Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కేరళకు కేంద్ర బృందాలు
- స్కూళ్లను తెరవడంపై రాష్ట్రాలే నిర్ణయించుకోవాలి : కేంద్రం
న్యూఢిల్లీ: దేశంలో కరోనా మహమ్మారి బారినపడుతున్న వారి సంఖ్య మళ్లీ పెరుగుతోంది. గత 24 గంటల్లో దేశంలో కొత్తగా 43,509 పాజిటివ్ కేసులు నమోదయ్యాయని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ వెల్లడించింది. అలాగే, మరణాలు సైతం పెరుగుతూనే ఉన్నాయి. తాజాగా 640 మంది మహమ్మారితో పోరాడుతూ ప్రాణాలు కోల్పోయారు. దీంతో మొత్తం కరోనా మరణాలు 4,22,662 చేరగా, మొత్తం పాజిటివ్ కేసులు 3,15,28,114కు పెరిగాయి. ఇప్పటివరకు 3,07,01,612 మంది కోలుకున్నారు. ప్రస్తుతం 4,03,840 యాక్టివ్ కేసులున్నాయి. రికవరీ రేటు 98.38శాతానికి చేరగా, రోజువారీ పాజిటివిటీ రేటు 2.52 శాతానికి చేరింది. దేశంలో కరోనా కేసులు అత్యధికంగా నమోదైన రాష్ట్రాల జాబితాలో మహారాష్ట్ర, కేరళ, కర్నాటక, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, ఉత్తరప్రదేశ్, బెంగాల్, ఢిల్లీ, ఛత్తీస్గఢ్, ఒడిశాలు టాప్-10లో ఉన్నాయి. మరణాలు సైతం ఈ రాష్ట్రాల్లోనే అధికంగా నమోదవుతున్నాయి. కాగా, దేశంలో ఇప్పటివరకు మొత్తం 46.26కోట్ల శాంపిళ్లను పరీక్షించినట్టు ఐసీఎంఆర్ వెల్లడించింది. అలాగే, ఇప్పటివరకు మొత్తం 45 కోట్లకుపైగా టీకాలు వేశామనీ, 18-44 వయస్సు వారిలో 15.38 కోట్లకుపైగా డోసులు వేసినట్టు కేంద్రం పేర్కొంది. బెంగాల్ ఆగస్టు 15 వరకు ఆంక్షలు విధిస్తున్నట్టు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది.
కేరళలో సంపూర్ణ లాక్డౌన్
కేరళలో రోజువారీ కరోనా కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. ప్రస్తుతం నిత్యం 20 వేలకు పైగా కొత్త కేసులు నమోదవుతున్నాయి. ఈ నేపథ్యంలో కేరళకు నలుగురు సభ్యులతో కూడిన నిపుణుల బృందాన్ని పంపాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. మహమ్మారి వ్యాప్తిని అడ్డుకోవడంలో రాష్ట్ర ఆరోగ్య శాఖకు నిపుణుల బృందం సహకరిస్తుంది. కేరళలో 10 శాతం పైగా పాజిటివిటీ రేటు నమోదవుతున్న 12 జిల్లాల్లో ఈ బృందాలు పర్యటించనున్నట్టు సమాచారం. కాగా, కేరళలో కేసులు పెరుగుతుండటంతో వారంతాల్లో సంపూర్ణ లాక్డౌన్ విధిస్తున్నట్టు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. మిగతా రోజుల్లో రాష్ట్రవ్యాప్తంగా ఆంక్షలు విధించారు.
పిల్లలు కరోనా వ్యాప్తికి కారణం కావచ్చు !
దేశంలో ప్రస్తుత కరోనా పరిస్థితుల నేపథ్యంలో స్కూళ్లను తెరిచే అంశంపై అన్ని వర్గాల్లో చర్చ నడుస్తోంది. అయితే, స్కూళ్లు తెరువడంపై రాష్ట్ర ప్రభుత్వాలే నిర్ణయం తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. కరోనా థర్డ్ వేవ్ ప్రభావం ఎలా ఉంటుందో తెలియనందున ప్రస్తుత పరిస్థితుల్లో స్కూళ్లు తెరువాలా వద్దా అన్నది రాష్ట్రాలే నిర్ణయించుకోవాలని పేర్కొంది. ఒకవేళ కరోనా కేసులు పెరిగినా పిల్లలపై ప్రభావం పెద్దగా ఉండకపోవచ్చని అంచనా వేసింది. అయితే పిల్లలు వ్యాప్తి కారకులుగా మారవచ్చని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇక తల్లిదండుల నుంచి మిశ్రమ స్పందన వస్తున్నప్పటికీ.. ఎక్కువ మంది ఇప్పట్లో స్కూళ్లు తెరవకపోవడం మంచిదనే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.