Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- నేడు లోక్‌సభలో తీర్మానం పెట్టేందుకు అధికార పక్షం యోచన
- పార్లమెంట్లో మళ్లీ అదే రగడ
- పెగాసస్‌పై చర్చకు ప్రతిపక్షాల డిమాండ్
- నిరాకరిస్తున్న ప్రభుత్వం
- ఉభయసభల్లో కొనసాగిన ఆందోళనలు
- స్పీకర్ పోడియంపైకి పేపర్లు విసిరిన ఎంపీలు
న్యూఢిల్లీ : కాంగ్రెస్, సీపీఐ(ఎం)కు చెందిన పది మంది ఎంపీలపై సస్పెన్షన్ వేటు వేసేందుకు కేంద్ర ప్రభుత్వం యోచిస్తున్నట్టు సమాచారం. పార్లమెంట్లో పెగాసస్ నిఘా వ్యవహారం, రైతు సమస్యలపై బుధవారం కూడా ప్రతిపక్షాల ఆందోళన కొనసా గింది. లోక్‌సభలో ప్రతిపక్ష ఎంపీలు పేపర్లు చించి పైకి విసిరారు. అవి స్పీకర్ చైర్, కేంద్ర మంత్రులు, ట్రెజరీ బెంచ్లవైపు ఎగిరాయి. దీంతో సభలో ఒకింత ఉద్రిక్త వాతావరణం నెలకొంది. దీనిపై ఆగ్రహం వ్యక్తం చేసిన అధికార పార్టీ ప్రతిపక్ష సభ్యులను సభ నుంచి సస్పెండ్ చేసేందుకు యోచిస్తోన్నట్టు సమాచారం. అందులో భాగంగానే నేడు తీర్మానం ప్రవేశపెట్టేందుకు అధికారపక్షం నిర్ణయించినట్టు తెలుస్తున్నది. రూల్ నెంబర్ 374(2) కింద పార్లమెంట్‌ను అగౌరవపరిచారన్న పేరుతో కాంగ్రెస్ ఎంపీలు మణికం ఠాగూర్, డిన్ కురియాకోస్, హిబి ఈడెన్, ఎస్ జ్యోతిమణి, రావనీత్ బిట్టు, గుర్జీత్ ఆజ్లా, టిఎన్ ప్రతాపన్, వి వైతిలింగం, సప్తగిరి శంకర్, దీపక్ బైజ్, సీపీఐ(ఎం) ఎంపీ ఎఎం ఆరిఫ్‌ను సస్పెండ్ చేయాలని నిర్ణయించినట్టు సమాచారం.
దద్దరిల్లిన ఉభయసభలు
పెగాసస్‌తో ఫోన్ హ్యాకింగ్ వ్యవహారంపై ప్రతిపక్షాల ఆందోళనలతో పార్లమెంట్ ఉభయ సభలు దద్దరిల్లాయి. ఈ అంశంపై చర్చకు పట్టుబట్టిన ప్రతిపక్ష ఎంపీలు, వెల్‌లోకి దూసుకెళ్లి ఆందోళన చేపట్టారు. ప్లకార్డులు చేతబట్టి పెద్దఎత్తున నినాదాలు చేశారు. దీంతో ఉభయ సభలు వాయిదాల పర్వం తొక్కాయి. అయితే ప్రతిపక్షాల ఆందోళన నడుమే ఉభయ సభల్లో ప్రశ్నోత్తరాలు జరిగాయి. అలాగే కొన్ని బిల్లులు ఆమోదం పొందాయి.లోక్‌సభ ప్రారంభం కాగానే ప్రతిపక్ష సభ్యులు ఆందోళనకు దిగారు. స్పీకర్ పోడియం వద్దకు వెళ్లి ప్లకార్డులతో నినాదాలు చేశారు. వారి ఆందోళనల నడుమే స్పీకర్ ఓం బిర్లా ప్రశ్నోత్తరాలను చేపట్టారు. మరోవైపు ప్రతిపక్ష సభ్యులు నిరసనను మరింత ఉధృతం చేశారు.
ప్రశ్నోత్తరాలు ముగిసిన తరువాత సభను మధ్యాహ్నం 12.30 గంటల వరకు వాయిదాy ేశారు. విరామం తరువాత సభ తిరిగి ప్రారంభమైనప్పటికీ సభ్యులు మరోసారి ఆందోళనకు దిగారు. దీంతో సభ మధ్యాహ్నం 2 గంటల వరకు వాయిదా పడింది. అనంతరం ప్రారంభమైన సభలోనూ ప్రతిపక్షాల ఆందోళన కొనసాగింది. నిఘా ఆపాలనీ, చర్చ జరపాలని నినాదాలో చేపట్టారు. దీంతో సభలో గందరగోళం నెలకొనడంతో సభను మధ్యాహ్నం 3 గంటలకు వాయిదా వేశారు. తిరిగి ప్రారంభమైన సభలోనూ అదే గందరగోళం కొనసాగింది. దీంతో సభను సాయంత్రం 4 గంటలకు వాయిదా వేశారు. మళ్లీ ప్రారంభమైన సభలోనూ పరిస్థితిలో ఎటువంటి మార్పూరాలేదు. దీంతో సభ ప్రారంభమైన వెంటనే గురువారం నాటికి వాయిదా వేశారు.
ప్రభుత్వం సమాధానం చెప్పాల్సిందే : దద్దరిల్లిన రాజ్యసభ
అటు రాజ్యసభలోనూ ప్రతిపక్ష సభ్యులు గళమెత్తారు. పెగాసస్ స్పైవేర్‌ను అక్రమంగా వాడటంపై ఆందోళన చేపట్టారు. దీనిపై ప్రభుత్వం సమాధానం చెప్పాలంటూ వెల్‌లోకి దూసుకెళ్లి ఆందోళనకు దిగారు. ప్లకార్డులు చేబూని చైర్మెన్ పోడియాన్ని చుట్టుముట్టారు. దీంతో అసహనానికి గురైన చైర్మెన్ వెంకయ్య నాయుడు సభ ప్రారంభమైన కొద్ది నిమిషాలకే మధ్యా హ్నం 12 గంటల వరకు వాయిదా వేశారు. ఆ తరువాత మళ్లీ మధ్యాహ్నం 12 గంటలకు సభ మొదలవగా.. ప్రతిపక్ష ఎంపీలు సీట్లలోనుంచి లేచి ఆందోళన చేపట్టారు. పెగాసస్‌పై చర్చ జరపాలంటూ వెల్‌లోకి దూసుకెళ్లి నినాదాలు చేశారు.దీంతో సభను మధ్యాహ్నం 2 గంటల వరకు వాయిదా వేశారు.తిరిగి ప్రారంభమైన సభలోనూ ప్రతిపక్షాల ఆందోళన కొనసాగింది.దీంతో సభను వెంటనే మధ్యాహ్నం 2.45 గంటలకు వాయిదా వేశారు.అనంతరం ప్రారంభమైన సభలో మార్పు రావకపోవడంతో సభను గురువారానికి వాయిదా వేశారు.ఉభయ సభల్లో ప్రతిపక్షాల ఆందోళనల నడుమే కొన్ని బిల్లులు ఆమోదం పొందాయి. ఎటువంటి చర్చ జరగకుండా మూజువాణి ఓటుతో బిల్లులు ఆమోదం పొందాయి. రాజ్యసభలో జువెనైల్ జస్టిస్ సవరణ బిల్లు ఆమోదం పొందింది. లోక్‌సభలో కేటాయింపులకు సంబంధించిన రెండు బిల్లులు, దివాలా బిల్లు ఆమోదం పొందాయి.