Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సుప్రీంకోర్టులో ప్రముఖ జర్నలిస్టులు ఎన్.రామ్, శశికుమార్‌లు పిటిషన్
న్యూఢిల్లీ : పెగాసస్ కుంభకోణంపై రిటైర్ట్ సుప్రీంకోర్టు న్యాయమూర్తితో విచారణ జరిపించా లని ప్రముఖ జర్నలిస్టులు ఎన్.రామ్, శశికుమార్ బాలకృష్ణన్ మీనన్‌లు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. కేంద్ర ప్రభుత్వ సంస్థలు ఇజ్రాయిల్ స్పైవేర్‌ను కొనుగోలు చేశాయా? లేదా? అన్నది మోడీ సర్కార్ బయటపెట్టే విధంగా తగిన ఆదేశాలు జారీ చేయాలని సుప్రీంకోర్టును వారు కోరారు. సీనియర్ జర్నలిస్టుగా, 'ద హిందూ' ఎడిటర్ ఇన్ చీఫ్‌గా ఎన్. రామ్ సుపరిచితులు. ప్రస్తుతం ఆయన హిందూ గ్రూప్ ఆఫ్ పబ్లికేషన్స్‌కు డైరెక్టర్‌గా ఉన్నారు. ఏసియన్ కాలేజ్ ఆఫ్ జర్నలిజంలో మీడియా డెవలప్మెంట్ ఫౌండేషన్ వ్యవస్థాపకులుగా ప్రముఖ జర్నలిస్టు శశికుమార్ ఉన్నారు.మిలటరీ గ్రేడ్ తయారీ అయిన స్పైవేర్‌ను(పెగాసస్) ఉపయోగించి దేశంలో ఎంతోమంది వ్యక్తిగత గోప్యత హక్కుకు భంగం కలిగించారని, ప్రాథమిక హక్కులను కాలరాశారని పిటిషన్‌దారులు ఆరోపించారు. ప్రజాస్వామ్యంలో అత్యంత ముఖ్యమైనదిగా పేర్కొనే 'మీడియా'ను బెదిరించేందుకు, జర్నలిస్టులను ప్రభావితం చేసేందుకు పెగాసస్‌ను ప్రయోగించారని పిటిషన్లో వారు ప్రస్తావించారు. పెగాసస్ కుంభకోణంలో భారత ప్రభుత్వ పాత్ర కనపడుతోంది. నిఘా కార్యకలాపాలు కొనసాగలేదని కేంద్రం స్పష్టంగా చెప్పటం లేదని, తీవ్రమైన ఆరోపణలు వస్తున్న ఒక అంశంపై స్వతంత్ర విచారణ జరుపుతామని కూడా కేంద్రం చెప్పటం లేదని వారు సుప్రీంకోర్టుకు తెలియజేశారు. జర్నలిస్టులు, డాక్టర్లు, పౌర హక్కుల కార్యకర్తలు, కేంద్ర మంత్రులు, ప్రతిపక్ష నాయకులపై హ్యాకింగ్ కార్యకలాపాల్ని పెగాసస్ కుంభకోణం బయటపెట్టింది. స్పైవేర్‌తో ఎంతోమంది వ్యక్తుల వ్యక్తిగత జీవితంలోకి చొరబడి ప్రాథమిక హక్కులకు భంగం కలిగించారని ఎన్.రామ్, శశికుమార్ తమ పిటిషన్లో ఆరోపించారు. టెలిగ్రాఫిక్ చట్టంలోని సెక్షన్ 5(2)ను కేంద్రం ఉల్లంఘించిందని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. ''ప్రజా భద్రత కోసం చేపట్టే అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే చట్టపరమైన నిఘాను చేపట్టాలి. కేంద్ర ప్రభుత్వం తన రాజకీయ ప్రయోజనాల కోసం నిఘాకు దిగరాదు'' అని వారు అన్నారు.