Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 8రోజులు నడిచాక దారి మధ్యలో భార్యకు అస్వస్థత
- ఆగ్రాలో వలస కార్మికుడికి స్థానిక జర్నలిస్టులు సాయం
న్యూఢిల్లీ : చేతిలో చిల్లగవ్వలేక..కట్టుబట్టలతో ఒక కుటుంబం రోడ్డుమీద కొస్తే వారి బాధ వర్ణణాతీతం. కరోనా రెండో వేవ్ కారణంగా ఉపాధి కోల్పోయిన ఒక వలస కార్మికుడు తాజాగా ఇలాంటి పరిస్థితినే ఎదుర్కొన్నాడు. గత కొంతకాలంగా ఆదాయంలేక మధ్యప్రదేశ్‌కు చెందిన కార్మికుడు రమేశ్ ఢిల్లీ నగరాన్ని వీడి స్వంత ఊరు(భోపాల్‌కు దగ్గర) వెళ్లాలనుకున్నాడు. చేతిలో కొద్దిపాటి డబ్బు..అది ఆహారం కోసం దాచుకున్నాడు. భార్యను తీసుకొని కాలినడకన ఢిల్లీ నుంచి భోపాల్‌కు బయల్దేరాడు. 8రోజుల ప్రయాణం తర్వాత ఆగ్రాలో ఆయన భార్య తీవ్ర అస్వస్థతకు గురైంది. అక్కడి ఓ హాస్పిటల్లో చేర్చేందుకు అతడి దగ్గర డబ్బులు లేకపోవటంతో..స్థానిక జర్నలిస్టులకు ఈ విషయం తెలిసింది. దాంతో వారు చొరవజేసి బాధితురాలికి వైద్యసాయం అందేట్టు చేశారు. ఈ ఘటన గురించి ఆంగ్ల న్యూస్ వెబ్సైట్ వార్తను వెలువరించించడంతో, సామాజిక మాధ్యమంలో ఈ విషయం వైరల్‌గా మారింది.
ఎందుకీ పరిస్థితి?
ఢిల్లీలో ఒక నిర్మాణరంగ కంపెనీలో దినసరి కూలీగా రమేశ్ పనిచేస్తున్నాడు. రెండోవేవ్ ఉధృతంగా ఉన్న సమయంలో పని ప్రదేశంలో సూపర్వైజర్ కరోనాబారిన పడి చనిపోయాడు. ఆనాటి నుంచి రమేశ్‌కు ఉపాధి లేకుండా పోయింది. యజమాని పని ఇవ్వటం లేదు. మరోవైపు తన దగ్గరున్న కొద్దిపాటి డబ్బూ అయిపోయింది. ఇక స్వంత ఊరు (భోపాల్‌కు దగ్గర)కు వెళ్లాలని నిర్ణయించుకున్నాడు. కేవలం ఏదైనా తినేందుకు సరిపోయే డబ్బులు మాత్రమే అతడి దగ్గర ఉండటంతో, భార్యతో కలిసి రమేశ్ కాలినడకన భోపాల్ దిశగా బయల్దేరాడు.
ఎనిమిది రోజులుపాటు నడిచీ...నడిచీ ఇద్దరూ తీవ్రంగా అలసిపోయారు. సరైన తిండిలేక రమేశ్ భార్య అస్వస్థతకు గురైంది. గత మంగళవారం ఆగ్రాకు వచ్చాక స్థానిక జర్నలిస్టుల సాయంతో హాస్పిటల్లో చేర్పించాడు. కరోనా రెండో వేవ్ ఢిల్లీలో ఎంతోమంది వలస కార్మికులకు ఉపాధిని దూరం చేసింది. ఎన్నో వేల కుటుంబాలు రోడ్డున పడ్డాయి. వీరి సంక్షేమం కోసం పాలకుల నిర్ణయాలు కేవలం ప్రకటనలకే పరిమితమయ్యాయని విమర్శకులు చెబుతున్నారు.