Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- భారత పర్యటనలో అమెరికా విదేశాంగ మంత్రి బ్లింకెన్
- భారత్‌తో బంధం ప్రత్యేకమైంది..
న్యూఢిల్లీ : అమెరికా-భారత్ మధ్య వ్యూహాత్మక సంబంధాలకు మించి స్వేచ్ఛ, సమానత్వం, ప్రజాస్వామ్య హక్కులకే ప్రాధాన్యత ఉంటుందని అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోని బ్లింకెన్ అన్నారు. ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేయడంలో భారత్, అమెరికాలు కీలక భూమిక పోషించగలవని చెప్పారు. రెండు రోజుల పర్యటన నిమిత్త్తం భారత్ చేరుకున్న బ్లింకెన్, ఇరు దేశాల ద్వైపాక్షిక సంబంధాలపై భారత విదేశీ వ్యవహారాల మంత్రి ఎస్.జైశంకర్‌తో బుధవారం భేటీ అయ్యారు. న్యూఢిల్లీలో పౌర హక్కుల ప్రతినిధులు ఏర్పాటుచేసిన ఒక రౌండ్ టేబుల్ సమావేశంలో బ్లింకెన్ మాట్లాడుతూ పై వ్యాఖ్యలు చేశారు. మోడీ సర్కార్ తీరును తప్పుబడుతూ కాశ్మీర్ అంశం, రైతు ఉద్యమంపై అమెరికా గతంలో చేసిన ప్రకటనలు మీడియాలో చర్చనీయాంశమయ్యాయి. ఇప్పుడు భారత్‌లో అడుగుపెట్టగానే స్వేచ్ఛ, ప్రజాస్వామ్య హక్కులపై బ్లింకెన్ వ్యాఖ్యలు చేయటం మీడియాలో ప్రాధాన్యత సంతరించుకుంది. భారత పర్యటనలో బ్లింకెన్, ప్రధాని నరేంద్రమోడీతో సమావేశమయ్యే అవకాశం ఉంది. ఈ పర్యటన ముగించుకున్నాక... ఆయన కువైట్‌కు బయల్దేరి వెళ్తారు. అమెరికా అధ్యక్షుడిగా జో బైడెన్ బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఆ దేశ విదేశాంగ మంత్రి భారత పర్యటనకు రావటం ఇదే తొలిసారి. రౌండ్ టేబుల్ సమావేశంలో బ్లింకెన్ మాట్లాడుతూ..'' ప్రాథమిక స్వేచ్ఛ, మానవ హక్కులను అమెరికా గౌరవిస్తుంది. భారత్‌ను మేము ఇదే కోణంలో చూస్తాం. భారత ప్రజాస్వామ్యం పౌరుల స్వేచ్ఛాయుత ఆలోచనలతో కూడుకున్నది'' అని అభిప్రాయపడ్డారు. భారత్, అమెరికా మధ్య నెలకొన్న సంబంధాలు ప్రత్యేకమైనదని, ఇటువంటివి ప్రపంచవ్యాప్తంగా కొన్ని దేశాలకే పరిమితమైందని అన్నారు. భవిష్యత్తులో ఈ భాగాస్వామ్యాన్ని మరింత బలోపేతం చేయడం అమెరికా విదేశాంగ విధానంలో అతి ప్రధానమైనదని బ్లింకెన్ స్పష్టం చేశారు.