Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మోడీ సర్కార్ ప్రకటన.. రైతు నెత్తిన అప్పు 17లక్షల కోట్లు
- దిక్కుతోచనిస్థితిలో అన్నదాతలు
ఒక్క ఛాన్స్ ప్లీజ్.. గత పాలకులు రైతును వాడుకున్నారు. ద్రోహం చేశారు. వారికండ్లల్లో కన్నీరు లేకుండా చూస్తా. స్వామినాథన్ కమిటీ సిఫారసులను తప్పకుండా అమలుచేస్తా. అన్నదాతల ఆదాయాన్ని రెండింతలు చేస్తాం.
-2014 సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ ప్రధాని మోడీ ఇచ్చిన హామీ
న్యూఢిల్లీ : ఏడేండ్లు గడిచినా రైతు బతుకుమారలేదు. మట్టిలో పుట్టి..మట్టిలో పెరిగిన అన్నదాత దిక్కుతోచనిస్థితిలో కొట్టుమిట్టాడుతూనే ఉన్నాడు. పొద్దునలేచి పొలంలో పంటను చూసి మురిసిపోయే రైతు కుటుంబాలు రోడ్డున పడ్డాయి. గత్యంతరం లేనిపరిస్థితుల్లో కాడి వది లేద్దామనుకున్నా మనసొప్పటంలేదు. బీజేపీ ఇచ్చిన హామీలు కాస్త నీటి మూటలవుతున్నాయి. ఓవైపు అన్నదాతను అణగదొక్కేలా నల్లచట్టాలను తెరపైకి తెచ్చింది. ఢిల్లీ సరిహద్దులో ఎనిమిది నెలల నుంచి నల్లచట్టాలను రద్దు చేయాలని కోరుతున్నా ససేమిరా అంటున్నది. తాజాగా రైతు నెత్తిన శిరోభారంగా 17లక్షలకోట్ల అప్పు ఉన్నట్టు నాబార్డ్ గణాంకాలు ధ్రువీకరి స్తున్నాయి. అయితే రుణమాఫీ ఆలోచన ఉన్నదా అంటూ ఓ ఎంపీ అడిగితే అలాంటి ఆలోచన ఏదీ లేదని పార్లమెంట్ సాక్షిగా కేంద్ర ఆర్థిక సహాయమంత్రి డాక్టర్ భగ్వత్ కరాడ్ లిఖితపూర్వకంగా సమాధానమి చ్చారు. దీంతో అన్నదాతల్లో సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతున్నది.
తీసుకున్న రుణం
మార్చి 31 2021 నాటికి రాష్ట్రాల వారీగా సేద్యానికి తీసుకున్న రుణాలను పరిశీలిస్తే.. హర్యానా రూ. 78,311.43 కోట్లు, హిమాచల్ ప్రదేశ్ రూ.9,605.39కోట్లు, జమ్మూ,కాశ్మీర్ రూ.9902.13, పంజాబ్ 71,305.57కోట్లు, రాజస్థాన్ రూ.120979.21, చండీగఢ్ 2,449.50, అసోం 9,393.85, త్రిపుర రూ.3133.00, బీహార్రూ.49800.70, గుజరాత్ రూ.90695.25, మహారాష్ట్ర రూ.153698.32కోట్లు, ఆంధ్ర ప్రదేశ్ రూ. 169322.96, తెలంగాణ రూ. 84005.43 కోట్లు, కర్నాటక రూ.143365.63 కోట్లు, కేరళ రూ.84386.53 కోట్లు, తమిళనాడు రూ.189623.56 కోట్లు అప్పుతీసుకున్నాయి. ఇలా మొత్తం అన్ని రాష్ట్రాలు కలిసి రూ.16,80,366.77 కోట్ల రుణం ఉన్నది.
నాబార్డ్ గణాంకాల ప్రకారం...
రుణం లేనిదే సాగు చేయటం కష్టంగా మారింది. నాబార్డ్ గణాంకాల ప్రకారం.. దేశంలోని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లోని రైతులూ రుణాలు తీసుకున్నారు. ఈ జాబితాను పరిశీలిస్తే.. తమిళనాడులో అత్యధికంగా రైతులు రుణం తీసుకున్నారు. ఈ ఒక్క రాష్ట్రంలోనే 1.89 లక్షల కోట్ల మేర అప్పు ఉన్నది. ఇటీవల పంజాబ్ సర్కార్ 590 కోట్ల మేర ఉన్న రైతు రుణాలను రద్దుచేస్తామని ప్రకటించింది. వ్యవసాయరుణమాఫీ యోజన కింద ఈ నిర్ణయం తీసుకున్నట్టు అమరీందర్ ప్రభుత్వం వెల్లడించింది. ఇప్పటివరకు 5.64 లక్షల మంది రైతులు తీసుకున్న 4624 కోట్ల మేర రుణాలను రద్దుచేసింది. మిగతా రాష్ట్రాల్లో కూడా తమపై భారమైన రుణాలు తీర్చాలని అన్నదాతలు, రైతు సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. అయితే మోడీ సర్కార్ మొండిగా నల్లచట్టాలను అమలుచేయటానికి ప్రయత్నిస్తున్నది. మరోవైపు రైతులు తీసుకున్న రుణాలు కట్టాల్సిందేనంటూ పార్లమెంట్ సాక్షిగా కేంద్రం ప్రకటించటంపై రైతులోకం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నది.
ఈ ఐదు రాష్ట్రాల్లో అత్యధిక రుణాలు..
రాష్ట్రం రుణం(కోట్లల్లో)
తమిళనాడు 189623.56
ఆంధ్రప్రదేశ్ 169322.96
ఉత్తర్ప్రదేశ్ 155743.87
మహారాష్ట్ర 153658.32
కర్నాటక 14365.63