Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రైతుల సమస్యలు, పెగాసస్‌పై చర్చకు సర్కార్‌ను ఆదేశించండి
- రాజ్యాంగ గౌరవాన్ని, పార్లమెంటరీ నియమాలను కాపాడండి
- రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌కు ఏడు పార్టీల వినతి
న్యూఢిల్లీ : రాజ్యాంగ గౌరవాన్ని కాపాడాలనీ, పార్లమెంటరీ నియమ నిబంధనలను పరిరక్షించాలని రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌ను ఏడు పార్టీలు కోరాయి. ఈ మేరకు మంగళవారం ఎన్సీపీ, సీపీఐ(ఎం), బీఎస్పీ, సీపీఐ, ఎస్ఏడీ, ఆర్ఎల్డీ, నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీలు రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌కు వినతిపత్రం అందించాయి. రైతుల సమస్యలపైన, పెగాసస్ వ్యవహారంపైన చర్చజరిపే విధంగా ప్రభుత్వాన్ని ఆదేశించాలని ప్రతిపక్షపార్టీలు కోరాయి. అనంతరం ఎన్సీపీ నేత సుప్రియా సులే, ఎస్ఏడీ నేత హర్సిమ్రాత్ కౌర్ బాదల్ మీడియాతో మాట్లాడారు. పార్లమెంటులో రైతుల సమస్యలు, పెగాసస్‌పై చర్చకు జోక్యం చేసుకోవాలని ఏడు ప్రతిపక్ష పార్టీలు రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌ను కోరినట్టు తెలిపారు. పెగాసస్ వ్యవహారంపై లోక్‌సభలో వ్యవహరించాల్సిన వ్యూహంపై ప్రతిపక్షాలు భేటీ అయ్యాయి. పార్లమెంట్లో రాహుల్ గాంధీ నేతృత్వంలో సోమవారం జరిగిన సమావేశంలో అధిర్ రంజన్ చౌదరి, గౌరవ్ గొగొరు (కాంగ్రెస్), టిఆర్ బాలు, కనిమొళి (డీఎంకే), రితీష్ పాండే (బీఎస్పీ), సుప్రియా సులే (ఎన్సీపీ), ఎఎం ఆరీఫ్, ఎస్.వెంకటేషన్ (సీపీఐ(ఎం)), ఎన్‌కె ప్రేమ్ చంద్రన్ (ఆర్ఎస్పీ), మహ్మద్ బషీర్ (ఐయూఎంఎల్), హస్నైన్ మసూది (నేషనల్ కాన్ఫరెన్స్), థామస్ చాజికాదన్ (కేరళ కాంగ్రెస్) తదితరులు పాల్గొన్నారు.
అధికార, ప్రతిపక్షాలు ఆరోపణ, ప్రత్యారోపణలు
రైతుల సమస్యలు, పెగాసస్ వ్యవహారంపై పార్లమెంట్ ఉభయసభలూ గత కొద్ది రోజులుగా స్తంభించాయి. సభా కార్యకలాపాలు పూర్తిగా నిలిచిపోయాయి. దీనిపై అధికార, ప్రతిపక్షాలు ఒకరిపై మరొకరు విమర్శలు చేసుకున్నాయి. సభా కార్యక్రమాలు నిలిచిపోవడానికి మీరంటే... మీరని విమర్శలు చేసుకుంటున్నాయి. ప్రతిపక్షాల ఆందోళనతోనే సభా కార్యకలాపాలు నిలిచిపోయాయని అధికార పక్షం ప్రచారం చేస్తుంటే, దేశంలో ముఖ్యమైన రైతుల సమస్యలు, రాజ్యంగ విరుద్ధమైన పెగాసస్ నిఘా వ్యవహారంపై అధికార పక్షం చర్చకు సిద్ధపడకపోవడంతోనే సభా కార్యకలాపాలు స్తంభించాయని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి.
ప్రతిపక్షాల తీరును ప్రజల్లోకి తీసుకెళ్లండి : బీజేపీ ఎంపీలకు మోడీ దిశానిర్దేశం
పార్లమెంటు సమావేశాలు జరగకుండా అడ్డుకుంటున్న ప్రతిపక్షాల తీరును ప్రజల్లోకి తీసుకువెళ్లాలని ప్రధాని నరేంద్ర మోడీ బీజేపీ ఎంపీలకు దిశానిర్దేశం చేశారు. పార్లమెంట్ ఆవరణలో మంగళవారం జరిగిన బీజేపీ పార్లమెంటరీ పార్టీ సమావేశాన్ని ఉద్దేశించి మోడీ మాట్లాడారు. పార్లమెంటు ప్రొసీడింగ్స్‌కు సంబంధించిన ఏ సమావేశంలోనూ ప్రతిపక్షాలు పాల్గొనకపోవడం, ఉభయ సభల కార్యక్రమాలను జరగకుండా అడ్డుకోవడం వంటి చర్యలను ప్రజల దృష్టికి తేవాలని ఎంపీలకు సూచించారు.
సమస్యలను పరిష్కారానికి మోడీ సిద్ధంగా లేరు : ప్రతిపక్షాలు
పార్లమెంట్ ఉభయ సభలు వాయిదా అనంతరం విజరు చౌక్ వద్ద ప్రతిపక్ష పార్టీల నేతలు మల్లికార్జున ఖర్గే, ఆనంద్ శర్మ(కాంగ్రెస్), ఎలమారం కరీం (సీపీఐ(ఎం)), తిరుచ్చి శివ(డీఎంకే), బినరు విశ్వం(సీపీఐ), మనోజ్ కుమార్ ఝా(ఆర్జేడీ), రామ్ గోపాల్ యాదవ్(ఎస్పీ), సుశీల్ గుప్తా(ఆప్) తదితరులు మీడియాతో మాట్లాడారు. దేశంలో నియంతత్వం నడుస్తోందని విమర్శించారు. ''ప్రజాస్వామ్య పద్ధతిలో సమస్యలను పరిష్కరించడానికి మోడీ సిద్ధంగా లేరు. చర్చలకు మేం సిద్ధంగా ఉన్నాం. ప్రభుత్వం అఖిలపక్ష సమావేశాన్ని పిలవాలి. ఈ అంశంపై మేమంతా పోరాడబోతున్నాం'' అని అన్నారు.
''నిఘాకు ఈ ప్రభుత్వం అనుమతినిచ్చింది. న్యాయమూర్తులు, ఆర్మీ అధికారులు, జర్నలిస్టులు, ప్రతిపక్ష నాయకులపై నిఘా పెట్టడం ప్రపంచంలో ఏ ప్రజాస్వామ్యం చేయదు'' అన్నారు. ''ప్రజాస్వామ్యాన్ని నిఘా రాష్ట్రంగా మార్చకుండా'' ప్రతిపక్షాలు పోరాడుతున్నాయి. పెగాసస్‌పై చర్చజరిపి, సుప్రీంకోర్టు నేతృత్వంలో దర్యాప్తు చేపడితే తాము ఆందోళన ఎందుకు చేస్తామని ప్రశ్నించారు. ప్రభుత్వం నిర్లక్ష్యం వల్లే తాము ఆందోళన చేస్తున్నామని పేర్కొన్నారు.
పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ భేటీని బహిష్కరించిన బీజేపీ
పెగాసస్‌పై చర్చ జరపాల్సిన ఐటీ పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ భేటీని బీజేపీ ఎంపీలు బహిష్కరించారు. మంగళవారం పార్లమెంట్ కమిటీ చైర్మెన్ శశిథరూర్ నేతృత్వంలో కమిటీ సమావేశం జరిగింది.దీనికి హాజరైన బీజేపీ సభ్యులు పెగాసస్‌పై చర్చ చేపట్టేందుకు నిరాకరించి సమావేశాన్ని బహిష్కరించారు. అనంతరం వారు మీడియాతో మాట్లాడుతూ రహస్యంగా ఉండాల్సిన సమావేశ ఎజెండా ముందుగానే బయటకు లీక్ అయిందనీ, అందువల్లే తాము బహిష్కరిస్తున్నామని తెలిపారు.