Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మూడోవంతు పాఠశాలలు, అంగన్వాడీల్లో తాగునీటి సమస్య
న్యూఢిల్లీ : దేశంలో మూడోవంతు ప్రభుత్వ పాఠశాలలు, అంగన్వాడీల్లో సురక్షితమైన తాగునీటి సౌకర్యం లేదని తాజాగా విడుదలైన కేంద్ర ప్రభుత్వ నివేదికలో వెల్లడైంది. గత ఏడాది గాంధీ జయంతి సందర్భంగా కేంద్రమంత్రి (జల శక్తి) గజేంద్రసింగ్ షెకావత్ 'జల్ జీవన్ మిషన్'ను ప్రారంభించారు. 2024 ఏడాదికల్లా దేశంలోని ప్రతి ఇంటికి తాగునీరు అందించాలనేది తమ లక్ష్యంగా కేంద్ర జల శక్తి మంత్రిత్వశాఖ ఈ సందర్భంగా ప్రకటించింది. వంద రోజుల కార్యక్రమం కింద దేశవ్యాప్తంగా పిల్లలందిరిలో వ్యక్తిగత పరిశుభ్రత, తాగునీటిపై అవగాహన కల్పించాలని నిర్ణయించారు. అలాగే దేశవ్యాప్తంగా ప్రభుత్వ స్కూళ్లు, అంగన్వాడీల్లో సురక్షిత తాగునీరు అందుబాటులోకి తీసుకురావాలని లక్ష్యంగా నిర్ణయించారు.
అయితే వంద రోజుల అవగాహనా దినోత్సవాలు ఈ ఏడాది జనవరి 10తో ముగిసాయి. ఈ నేపథ్యంలో పార్లమెంటరీ ప్యానెల్‌కు కేంద్ర జల శక్తి మంత్రిత్వశాఖ నివేదిక సమర్పించగా, అందులో విస్తుగొలిపే వాస్తవాలు బయటపడ్డాయి. దేశంలో దాదాపు మూడోవంతుకుపైగా ప్రభుత్వ పాఠశాలలు, అంగన్వాడీల్లో తాగునీటి వసతి లేదని ఆ నివేదికలో పేర్కొన్నారు. 48.5శాతం అంగన్వాడీ కేంద్రాల్లో, 53.3 పాఠశాలల్లో తాగునీరు వసతి ఉందని కేంద్ర జల శక్తి తెలిపింది. 'జల్ జీవన్ మిషన్' కార్యక్రమాల్ని మార్చి 31 వరకూ పొడగించాక..50వేల పాఠశాలలకు, 40వేల అంగన్వాడీలకు తాగునీరు వసతి ఏర్పడిందని నివేదికలో తెలిపారు.
పశ్చిమ బెంగాల్, జార్ఖాండ్లలో 15శాతం పాఠశాలల్లో, 10శాతం అంగన్వాడీల్లో తాగునీటి వసతి ఉందని తేలింది. ఉత్తరప్రదేశ్‌లో జల్ జీవన్ మిషన్ ద్వారా పెద్దఎత్తున అవగాహనా కార్యక్రమాలు జరిగాయి. అయినప్పటికీ ఆ రాష్ట్రంలో తాగునీరు వసతి గల పాఠశాలలు 20శాతం లోపే ఉన్నాయని గణాంకాలు నమోదయ్యాయి.