Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పార్లమెంట్లో కొనసాగుతున్న 'పెగాసస్' ప్రతిష్టంభన
- ఉభయసభల్లో ప్రతిపక్షాల ఆందోళన
- మీరాబాయి చానుకు అభినందనలు
- కార్గిల్ అమరవీరులకు నివాళి
- చర్చలేకుండా ముజూవాణి ఓటుతో లోక్‌సభలో రెండు బిల్లులు ఆమోదం
- పార్లమెంట్‌కు ట్రాక్టర్‌పై రాహుల్ గాంధీ
న్యూఢిల్లీ : పార్లమెంట్ వర్షాకాల సమావేశాలకు పెగాసస్ సెగ తలిగింది. గత కొన్ని రోజులుగా ఇదే అంశంపై పార్లమెంట్ దద్దరిల్లుతున్నది. సోమవారం కూడా ఉభయ సభల్లో పెగాసస్ స్పైవేర్ నిఘా వ్యవహారంపై చర్చకు ప్రతిపక్షాలు పట్టుపట్టాయి. ప్రతిపక్ష సభ్యులు వెల్‌లోకి వెళ్లి ఆందోళన చేపట్టారు. ప్లకార్డులు చేబూని పెద్ద పెట్టున నినాదాల చేశారు. దీంతో పార్లమెంట్ ఉభయ సభలూ వాయిదాల పర్వం తొక్కాయి. అంతకుముందు ఉభయ సభలు ప్రారంభంకాగానే కార్గిల్ విజరు దివస్‌ను పురస్కరించుకుని అమరవీరులకు నివాళులర్పించాయి. వారి సేవలను సభ్యులు కొనియాడారు. ఆ తరువాత టోక్యో ఒలింపిక్స్‌లో రజత పతకం సాధించి భారత పతకాల పట్టికను తెరిచిన వెయిట్ లిఫ్టర్ మీరాబాయి చానును ఉభయసభలు అభినందించాయి.
మోడీ సమాధానం చెప్పాలి : లోక్‌సభలో ప్రతిపక్షాల డిమాండ్
సోమవారం లోక్‌సభ ప్రారంభం కాగానే ప్రతిపక్ష సభ్యులు ఆందోళన చేపట్టారు. ప్లకార్డులు చేబూని వెల్‌లోకి దూసుకెళ్లి స్పీకర్ పోడియంను చుట్టుముట్టారు. ''ప్రధాని మోడీ సమాధానం చెప్పాలి. హౌం మంత్రి అమిత్ షా రాజీనామా చేయాలి. సుప్రీంకోర్టు పర్యవేక్షణలో విచారణ జరపాలి. పెగాసస్‌పై కేంద్రం అబద్ధాలు ఆడుతున్నది. వాస్తవాలు బయటపెట్టాలి'' అంటూ ప్రతిపక్ష సభ్యులు నినాదాలు చేశారు. నినాదాల నడుమే స్పీకర్ ఓం బిర్లా ప్రశ్నోత్తరాలను నిర్వహించారు. దాదాపు 30 నిమిషాల పాటు ప్రశ్నోత్తరాల్లో కొంతమంది ప్రతిపక్ష ఎంపీలు అడిగిన కొన్ని ప్రశ్నలకు కేంద్ర మంత్రులు నిర్మలా సీతారామన్, ధర్మేంద్ర ప్రదాన్, హర్దీప్ సింగ్ పురి సమాధానమిచ్చారు. అయితే ప్రతిపక్ష సభ్యులు ఆందోళనను ఉధృతం చేయటంతో స్పీకర్ వారించారు. ప్రతిపక్ష సభ్యులు సహకరించాలని కోరారు. అయినప్పటికీ వారు శాంతించకపోవడంతో సభను మధ్యాహ్నం 2 గంటల వరకు వాయిదా వేశారు. తిరిగి ప్రారంభమైన సభలోనూ ప్రతిపక్షాల ఆందోళన కొనసాగింది. దీంతో మధ్యాహ్నం 2.45 గంటలకు సభను వాయిదావేశారు. అనంతరం ప్రారంభమైన సభలో ప్రతిపక్షాల ఆందోళనతో నెలకొన్న గందరగోళంతో మళ్లీ సభ వెంటనే మరో పదిహేను నిమిషాల పాటు మధ్యాహ్నం 3 గంటలకు వాయిదా పడింది. అనంతరం ప్రారంభమైన సభలో ప్రతిపక్షాల ఆందోళన నడుమ కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఫ్యాక్టరింగ్ రెగ్యులేషన్ (సవరణ) బిల్లును ప్రవేశపెట్టారు. అలాగే కేంద్ర ఫుడ్ ప్రొసెసింగ్ మంత్రి పసుపతి కుమార్ పరసా నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఫుడ్ టెక్నాలజీ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ అండ్ మేనేజ్మెంట్ బిల్లును ప్రవేశపెట్టారు. ఈ రెండు బిల్లులపై చర్చ జరగకుండానే మూజువాణి ఓటుతో ఆమోదం పొందాయి. ప్రతిపక్షల ఆందోళన కొనసాగడంతో సభ మంగళవారంనాటికి వాయిదా పడింది.
రాజ్యసభలోనూ సభ్యుల ఆందోళన
అటు రాజ్యసభలోనూ ఇదే పరిస్థితి నెలకొంది. కాంగ్రెస్, టీఎంసీ, సీపీఐ(ఎం), డీఎంకే, సీపీఐ తదితర పార్టీలకు చెందిన ఎంపీలు వెల్‌లోకి దూసుకెళ్లి ఆందోళన చేపట్టారు. ప్లకార్డులు చేబూని కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. చైర్మన్ ఎం వెంకయ్య నాయుడు మాట్లాడుతూ ప్రజాప్రాముఖ్యత ఉన్న సమస్యలను లేవనెత్తకుండా సభ్యులను అడ్డుకుంటున్నారని పేర్కొన్నారు. ''మనం రోజు రోజుకూ నిస్సహాయంగా మారుతున్నాం'' అని ఆయన అన్నారు. అనంతరం రాజ్యసభను మధ్యాహ్నం 12 గంటల వరకు వాయిదా వేశారు. తిరిగి ప్రారంభమైన సభలోనూ ప్రతిపక్షాల ఆందోళన కొనసాగడంతో సభ మధ్యాహ్నం 2 గంటలకు వాయిదా పడింది. అనంతరం ప్రారంభమైన సభలో నెలకొన్న పరిస్థితుల్లో ఎటువంటి మార్పు రాకపోవడంతో సభను మధ్యాహ్నం 3 గంటలకు వాయిదా వేశారు. తిరిగి ప్రారంభమైన సభలో అదే గందరగోళం నెలకొంది. దీంతో సభను సాయంత్రం 4 గంటలకు వాయిదా వేశారు. అనంతరం ప్రారంభమైన సభలో ప్రతిపక్ష నేత మల్లికార్జున ఖర్గే పెగాసస్‌పై మాట్లాడటానికి ప్రయత్నించగా, అధికార పార్టీ ఉపనేత ముక్తార్ అబ్బాస్ నఖ్వీ లేచి, దీనిపై ఇప్పటికే కేంద్ర ఐటీ మంత్రి ప్రకటన చేశారని పేర్కొన్నారు. దీంతో ప్రతిపక్ష సభ్యులు ఆందోళనను ఉధృతం చేశారు. వెంటనే సభను సాయంత్రం 5 గంటలకు వాయిదా వేశారు. తిరిగి ప్రారంభమైన సభలో తీవ్ర గందరగోళం నెలకొనడంతో సభ నేటీకి (మంగళవారం) వాయిదా పడింది. మరోవైపు ఉభయ సభలో వివిధ అంశాలపై చర్చకు ఇచ్చిన నోటీసులను లోక్‌సభ స్పీకర్, రాజ్యసభ చైర్మన్ అనుమతించ లేదు.
పార్లమెంట్‌కు ట్రాక్టర్‌పై రాహుల్ గాంధీ
కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ట్రాక్టర్‌పై పార్లమెంట్‌కు చేరుకున్నారు. కేంద్రం తీసుకొచ్చిన మూడు నల్ల చట్టాలు రద్దు చేయాలనీ, ఆందోళన చేస్తున్న రైతులకు మద్దతుగా రాహుల్ గాంధీ స్వయంగా ట్రాక్టర్ నడుపుకుంటూ పార్లమెంట్‌కు వచ్చారు. సోమవారం నాడిక్కడ తన నివాసం నుంచి ట్రాక్టర్‌పై బయలుదేరి వచ్చారు. ఆయన నడిపే ట్రాక్టర్‌పై పంజాబ్, హర్యానాలకు చెందిన కాంగ్రెస్ పార్టీ ఎంపీలు ప్లకార్డులు పట్టుకొని, నినాదాలు ఇచ్చారు. ఈ సందర్భంగా రాహుల్ గాంధీ మీడియాతో మాట్లాడుతూ వ్యవసాయ చట్టాలు రైతులకు వ్యతిరేకమనీ, వాటిని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. ''రైతుల సందేశాన్ని నేను పార్లమెంట్‌కు తీసుకొస్తున్నాను. అన్నదాతల గళాన్ని ఈ ప్రభుత్వం అణచివేస్తోంది. దీనిపై పార్లమెంట్లో చర్చకు కూడా అనుమతినివ్వట్లేదు. కొత్త సాగు చట్టాలు కేవలం ఇద్దరు ముగ్గురు వ్యాపారవేత్తల కోసం మాత్రమే అని యావత్ దేశమంతా తెలుసు. రైతులకు ఉపయోగం లేని ఈ చట్టాలను కేంద్రం వెంటనే ఉపసంహరించాలి'' అని రాహుల్ డిమాండ్ చేశారు. పార్లమెంట్‌లోకి రాహుల్ గాంధీ వెళ్లిన వెంటనే, పార్లమెంట్ వెలుపల కాంగ్రెస్ నేత రణదీప్ సుర్జేవాలా, యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు బివి శ్రీనివాస్‌తో సహా పలువురు కాంగ్రెస్, యూత్ కాంగ్రెస్ కార్యకర్తలను ఢిల్లీ పోలీసులు అరెస్టు చేసి, మందిర్ మార్గ్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు.
శిరోమణి అకాలీదళ్, బీఎస్పీ ఎంపీలు
రైతు వ్యతిరేక చట్టాలు రద్దు చేయాలని పార్లమెంట్లో శిరోమణి అకాలీదళ్ (ఎస్ఏడీ), బీఎస్పీ ఎంపీలు ఆందోళన చేపట్టారు. పార్లమెంట్ ఆవరణంలో గేట్ నెంబర్ 4 వద్ద ఎస్ఏడీ, బీఎస్పీ ఎంపీలు ఆందోళన చేట్టారు. రైతు చట్టాలకు వ్యతిరేకంగా ప్లకార్డులు చేబూని నినాదాల ఇచ్చారు.
అధికార, ప్రతిపక్షాల వ్యూహాలు
పార్లమెంట్ సమావేశాలు ప్రారంభానికి ముందు అధికార, ప్రతిపక్షాలు పార్లమెంట్లో వ్యవహరించాల్సిన వ్యూహాలపై చర్చించారు. ఈ మేరకు అధికార, ప్రతిపక్షాల నేతలు వేర్వేరుగా సమావేశం అయ్యారు. పార్లమెంట్లో ప్రధాని మోడీ, హోం మంత్రి అమిత్ షా, రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జెపి నడ్డా, పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్ జోషి, రాజ్యసభ నేత పియూష్ గోయల్, ఉపనేత ముక్తార్ అబ్బాస్ నఖ్వీ, కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ సమావేశం అయ్యారు. మరోవైపు రాజ్యసభ ప్రతిపక్షనేత మల్లికార్జన ఖర్గే నేతృత్వంలో ఆయన కార్యాలయంలో ప్రతిపక్షాలు భేటీ అయ్యాయి. ఈ సమావేశంలో ఆనంద్ శర్మ, జైరాం రమేష్ (కాంగ్రెస్), రామ్ గోపాల్ యాదవ్ (ఎస్పీ), ఎలమారం కరీం (సీపీఐ(ఎం)), బినరు విశ్వం (సీపీఐ), సుప్రియా సులే (ఎన్సీపీ), తిరుచ్చి శివ (డీఎంకే), మనోజ్ కుమార్ ఝా (ఆర్జేడీ), సుశీల్ కుమార్ (ఆప్) తదితరులు పాల్గొన్నారు. పెగాసస్, రైతు ఆందోళన, ఇంధన పెరుగుదల అంశాలపై ప్రభుత్వాన్ని నిలదీయాలని ప్రతిపక్షాలు నిర్ణయించారు.