర్లు హ్యాకింగ్ గురైనట్టు న్యూస్ వెబ్‌పోర్టల్ 'ద వైర్' తాజాగా వెల్లడించింది. యూపీ పోలీస్ సర్వీస్ ఆఫీసర్‌గా విధులు నిర్వహించిన సింగ్, 2009 నుండీ ఎన్ఫోర్స్మేంట్ డైరెక్టరేట్‌లో పనిచేస్తున్నారు. 2జీ సెక్ట్రమ్ కుంభకోణం, ఎయిర్‌సెల్-మాక్సిస్(పి.చిదంబరం కేసు) వ్యవహారాలు, సహారా గ్రూప్ కేసు, ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్ అక్రమాస్తుల కేసుల విచారణలో ఆయన పాల్గొన్నారు. 2017 నుండి 2019 వరకు ఆయన ఫోన్ హ్యాకింగ్‌కు గురైనట్టు 'ద వైర్' తెలిపింది. మరో ఫోన్ నెంబర్ 2018 నుండి హాకింగ్ అయినట్టు తేలింది. రాజేశ్వర్ సింగ్ సోదరి, ముంబయిలో న్యాయవాదిగా పనిచేస్తున్న మాజీ ఐఏఎస్ అధికారి అభసింగ్ ఫోన్ నెంబర్ కూడా హ్యాక్ చేశారు. బాంబే హైకోర్టులో ఆమె హైప్రొఫైల్ కేసుల్లో వాదనలు వినిపిస్తున్నారు. ఉన్నతాధికారి వి.కె.జైన్ ఫోన్ నెంబర్ 2018 నుండి హ్యాకింగ్ చేస్తున్నారు. ఆ సమయంలో ఢిల్లీ ప్రభుత్వంలో పాఠశాల విద్య, ఆరోగ్యం, మౌలిక సదుపాయాలు మెరుగు పరచడం వంటి కీలక వ్యవహారాలను నిర్వస్తున్నారని సమాచారం.