Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సమ్మెను కొనసాగిస్తాం : అంబులెన్స్ ఉద్యోగులు
న్యూఢిల్లీ : నిరవధిక సమ్మెకు దిగిన అంబులెన్స్ ఉద్యోగులపై 'ఎస్మా' ప్రయోగిస్తామని ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ ప్రకటించారు. తమ డిమాండ్లు నెరవేరే వరకూ సమ్మెను కొనసాగిస్తామని మరోవైపు అంబులెన్స్ ఉద్యోగులు తేల్చిచెప్పారు. ఉత్తరప్రదేశ్‌లో గత సోమవారం నుంచి అంబులెన్స్ ఉద్యోగులు నిరవధిక సమ్మెకు దిగారు. రాష్ట్ర వ్యాప్తంగా 102,108అంబులెన్స్ వాహనాల్లోవేలాది మంది పనిచేస్తున్నారు. అయితే కొద్దిరోజుల క్రితం 250 అడ్వాన్స్డ్ లైఫ్ సపోర్ట్ ఉన్న అంబులెన్స్‌ల నిర్వహణ కాంట్రాక్ట్ 'జికిట్జా' హెల్త్‌కేర్ లిమిటెడ్ దక్కించుకుంది. ఈ నేపథ్యంలో సిబ్బందిలో కొంతమందిని తొలగించే అవకాశముందని 'జికిట్జా' ప్రకటించింది. దాంతో రాష్ట్రవ్యాప్తంగా అంబులెన్స్ ఉద్యోగులు సమ్మెను చేపట్టారు. 102, 108 వాహనాల్లో పనిచేస్తున్న సిబ్బందికి ఉద్యోగ భద్రత కల్పించాలని, కాంట్రాక్ట్ పద్ధతి రద్దు చేయాలని ఉద్యోగులు యూపీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. మొన్నటివరకూ రాష్ట్రంలో అంబులెన్స్ వాహనాల నిర్వహణ జీవీకే-ఈఎంఆర్ఐ కంపెనీ నిర్వర్తించింది. రాష్ట్ర వ్యాప్తంగా అంబులెన్స్‌లలో దాదాపు 19వేల మంది ఉద్యోగులు పనిచేస్తున్నారని సమాచారం. ఇప్పుడు కాంట్రాక్ట్‌ను 'జికిట్జా' దక్కించుకోవటంతో వేలాది మంది ఉద్యోగుల్లో ఆందోళన మొదలైంది. పాత వాళ్లను కొనసాగిస్తామని జికిట్జా స్పష్టత ఇవ్వలేదు. కొత్త కంపెనీకి కాంట్రాక్ట్ ఇవ్వటం వల్ల వేలాది మంది ఉద్యోగాలు పోయి..రోడ్డున పడే పరిస్థితి వచ్చిందని అంబులెన్స్ ఉద్యోగుల సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.