Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సుభాషిణీ అలీ ఆగ్రహం
- అపవాదులేస్తే సహించం..
- రైతులను గుర్తుచేసుకునే సమయం ప్రధానికి లేదు
- దేశాన్ని కార్పొరేట్లకు అమ్మేందుకు మోడీ సిద్ధం
- మహిళా కిసాన్ సంసద్‌లో రెండు తీర్మానాలు ఆమోదం
- కార్గిల్ అమరవీరులకు నివాళి...
- రైతు ఉద్యమ అమరవీరులకు శ్రద్ధాంజలి
- మిషన్ ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్‌ను ప్రారంభించిన ఎస్కేఎం
- చారిత్రాత్మక, అపూర్వ రైతు ఉద్యమానికి 8 నెలలు
న్యూఢిల్లీ : దేశంలోని రైతులపైనా, రైతు ఉద్యమంపైనా అపవాదులేస్తున్న కేంద్ర మంత్రులు, బీజేపీ నేతలపై మహిళా కిసాన్ సంసద్ స్పీకర్, మాజీ ఎంపీ సుభాషిణీ అలీ ఆగ్రహం వ్యక్తంచేశారు. ఆ రైతులు పండించే పంటలోఒక్క మెతుకు కూడా ముట్టుకోకుండా ఉండగలరా అని సవాలువిసిరారు. సోమవారం నాడిక్కడ జంతర్ మంతర్ వద్ద మహిళా కిసాన్ సంసద్ (మహిళా రైతుల పార్లమెంట్) జరిగింది. 200 మంది మహిళ రైతులు ఐదు బస్సుల్లో సింఘూ సరిహద్దు నుంచి జంతర్ మంతర్‌కు చేరుకున్నారు. ఢిల్లీ పోలీసులు, రాపిడ్ యాక్సన్ ఫోర్స్ (ఆర్ఏఎఫ్), సీఆర్పీఎఫ్, సీఐఎస్ఎఫ్, తదితర భద్రతా బలగాలతో కట్టుదిట్టమైన భద్రత చర్యలు చేపట్టారు. పార్లమెంట్‌కు వెళ్లే అన్నిదారులనూ, మెట్రో స్టేషన్లను మూసివేశారు. అనేక ఆంక్షల మధ్య మహిళా కిసాన్ సంసద్ విజయవంతంగా ముగిసింది. కిసాన్ సంసద్‌కు సంఘీభావం తెలిపేందుకు బయలుదేరిన కాంగ్రెస్ నేత అల్క లంబను పోలీసులు అడ్డుకున్నారు. మహిళ కిసాన్ సంసద్‌కు సంఘీభావం తెలిపేందుకు అక్కడికి వెళ్లేందుకు బయలు దేరిన ఐద్వా, సీఎస్‌డబ్ల్యూ, ఎన్ఎఫ్ఐడబ్ల్యూ, పీఎంఎస్, ఎస్ఎంఎస్ నేతలను మార్గ మధ్యలోనే అరెస్టుచేసి బరాఖంబా పోలీస్ స్టేషన్‌కు తరలించారు.
కార్గిల్ వీరులకు నివాళి
మహిళ కిసాన్ సంసద్‌లో మూడు సెషన్లు జరిగాయి. మొదటి సెషన్‌కు స్పీకర్‌గా సుభాషిణి అలీ, డిప్యూటీ స్పీకర్లగా సుమన్ హుడా చౌదరి, రవీంద్ర పాల్ కౌర్ వ్యవహరించారు. రెండో సెషన్‌కు స్పీకర్‌గా అన్నీ రాజా, డిప్యూటీ స్పీకర్లగా జగ్మతి సంగ్వాన్, హరీందర్ కౌర్ బిందు, సురీందర్ జైపాల్, మూడో సెషన్‌కు స్పీకర్‌గా మేధా పట్కర్, డిప్యూటీ స్పీకర్లగా కమల్జీత్, నిషా సిద్ధు, అనురాధ బెనివాల్ వ్యవహరించారు. తొలిత మహిళా రైతులంతా జాతీయ గీతం ఆలపించారు. అనంతరం 1999లో ఇదే రోజు విజయవంతంగా దేశాన్ని రక్షించినందుకు తమ ప్రాణాలను అర్పించిన సైనికులను గుర్తు చేసుకుంటూ కార్గిల్ విజరు దివాస్ సందర్భంగా కార్గిల్ అమర వీరులకు నివాళులర్పించారు. రైతు ఉద్యమంలో అమరులైన రైతులకు శ్రద్ధాంజలి ఘటించారు. రైతు ఉద్యమ సమయంలో తన భర్తను కోల్పోయిన శ్రీమతి రమేష్‌ను మహిళా కిసాన్ సంసద్‌కు సుభాషిణీ అలీ పరిచయం చేశారు.
దేశాన్ని కార్పొరేట్లకు అమ్మేందుకు మోడీ సిద్ధం : సుభాషిణీ అలీ
ఈసందర్భంగా మొదటిసెషన్కు స్పీకర్‌గా వ్యహరించి న సుభాషిణీ అలీ సెహగల్ మాట్లాడుతూ చారిత్రాత్మక రైతు ఉద్యమంలో 540మంది మరణించారని, అందులు ఏడుగు రు మహిళలు కూడా ఉన్నారని తెలిపారు. అమరవీరులను గుర్తు చేసుకునేందుకు ప్రధాని మోడీకి సమయం లేదని, ఆయా రైతు కుటుంబాలకు సానుభూతి తెలిపేందుకు సమయం లేదని విమర్శించారు. రైతు ఉద్యమంపై మోడీ సర్కార్, కేంద్ర మంత్రులు, బీజేపీ నేతలు అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారని, తీవ్రవాదం, ఖలిస్తానీ ముద్రలు వేస్తున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. ఈ అనుచిత వ్యాఖ్యలు చేసేవారికి కొంచమైన సిగ్గుంటే, వీళ్లు ఎవరిపైనైతే ఖలిస్తానీలని అపవాదులు వేస్తున్నారో, వారు పండించిన పంటలోని ఒక్క మెతుకు కూడా ముట్టుకోకూడదని హితవు పలికారు.
మహిళా కిసాన్ సంసద్ ఆమోదించిన ఏకగ్రీవ తీర్మానాలు
మహిళా కిసాన్ సంసద్ రెండు తీర్మానాలను ఏకగ్రీవంగా ఆమోదించింది. మహిళలు వ్యవసాయరంగంలో ఎంతో కృషి చేస్తున్నప్పటికీ, వారు దేశంలో రావల్సిన గౌరవం, గుర్తింపు, హోదాను పొందటం లేదు. వారి శ్రమ, కృషి, నైపుణ్యం, పరిజ్ఞానం, వారి శక్తిని సమాజంలోని ప్రజా ఉద్యమాల్లో తీసుకోవాలి. రైతుల ఉద్యమంలో మహిళా రైతుల పాత్ర, అవకాశాలను పెంచడానికి బాగా ఆలోచనాత్మకమైన చర్యలు తీసుకోవాలని మొదటి తీర్మానం ఏకగ్రీవంగా ఆమోదం పొందింది. పంచాయతీ, మున్సిపాలటీ వంటి స్థానిక సంస్థల్లో ఉన్న 33 శాతం మహిళ ప్రాతినిధ్య రిజర్వేషన్లను, పార్లమెంట్, అసెంబ్లీల్లో కూడా కల్పించాలని, అలాగే జనాభాలో 50 శాతం ఉన్న మహిళలకు తగిన ప్రాతినిధ్యం కల్పించేందుకు రాజ్యాంగ సవరణ చేయాలనే తీర్మానం ఏకగ్రీవంగా ఆమోదం పొందింది.
చారిత్రాత్మక, అపూర్వ రైతు ఉద్యమానికి 8 నెలలు
కేంద్ర ప్రభుత్వం అప్రజాస్వామ్యంగా, రాజ్యాంగ విరుద్ధంగా తీసుకొచ్చిన నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా దేశ రాజధాని సరిహద్దుల్లో లక్షలాది మంది రైతులు చేస్తున్న చారిత్రాత్మక, అపూర్వమైన ఉద్యమం ఎనిమిది నెలలు పూర్తి చేసుకుంది. 2020 నవంబర్ 26న ప్రారంభమైన రైతుల ఆందోళనలకు సోమవారంతో 8 నెలలు పూర్తయ్యాయి. ఈ ఉద్యమం రైతుల గౌరవం, ఐక్యతకు చిహ్నంగా మారిందని ఎస్కేఎం నేతలు తెలిపారు. ఇది ఇకపై రైతుల ఉద్యమం మాత్రమే కాదని, భారతదేశ ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించడానికి, దేశాన్ని కాపాడటానికి చేసే పోరాటాన్ని సూచించే ప్రజా ఉద్యమమని పేర్కొన్నారు.
మిషన్ ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్‌ను ప్రారంభించిన ఎస్కేఎం
మిషన్ ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్‌ను సంయుక్త కిసాన్ మోర్చా (ఎస్కేఎం) ప్రారంభించింది. సెప్టెంబర్ 5న ముజఫర్ నగర్లో భారీ ర్యాలీతో మిషన్ లాంఛనంగా ప్రారంభమవుతుందని ప్రకటించింది. సోమవారం ఉత్తరప్రదేశ్‌లోని లక్నోలో మిషన్ ఉత్తర ప్రదేశ్, ఉత్తరాఖండ్‌ను ఎస్‌కెఎం నేతలు రాకేష్ టికాయిత్, యోగేంద్ర యాదవ్ తదితరులు ప్రకటించారు. రైతుల ఉద్యమం పంజాబ్, హర్యానాలో జరిగిన విధంగా బలోపేతం చేయడానికి రెండు రాష్ట్రాల్లో ప్రతి గ్రామానికి తీసుకెళ్తామని పేర్కొన్నారు.