Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పెగాసస్‌పై ప్రతిపక్షాల ఆందోళన
- లోక్‌సభ తొమ్మిది, రాజ్యసభ నాలుగు సార్లు వాయిదా
- రాజ్యసభలో మెరైన్ నావిగేషన్ బిల్లు ఆమోదం
న్యూఢిల్లీ : 'పెగాసస్' స్పైవేర్ అంశం పార్లమెంటు ఉభయసభలను ఆరవ రోజైన మంగళవారం నాడూ కుదిపేసింది. పెగాసస్ వ్యవ హారంపై తక్షణం చర్చ జరపాలంటూ పార్లమెంటు ఉభయసభల్లో ప్రతిపక్షాల నిరసనల పర్వం కొనసాగింది. వెల్‌లో ప్లకార్డులు చేబూని ప్రతిపక్ష సభ్యులు ఆందోళన చేపట్టారు. పెగాసస్, రైతుల ఉద్యమం సంబంధిత అంశాలపై చర్చకు ప్రతిపక్ష ఎంపీలు పట్టుబట్టాయి. దీంతో ఉభయ సభల్లో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. ఫలి తంగా పార్లమెంట్ సభా కార్యకలాపాలకు తీవ్ర అంతరాయం ఏర్పాడింది. దీంతో ఉభయ సభలు వాయిదాల మీద.. వాయిదాలు పడ్డాయి. లోక్‌సభ తొమ్మిది సార్లు, రాజ్యసభ నాలుగుసార్లు వాయిదాపడింది. చివరికి బుధవారం నాటికి ఉభయ సభలూ వాయిదా పడ్డాయి. తొలుత లోక్‌సభ ప్రారంభం కాగానే ప్రతిపక్ష ఎంపీలు ఆందోళనకు దిగారు. పెగాసస్, వ్యవసాయ చట్టాలపై చర్చ జరపాలంటూ ప్లకార్డులతో ఆందోళన చేపట్టారు. నిఘాను వెంటనే ఆపాలని డిమాండ్ చేశారు. ప్రతిపక్షాల నినాదాల నడుమే స్పీకర్ ఓం బిర్లా ప్రశ్నోత్తరాలు నిర్వహించారు. ప్రతిపక్ష ఎంపీలు అడిగిన కొన్ని ప్రశ్నలకు కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ సహా పలువురు మంత్రులు సమాధానమిచ్చారు. అయితే, ప్రతిపక్ష ఎంపీలు ఆందోళన ఉధృతం చేయడంతో స్పీకర్ వారిని వారించారు. ప్రజా ప్రయోజనాలకు సంబంధించిన అంశాలపై చర్చలో పోటీ చూపించాలనీ, నిరసనల్లో కాదని సూచించారు. అయినప్పటికీ వారు శాంతించకపోవడంతో సభను 11.45 గంటల వరకు వాయిదా వేశారు. అనంతరం ప్రారంభమైన సభలో నెలకొన్న గందరగోళ పరిస్థితిలో మార్పు రాకపోవడంతో సభ మధ్యాహ్నం 12 గంటలకు, తరువాత 12.30 గంటలకు, 2 గంటలకు, 2.30 గంటలకు, 3 గంటలకు, 3.30 గంటలకు, సాయంత్రం 4 గంటలకు, 4.30 గంటలకు వాయిదా పడ్డాయి. అనంతరం బుధవారానికి వాయిదా పడింది. ఇన్ని సార్లు కూడా సభ ప్రారంభమైన కొద్ది సేపటికే వాయిదాల పర్వం కొనసాగింది. మధ్య మధ్యలో జీరో అవర్ అంశాల ప్రస్తావన కొద్ది సేపు నడిచింది.అటు రాజ్యసభలోనూ ఇదే పరిస్థితి నెలకొంది. పెగాసస్ అంశం రాజ్యసభనూ కుదిపేసింది. పెగాసస్‌పై చర్చ జరపాలంటూ ప్రతిపక్షాలు ఆందోళనకు దిగాయి. కాంగ్రెస్, టీఎంసీ, సీపీఐ(ఎం), సీపీఐతో పాటు ఇతర ప్రతిపక్షాల ఎంపీలు వెల్‌లోకి దూసుకెళ్లి నినాదాలు చేశారు. దీంతో సభలో తీవ్ర గందరగోళం నెలకొంది. సభ ప్రారంభమైన కొద్దిసేపటికే చైర్మెన్ వెంకయ్య నాయుడు సభను మధ్యాహ్నం 12 గంటలకు వాయిదా వేశారు. అనంతరం ప్రారంభమైన సభ మధ్యాహ్నం 2 గంటలకు, 3 గంటల, సాయంత్రం 4 గంటలకు వెంట వెంటనే వాయిదా పడింది. అనంతరం సభ పూర్తిగా బుధవారం నాటికి వాయిదా పడింది.
ఆందోళన నడుమ...
ప్రతిపక్షాలు ఆందోళన నడుమ రాజ్యసభలో మెరైన్, నావిగేషన్ బిల్లు ఆమోదం పొందింది. పూర్తిస్థాయి చర్చలేకుండా కొద్దిమంది అధికార పార్టీ నేతలు, ఇతర పార్టీలతో మాట్లాడించి మమ అనిపించారు. అనంతరం మూజువాణి ఓటుతో బిల్లును ఆమోదించుకున్నారు. రైతులకు మద్దతుగా పార్లమెంట్ ముగిసిన తరువాతా కాంగ్రెస్ ఎంపీలు రవనీత్ సింగ్ బిట్టు, గుర్జిత్ సింగ్ అజ్లా ఆందోళనను కొనసాగించారు. వారికి శివసేన ఎంపీ అరవింత్ గణపతి సావంత్ మద్దతు తెలిపారు.