Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఈడబ్ల్యూఎస్‌కు 10శాతం కోటా
- కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం
న్యూఢిల్లీ : వైద్య విద్యలో ఓబీసీలకు 27శాతం, ఆర్థికంగా వెనుకబడినవారికి (ఈడబ్ల్యూఎస్) 10 శాతం సీట్లు కేటాయిస్తూ కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు గురువారం కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వశాఖ ప్రకటించింది. ఆలిండియా కోటా పథకంలో భాగంగా అండర్ గ్రాడ్యుయేట్, పోస్ట్ గ్రాడ్యుయేట్ మెడికల్, డెంటల్ కోర్సుల్లో (ఎంబీబీఎస్, ఎండీ, ఎంఎస్, డిప్లొమా, బీడీఎస్, ఎండీఎస్) వెనుకబడిన తరగతులకు (ఓబీసీలు) 27శాతం, ఆర్థికంగా బలహీనవర్గాల (ఈడబ్ల్యూఎస్) వారికి 10శాతం రిజర్వేషన్ ఇవ్వాలని నిర్ణయించింది. ఈ నిర్ణయం ఈ విద్యా సంవత్సరం (2021-22) నుంచే అమలులోకి వస్తుందని పేర్కొంది. దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న ఈ సమస్యకు ఒక పరిష్కారం కనుగొనాల్సింది గా ప్రధాని ఈ నెల 26న జరిగిన సమావేశంలో సంబంధిత కేంద్ర మంత్రులను ఆదేశించారు. ఈ నిర్ణయం వలన ఏటా ఎంబీబీఎస్‌లో 1,500 మంది ఓబీసీ విద్యార్థులు, పోస్ట్ గ్రాడ్యుయేషన్‌లో 2,500 మంది ఓబీసీ విద్యార్థులు లబ్దిపొందుతారు. అదే విధంగా 550 మంది ఆర్థికంగా వెనుకబడిన ఎంబీబీఎస్ విద్యారులు, 1,000 మంది పోస్ట్ గ్రాడ్యుయేషన్ విద్యార్థులు ప్రయోజనం పొందుతారు.స్థానికతతో నిమిత్తం లేకుండా మెరిట్ ప్రాతిపదికన చదువుకోవాలని ఆశించే ఏ రాష్ట విద్యార్థి అయినా మరో రాష్ట్రంలో ఉన్న ఒక మంచి వైద్య కళాశాలలో చదువుకునే అవకాశం ఉండాలన్న సుప్రీంకోర్టు ఆదేశాలకు అనుగుణంగా ఆలిండియా కోటా పథకాన్ని 1986లో ప్రవేశపెట్టారు.ప్రభుత్వ వైద్య కళాశాలల్లో ఆలిండియా కోటా కింద మొత్తం సీట్లలో 15శాతం గ్రాడ్యుయేషన్ సీట్లు,అందుబా టులో ఉన్న పీజీ సీట్లలో 50శాతం ఉంటాయి.అయితే,మొదట్లో 2007 వరకు ఆలిండియా కోటాలో ఎలాంటి రిజర్వేషన్లూ లేవు. ఎస్సీలకు 15శాతం,ఎస్టీలకు 7.5శాతం సీట్లను కేటాయిం చాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. 2007లో కేంద్ర విద్యా సంస్థల చట్టం (ప్రవేశాలలో రిజర్వేషన్) అమలులోకి వచ్చినప్పుడు ఓబీసీలకు 27శాతం ఇవ్వటం మొదలైంది. దీన్ని కేంద్ర విద్యా సంస్థల్లో అమలు చేశారు. అందులో సఫ్దర్ జంగ్ హాస్పిటల్, లేడీ హార్డింగ్ మెడికల్‌కాలేజ్, ఆలీగఢ్ ముస్లిం యూనివర్సిటీ, బెనారస్ హిందూ యూనివర్సిటీ లాంటివి ఉన్నాయి.అయితే రాష్టాల వైద్య కళాశాలలకు, దంత వైద్య కళాశాలలకు ఈ ఆలిండియా కోటా సీట్లకు వర్తింపజేయ లేదు.ఇప్పుడు ఆయా కళాశాలలకు రిజర్వేషన్లు వర్తిస్తాయి.