Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- బీఎస్ఎన్ఎల్లో విలీనం చేయాలి: డచీ బ్యాంక్ రిపోర్ట్
న్యూఢిల్లీ : ఆర్థిక ఒత్తిడిలో చిక్కుకున్న టెలికం కంపెనీ వొడాఫోన్ ఐడియా (వీఐ)ను ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలని జర్మనీ కేంద్రంగా పని చేస్తోన్న బహుళజాతి విత్త సేవల సంస్థ డచీ బ్యాంక్ ఓ పరిశోధన రిపోర్ట్‌లో సూచించింది. ఎజీఆర్ బకాయిల అంశంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు, స్పెక్ట్రమ్ అప్పులు, ప్రస్తుతం 5జి స్పెక్ట్రం అవసరాల నేపథ్యంలో వీఐని ప్రభుత్వపరం చేసుకోవడం మాత్రమే పరిష్కారమని పేర్కొంది. కాగా.. ఈ సంస్థలో పెట్టుబడులు పెట్టడానికి ఇన్వెస్టర్లు ముందుకు రావడం లేదని తెలిపింది. ప్రభుత్వం చొరవ తీసుకుంటే తప్పా ఈ సంస్థకు మూలధన కల్పనకు అవకాశం లేదని డచీ బ్యాంక్ రీసెర్చ్ అనలిస్ట్ పీటర్ మిలికెన్ పేర్కొన్నారు. దీనికి ఒక్కటే పరిష్కారమని.. రుణాలను ఈక్విటీ కింద మార్చాలని.. బిఎస్ఎన్ఎల్లో విలీనం చేయడం ద్వారా విఐని లాభాల్లోకి తీసుకురావొచ్చని ఆయన సూచించారు.
గడిచిన మార్చి 31 నాటికి వీఐ రూ.1.8 లక్షల కోట్ల అప్పులు చెల్లించాల్సి ఉంది. ఇందులో స్పెక్ట్రమ్‌కు సంబంధించి రూ.96,270 కోట్లు, ఎజిఆర్ బకాయిలు రూ.60,960 కోట్లు, బ్యాంక్‌లకు రూ.23,080 కోట్లు చొప్పున చెల్లించాల్సి ఉంది. విఐ ప్రమోటర్లు ఆదిత్యా బిర్లా గ్రూపు, బ్రిటన్‌కు చెందిన వొడాఫోన్ గ్రూపులు 72.05 శాతం వాటా కలిగి ఉన్నాయి. ప్రస్తుతం కంపెనీ మార్కెట్ కాపిటలైజేషన్ రూ.23,000 కోట్లుగా ఉంది. కంపెనీ ప్రస్తుత విఐ మార్కెట్ విలువ కంటే ప్రభుత్వానికి ఆరు రెట్ల అప్పులు చెల్లించాల్సి ఉందని పీటర్ పేర్కొన్నారు. ఇలాంటి సమయంలో వాటాదారులు కూడా పరిష్కారంపై దృష్టి పెట్టాలని సూచించారు. స్పెక్ట్రమ్ కొనుగోలు బకాయిలు రూ.8,000 చెల్లింపునకు తమకు 2023 ఏప్రిల్ వరకు మారటోరియం కల్పించాలని ఈ టెలికం కంపెనీ ఇప్పటికే ప్రభుత్వానికి వినతి పెట్టుకుంది. మంగళవారం సెషన్లో విఐ షేర్ ధర 1.45 శాతం పెరిగి రూ.8.41 వద్ద ముగిసింది.