Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- జోక్యం చేసుకోవాలని కోరుతూ ఐఎల్‌ఓకు సీఐటీయూ లేఖ
న్యూఢిల్లీ : రక్షణ పరికరాల ఉత్పత్తి సంస్థల్లో ఆందోళనలు, సమ్మెపై నిషేధం విధిస్తూ కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్లో ప్రవేశపెట్టిన అత్యవసర రక్షణ సేవల బిల్లుపై అంతర్జాతీయ కార్మిక సంస్థ(ఐఎల్ఓ)కు సీఐటీయూ తాజాగా లేఖ రాసింది. రాజ్యాంగం ఉద్యోగులు, కార్మికులకు హామీ ఇచ్చిన హక్కులను కాలరాసే విధంగా ఉందనిప్రభుత్వ చర్యలు ఉన్నాయని పేర్కొంటూ సీఐటీయూ ప్రధాన కార్యదర్శి, మాజీ ఎంపీ తపన్‌సేన్ ఐఎల్ఓ డైరెక్టర్ జనరల్ గై రైడర్‌కు రాసిన లేఖలో వివరించారు. రక్షణ సంస్థల్లో కార్మికులు ఆందోళనలు, సమ్మెలు చేపట్టడం పూర్తిగా చట్టవిరుద్ధమని ప్రభుత్వం ఈ బిల్లులో పేర్కొంటోందని, అదేవిధంగా చట్టాన్ని ఉల్లంఘిస్తే ఉద్యోగులు, కార్మికులపై కూడా కఠిన చర్యలను ప్రతిపాదిస్తోందని పేర్కొన్నారు. బిల్లులోని అనేక అంశాలు ఐఎల్ఓ ప్రమాణాలు, నిబంధనలకు విరుద్ధంగా ఉన్నాయని అన్నారు. భారత రాజ్యాంగం, ఐఎల్ఓ సదస్సుల సిఫారసులు, నిబంధనలకు విరుద్ధంగా ఉన్న ఈ బిల్లుపై వెంటనే జోక్యం చేసుకోవాలని, అదేవిధంగా ఐఎల్ఓ లేబర్ స్టాండర్డ్ కమిటీ చేత పరిశీలన చేయించి బిల్లును ఉపసంహరించుకునేలా భారత ప్రభుత్వానికి సూచన చేయాలని కోరారు. ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ బోర్డు(ఓఎఫ్‌బి)ని ముక్కలుగా చేసి ప్రభుత్వ యాజమాన్యంలో ఏడు కార్పొరేట్ సంస్థలుగా ఏర్పాటు చేయాలని మోడీ సర్కార్ ఇటీవల నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. దేశవ్యాప్తంగా ఈ బోర్డు కింద ఉన్న 41 ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలను ప్రభుత్వం కార్పొరేట్ శక్తులకు కట్టబెట్టాలని చూస్తోందని తీవ్ర విమర్శలు వస్తున్నాయి. ఇదే సమయంలో కార్పొరేటీకరణ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ రక్షణ రంగ ఉద్యోగులు, కార్మికులు ఆందోళనల బాట పట్టారు. ఈ నేపథ్యంలో రక్షణ రంగ సంస్థల్లో సమ్మె వంటి కార్యకలాపాలను నిషేధిస్తూ ఆర్డినెన్స్ తీసుకొచ్చిన కేంద్ర ప్రభుత్వం, ఇప్పుడు పార్లమెంట్లో దాన్ని బిల్లు రూపంలో తీసుకొచ్చింది.
గత హామీని తుంగలో తొక్కుతూ..
దేశ రక్షణ దృష్ట్యా ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలు త్రివిధ దళాలకు ఆయుధాలను తయారు చేస్తొందని, అయితే మోడీ ప్రభుత్వం ఆఖరుకు కీలకమైన దేశ రక్షణను కూడా పణంగా పెట్టి ఈ ఫ్యాక్టరీలను ప్రయివేటుపరం చేయాలని చూస్తోందని తపన్‌సేన్ విమర్శించారు. సైనికులకు కావాల్సిన పరికరాలు, వ్యవస్థల్లో దాదాపు 75 శాతానికి పైగా ఈ ఫ్యాక్టరీలే సమర్ధవంతంగా, నాణ్యంగా అందిస్తున్నాయని పేర్కొన్నారు. ప్రభుత్వ ఆధ్వర్యంలో ఇప్పటి వరకు నడుస్తూ వచ్చిన 41 ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలను కంపెనీస్ యాక్ట్ కింద ఏడు కార్పొరేట్ సంస్థలుగా రిజిస్టర్ చేయడం ద్వారా ప్రయివేటు పరం చేసేందుకు మార్గం సుగమం చేస్తోందని అన్నారు. ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ ఉద్యోగులు, కార్మికులు గతంలో సమ్మెకు పిలుపునివ్వగా.. ప్రయివేటీకరణను నిలిపేస్తామని చెప్పి రక్షణ శాఖ అప్పట్లో హామీ ఇచ్చిందని, అయితే ఉద్యోగ, కార్మిక సంఘాలకు ఇచ్చిన ఈ హామీని తుంగలో తొక్కుతూ మళ్లీ ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలను కార్పొరేటీకరించేందుకు ప్రయత్నాలు ప్రారంభించిందని పేర్కొన్నారు. దీనిపై ఆగ్రహం వ్యక్తం చేసిన ఉద్యోగులు, కార్మికులు సమ్మె నోటీసు ఇచ్చిన నేపథ్యంలో.. రక్షణ సంస్థల్లో ఆందోళనలు, సమ్మెలను నిషేధిస్తూ కేంద్రం జూన్ 30న ఆర్డినెన్స్ తీసుకొచ్చిందని, అదేవిధంగా ఈనెల 22న పార్లమెంట్లో బిల్లు ప్రవేశపెట్టిందని తెలిపారు.
కార్మిక హక్కుల ఉల్లంఘన
అత్యవసర రక్షణ సేవల బిల్లు ఐఎల్ఓ ప్రాథమిక హక్కుల నిబంధనలను ఉల్లంఘిస్తోందని, అదేవిధంగా ఉద్యోగ, కార్మిక సంఘాల స్వేచ్ఛకు సంబంధించి పలు సదస్సుల్లో ఆమోదించిన తీర్మానాలు, పాలసీలకు వ్యతిరేకంగా ఉందని తపన్‌సేన్ గై రైడర్ దృష్టికి తీసుకువచ్చారు. కార్మిక హక్కుల ప్రాథమిక సూత్రాలను ఉల్లంఘిస్తూ భారత ప్రభుత్వం పాల్పడుతున్న చర్యలపై దీన్ని ఫిర్యాదుగా స్వీకరించాలని కోరారు. సమ్మెలో పాల్గొంటే ఉద్యోగులు, కార్మికులపై ప్రభుత్వ ప్రతిపాదిత చర్యలు దారుణంగా ఉన్నాయని, ఉద్యోగాల నుంచి తీసేయడం, జరిమానాలు విధించడం వంటి నిరంకుశ చర్యలు ఉన్నాయని వివరించారు.