Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కేంద్రాన్ని డిమాండ్ చేస్తూ ఢిల్లీ అసెంబ్లీ తీర్మానం
న్యూఢిల్లీ : ఢిల్లీ పోలీస్ కమిషనర్‌గా సీనియర్ ఐపిఎస్ అధికారి రాకేష్ అస్తానా నియామకాన్ని వ్యతిరేకిస్తూ ఢిల్లీ అసెంబ్లీ గురువారం తీర్మానం చేసింది. ఆస్తానా నియామకాన్ని వెంటనే వెనక్కు తీసుకోవాలని కేంద్ర హోంమంత్రిత్వ శాఖను డిమాండ్ చేసింది. ఢిల్లీలో తమ పార్టీని అణచివేయాలనే ఉద్దేశంతోనే ఆస్తానాను కేంద్రం ఢిల్లీ కమిషనర్‌గా నియమించిందని ఆమ్ఆద్మీ(ఆప్) ఆరోపించింది. కేంద్ర నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఆప్ ఎమ్మెల్యే సంజీవ్ ఝా ఈ తీర్మానాన్ని సభలో ప్రవేశపెట్టారు. దీనిపై సభలో జరిగిన చర్చలో ఢిల్లీ హోంమంత్రి సత్యేంద్ర జైన్‌తో సహా ఆరుగురు ఆప్ ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు కేంద్ర నిర్ణయాన్ని వ్యతిరేకించగా, బిజెపి పక్ష నేత రామ్‌వీర్ సింగ్ బిదౌరి ప్రశంసించారు. పదవీవిరమణకు ఆరు నెలల సర్వీసు మాత్రమే మిలిగివున్న సీనియర్ అధికారుల పేర్లను మాత్రమే డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్(డిజిపి) పోస్టుకు పరిగణించాలని ప్రకాశ్‌సింగ్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో సుప్రీంకోర్టు తీర్పునిచ్చిందని అయితే రాకేష్ ఆస్తానా నియామకం ఆ తీర్పును ఉల్లంఘిస్తోందని ఆప్ ఎమ్మెల్యేలు విమర్శించారు. రాష్ట్రాల్లో పోలీస్ హెడ్‌గా డిజిపి ఉండగా, డిల్లీలో కమిషనరే ఉంటారు. 2018లో సిబిఐ ప్రత్యేక డైరెక్టర్‌గా తొలగించిన, ఇటీవల సిబిఐ డెరెక్టర్ పదవికి పరిగణించిన వివాదాస్పద అధికారి రాకేష్ ఆస్తానాను ఇప్పుడు ఢిల్లీ పోలీస్ కమిషనర్‌గా నియమించడానికి సహేతుకమైన కారణాలు లేదని స్పష్టం చేశారు. ఈ అధికారి గత ట్రాక్ రికార్డును చూస్తే, ఢిలీలో బిజెపికి ప్రత్యర్థులుగా ఉన్న ఆప్ నేతలపై తప్పుడు కేసులు బనాయించేందుకు ఆయన్ను ఉపయోగించే అవకాశం ఉందని భయాందోళన వ్యక్తం చేశారు. వెంటనే ఆస్తానా నియామకాన్ని వెనక్కు తీసుకోవాలని ఆప్ ఎమ్మెల్యేలు ఈ సందర్భంగా డిమాండ్ చేశారు.