Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 55శాతం టీచర్లకు వేతనాలు కట్
- ఆదాయం లేక మూతపడుతున్న పాఠశాలలు : సీఎస్ఎఫ్ సర్వేలో వెల్లడి
న్యూఢిల్లీ : కరోనా సంక్షోభం దెబ్బకు మొత్తం విద్యారంగం విలవిల్లాడుతోంది. అందునా ప్రయివేటు పాఠశాలల సంగతి ఇక చెప్పక్కర్లేదు. చిన్న చిన్న ప్రయివేటు స్కూళ్లు దాదాపు మూతపడే పరిస్థితికి చేరుకున్నాయని, ఇందులో పనిచేసే టీచర్ల ఉపాధిని కరోనా సంక్షోభం పూర్తిగా దెబ్బతీసిందని 'సెంట్రల్ స్క్వేర్ ఫౌండేషన్'(సీఎస్ఎఫ్) అనే స్వచ్ఛంద సంస్థ నిర్వహించిన సర్వేలో తేలింది. దేశంలోని 20 రాష్ట్రాలు, ఒక కేంద్రపాలిత ప్రాంతంలో ఈ సర్వే నిర్వహించారు. ప్రయివేటు స్కూలు యాజమాన్యాల్ని, విద్యార్థుల్ని, తల్లిదండ్రుల్ని కలుసుకొని వారి అభిప్రాయాల్ని తీసుకు న్నారు. ఈ సర్వే ప్రకారం...సుదీర్ఘకాలంగా పాఠశాలు మూతపడటంతో వ్యవస్థ అంతా చిన్నాభిన్నమైంది. ప్రయివేటు స్కూళ్ల ఆదాయం 20 నుంచి 50శాతం వరకు పడిపోయింది. టీచర్లలో కనీసం 55శాతం మందికి జీతాల్లో కోత పడింది.
దేశంలో దాదాపు సగం మంది విద్యా ర్థులు ప్రయివేటు స్కూళ్లలోనే చదువుతు న్నారు. కరోనా సమస్యల నేపథ్యంలో విద్యార్థుల తల్లిదండ్రులు ఫీజులు కట్టలేకపోవటంతో స్కూళ్లకు ఆర్థిక సమస్యలు పెరిగాయి. దీని ప్రభావం ప్రయివేటు టీచర్ల ఉపాధిపై తీవ్రస్థాయిలో పడింది. పెద్ద మొత్తంలో ఫీజులు వసూలు చేసే ప్రయివేటు స్కూళ్లలో 37శాతం మంది టీచర్లకు, తక్కువ ఫీజులు వసూలు చేసే స్కూళ్లలో 65శాత మంది టీచర్లకు వేతనాలు చెల్లించడం ఆపేశారు. కరోనా నేపథ్యంలో అనేక కుటుంబాలు ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నప్పటికీ, స్కూల్ ఫీజులు తగ్గించలేదని కనీసం 70శాతంమంది పేరెంట్స్ సర్వేలో వాపోయారు.
వేల సంఖ్యలో మూతపడుతున్నాయి..
ఆన్లైన్ క్లాసుల వల్ల కంప్యూటర్లు, ఇతరత్రా సౌకర్యాలు సమకూర్చుకోవడం తల్లిదండ్రు లకు భారంగా మారింది. దీనివల్ల తమ ఖర్చులు మరింత పెరిగాయని 25శాతం మంది పేరెంట్స్ చెప్పారు. ఐక్యరాజ్యసమితికి చెందిన యునిసెఫ్ కూడా ప్రయివేటు స్కూళ్లపై కరోనా ప్రభావాన్ని అధ్యయనం చేసింది. అడ్మిషన్లు లేకపోవటంతో చిన్న చిన్న స్కూళ్లు వేల సంఖ్యలో మూతపడ్డాయని యునిసెఫ్ నివేదిక పేర్కొంది. ఇంకా చాలా స్కూళ్లు ఇదేబాటలో ఉన్నాయని వెల్లడిం చింది. ఇందులో పనిచేసే టీచర్లు ఎంతో మంది ఉద్యోగాలు పోయాయని, పనిచేస్తున్న కొంతమందికి జీతాల్లో కోతలు విధించారని తెలిపింది. ఆన్లైన్ క్లాసుల వల్ల అటు టీచర్లు, ఇటు విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారని యునిసెఫ్ వెల్లడించింది.