Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కొన్నారా..? లేదా..? మోడీ ప్రభుత్వాన్ని నిలదీసిన ప్రతిపక్షాలు
- పెగాసస్ నిఘా రాజద్రోహం కాదా? : రాహుల్
- ప్రజాస్వామ్యంపై మోడీ, షా దాడి
- ప్రభుత్వాన్ని బోనులో నిలబెట్టేందుకు ఏకతాటిపైకి 14 ప్రతిపక్ష పార్టీలు
న్యూఢిల్లీ : 'మోడీ ప్రభుత్వాన్ని ఒక్కటే అడుగుతున్నాం. దేశ ప్రజలపై నిఘా కోసం ఇజ్రాయిల్‌కు చెందిన ఎన్ఎస్ఒ గ్రూపు నుంచి పెగాసస్ స్పైవేర్‌ను కొన్నారా? లేదా? తేల్చి చెప్పాలి' అని యావత్ ప్రతిపక్షం నిలదీసింది. పెగాసస్ నిఘాపై ప్రభుత్వాన్ని బోనులో నిలబెట్టేందుకు పద్నాలుగు ప్రతిపక్ష పార్టీలు బుధవారం రాజ్యసభలో ప్రతిపక్ష నాయకుడు మల్లికార్జున ఖర్గే చాంబర్లో సమావేశమై ఉమ్మడి వ్యూహాన్ని రూపొందించాయి. కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో మల్లికార్జున ఖర్గే, అధీóర్ రంజన్ చౌదరి, జైరాం రమేష్ (కాంగ్రెస్), టిఆర్ బాలు, తిరుచ్చి శివ, కనిమొళి (డీఎంకెే), సుప్రియా సులే, ప్రఫుల్ పటేల్ (ఎన్‌సీపీి), ఎలమరం కరీం, పిఆర్ నటరాజన్ (సీపీఐ(ఎం)), బినరు విశ్వం(సీపీఐ), సంజరు రావత్ (శివసేన), మనోజ్ కుమార్ ఝా(ఆర్జేడీి), రామ్ గోపాల్ యాదవ్(ఎస్పీ), ఎన్‌కె ప్రేమ్ చంద్రన్ (ఆర్ఎస్పీ), మహ్మద్ బషీర్ (ఐయుఎంఎల్), హస్నైన్ మసూది (నేషనల్ కాన్ఫరెన్స్), థామస్ చాజికాదన్ (కేరళ కాంగ్రెస్), భగవంత్ మాన్ (ఆప్), తిరుమవలవన్ (వీసీకే) తదితరులు పాల్గొన్నారు. సమావేశం అనంతరం విజరు చౌక్‌లో ప్రతిపక్ష పార్టీల సభ్యులు మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ తొలుత మాట్లాడుతూ, పార్లమెంట్లో ప్రతిష్టంభనకు ప్రభుత్వమే బాధ్యత వహించాలని అన్నారు. పెగాసస్ నిఘాపై చర్చకు అనుమతించకుండా ప్రభుత్వమే అడ్డుకుంటోంది. ప్రభుత్వ చర్య భారత ప్రజాస్వామ్య ఆత్మపై మోడీ, అమిత్ షా దాడి చేస్తున్నారని అన్నారు. పెగాసస్ నిఘాను రాజద్రోహ చర్యగా ఆయన వ్యాఖ్యానించారు. ఉగ్రవాదులకు వ్యతిరేకంగా ఉపయోగించే పెగాసస్ స్పైవేర్‌ను మన ఫోన్లలోకి జొప్పించిన కేంద్రం ఇప్పుడు ఆ అంశంపై చర్చ చేపట్టకుండా ప్రతిపక్షాల గొంతు నొక్కేస్తున్నదన్నారు. ఇది నా వ్యక్తిగత గోప్యతకు సంబంధించిన అంశం మాత్రమే కాదు, దేశ భద్రతకు సంబంధించిన విషయం.దీనిపై కేంద్రం జవాబు చెప్పి తీరాల్సిందేనన్నారు.
'మన ఫోన్లలోకి పెగాసస్ ఆయుధాన్ని మోడీ పంపుతున్నారనే విషయం యువత తెలుసుకోవాలి. ఈ ఆయుధం నామీద, సుప్రీం కోర్టు మీద, ఇతర నేతలు, మీడియా మిత్రులు, హక్కుల కార్యకర్తల మీద ప్రయోగించారు. ఈ విషయాన్ని సభలో (పార్లమెంట్) ఎందుకు ప్రశ్నించకూడదు?' అని రాహుల్ అన్నారు. భారత్‌కు వ్యతిరేకంగా ఉపయోగించిన ఈ ఆయుధం(పెగాసస్)పై చర్చ జరగాల్సిందేనని పేర్కొన్నారు.
ఎన్‌సిపి ఎంపి సుప్రియా సులే మాట్లాడుతూ ''పార్లమెంట్‌ను నడపాల్సిన బాధ్యత ప్రభుత్వానిది.కానీ పెగాసస్‌పై చర్చ చేపట్టకుండా కేంద్రం తప్పించుకుంటుంది'' అని విమర్శించారు. శివసేన ఎంపి సంజరు రావత్ మాట్లాడుతూ జాతీయ భద్రత, సాగు చట్టాలపై పోరాడుతున్నామని, ప్రతిపక్ష పార్టీలన్నీ ఐక్యంగానే ఉన్నాయని అన్నారు.
కేంద్రానిదే బాధ్యత : ఎలమారం కరీం
పార్లమెంట్ సజావుగా సాగకపోవడానికి బాధ్యత ప్రభుత్వానిదే. పెగాసస్, రైతు సమస్యలపై చర్చ జరపాలని కోరుతున్నాం. అందుకు కేంద్రం సిద్ధంగా లేదు. ప్రభుత్వం చర్చకు అంగీకరించేంత వరకు మా ఆందోళన కొనసాగుతుంది. ఈ విషయంలో అన్ని ప్రతిపక్షాలు ఏకతాటిపై నిలిచి పోరాడుతున్నాయి. ధరల పెరుగుదల, పెగాసస్, రైతుల సమస్యలపై రాజీ పడే ప్రసక్తే లేదు.