Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పెగాసస్, రైతు చట్టాలపై ప్రతిపక్షాల నిలదీత
- వాయిదాల పర్వంలో ఉభయసభలు
- లోక్‌సభలో బ్యానర్లు, ప్లకార్డులు
- రాజ్యసభలో రెండు, లోక్‌సభలో ఒక బిల్లు ఆమోదం
న్యూఢిల్లీ : పెగాసస్ నిఘా వ్యవహారం, రైతు సంబంధిత అంశాలు పార్లమెంట్ వర్షాకాల సమావేశాలను కుదిపేస్తున్నాయి. ప్రతిపక్షాల ఆందోళనలతో ఉభయ సభల్లో గురువారం కూడా వాయిదాల పర్వం కొనసాగింది. ఉదయం సభ ప్రారంభం కాగానే కాంగ్రెస్ ఎంపీలు ప్లకార్డులు, పత్రాలు చించి వాటిని స్పీకర్ స్థానం వైపు, అధికారపక్షం వైపు విసిరి బుధవారం నిరసన తెలిపిన విషయంపై స్పీకర్ ఓం బిర్లా ఆగ్రహం వ్యక్తంచేశారు. అధికార ఎంపీలు కూడా ప్రతిపక్ష సభ్యుల తీరును తప్పుపట్టారు. దీంతో ప్రతిపక్ష ఎంపీలు ఆందోళనకు దిగడంతో స్పీకర్ ప్రశ్నోత్తరాలను నిర్వహించకుండానే సభను 11.30 గంటల వరకు వాయిదా వేశారు. అనంతరం ప్రారంభమైన సభలోనూ ప్రతిపక్ష సభ్యులు నిరసన వ్యక్తంచేశారు. నిఘా ఆపాలనీ, సుప్రీంకోర్టు పర్యవేక్షణలో విచారణ జరపాలని డిమాండ్ చేస్తూ ప్లకార్డులు, బ్యానర్లు ప్రదర్శించారు. అలాగే ప్రధాని మోడీ సమాధానం చెప్పాలనీ, హౌం మంత్రి అమిత్ షా రాజీనామా చేయాలని పెద్ద పెట్టున నినాదాలతో హౌరెత్తించారు. దీంతో పలుమార్లు సభ వాయిదా పడి, ఏకంగా శుక్రవారానికి వాయిదా పడింది. అటు రాజ్యసభలోనూ ఇదే గందరగోళ పరిస్థితి కన్పించింది. రాజ్యసభ ప్రారంభం కాగానే ప్రతిపక్ష సభ్యులు ఆందోళన చేపట్టారు. వెల్‌లోకి దూసుకెళ్లి నినాదాలు చేశారు. దీంతో చైర్మెన్ వెంకయ్య నాయుడు సభను మధ్యాహ్నం 12 గంటల వరకు వాయిదావేశారు. అనంతరం ప్రారంభమైన సభలో గందరగోళం నెలకొనడంతో పలుమార్లు వాయిదా పడి, చివరకు శుక్రవారానికి వాయిదా పడింది.
మూడు బిల్లులు ఆమోదం
ప్రతిపక్షాల ఆందోళనల నేపథ్యంలో పార్లమెంట్ ఉభయ సభల్లో మూడు బిల్లులు ఆమోదం పొందాయి. ఎటువంటి చర్చ లేకుండా మూజువాణి ఓటుతో బిల్లులు ఆమోదం పొందాయి. రాజ్యసభలో ఫ్యాక్టరింగ్ రెగ్యులేషన్ సవరణ బిల్లు, కోకోనెట్ డవలప్మెంట్ బోర్డు సవరణ బిల్లు ఆమోదం పొందగా, లోక్‌సభలో ఎయిర్‌పోర్టు ఎకనమిక్ రెగ్యులేటరీ అథారటీ ఆఫ్ ఇండియా సవరణ బిల్లు ఆమోదం పొందింది.
రైతు సమస్యలపై ప్రతిపక్షాలు ఆందోళన
రైతు సమస్యలపై కాంగ్రెస్, ఎస్ఏడీ, బీఎస్పీ ఎంపీలు ఆందోళన చేపట్టారు. కాంగ్రెస్ ఎంపీలు మహాత్మ గాంధీ విగ్రహం వద్ద ఆందోళన చేపట్టగా, ఎస్ఏడీ, బీఎస్పీ ఎంపీలు కలిసి గేట్ నెంబర్ 4 వద్ద ఆందోళన చేపట్టారు. ప్లకార్డులు చేబూని రైతు వ్యతిరేక చట్టాలు రద్దు చేయాలని డిమాండ్ చేశారు. బీఎస్పీ ఎంపీ రితేష్ పాండ్యా మీడియాతో మాట్లాడుతూ పెగాసస్ ప్రజాస్వామ్యంపై దాడి అని విమర్శించారు. రైతుల సమస్యలు, పెగాసస్ నిఘా, ధరలు పెరుగుదలపై చర్చించే వరకు సభ ఎలా పని చేస్తుందని ప్రశ్నించారు. ప్రభుత్వం ప్రజాస్వా మ్యాన్ని అపహాస్యం చేస్తున్నదని విమర్శించారు. పెరిగిన పెట్రోల్, డీజిల్, వంట గ్యాస్‌తో సహా నిత్యావసర వస్తువుల ధరలు తగ్గించాలని కాంగ్రెస్ ఎంపీ రిపున్ బోరా భారీ ప్లకార్డులతో సైకిల్‌పై పార్లమెంట్‌కు చేరుకున్నారు. పెరిగిన నిత్యావసర వస్తువుల ధరలపైన పార్లమెంట్ చర్చించాలని డిమాండ్ చేశారు.