Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కేంద్రం అఫిడవిట్‌కు వ్యతిరేకంగా నిరసనల వెల్లువ
- మోడీ సర్కార్ వ్యతిరేక నినాదాలతో దద్దరిల్లిన విశాఖ ఫ్యాక్టరీ
విశాఖపట్నం : మోడీ ప్రభుత్వ వ్యతిరేక నినాదాలతో విశాఖ స్టీల్ ప్లాంట్ పరిపాలన భవనం గురువారం దద్దరిల్లింది. విశాఖ ఉక్కును నూరుశాతం ప్రయివేటీకరించటం ఖాయమని ఏపీ హైకోర్టుకు కేంద్రం దాఖలు చేసిన అఫిడవిట్‌ను నిరసిస్తూ స్టీల్ ప్లాంట్ పరిరక్షణ పోరాట సమితి ఉద్యమాన్ని ఉధృతం చేసింది. దీనిలో భాగంగా గురువారం పరిశ్రమ పరిపాలన భవనం వద్ద ఉక్కు ఉద్యోగులు, కార్మికులు, కార్మిక సంఘాల నేతలు ఆందోళన చేపట్టారు. పెద్ద సంఖ్యలో పరిపాలన భవనం వద్దకు చేరుకున్న కార్మికులు కేంద్ర సర్కార్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఆగస్టు 2, 3 తేదీల్లో ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద జరిగే చలో పార్లమెంట్ కార్యక్రమంలో పెద్ద ఎత్తున పాల్గొంటారని వారు తెలిపారు. అవసరమైతే ఢిల్లీ వీధుల్లో పోరాడతామని అన్నారు. ఈ నేపథ్యంలో పరిపాలనా భవనం వద్ద పెద్ద సంఖ్యలో సీఐఎస్ఎఫ్ బృందాలు పహారా కాస్తున్నాయి. 'ఇది విధాన నిర్ణయం. కోర్టుల జోక్యానికి వీలు లేదు. పెట్టుబడుల ఉపసంహరణ సరైందో కాదో తేల్చే అధికారం కోర్టులకు లేదు. అదే సమయంలో రిజర్వేషన్లు ప్రాధమిక హక్కు కాదు. రాజ్యాంగబద్దంగా తప్పనిసరి కాదు. ఉద్యోగులు వాటికోసం పట్టుబట్టడానికి వీలులేదు. కొత్త యాజమాన్యం చెప్పినట్టు విధులు నిర్వహించాలి.' అని కేంద్ర పెట్టుబడులు, ప్రజా ఆస్తుల నిర్వహణ (ఆర్థిక మంత్రిత్వశాఖ) శాఖ కార్యదర్శి రాజేష్‌కుమార్ సింగ్ బుధవారం కోర్టుకు దాఖలు చేసిన అఫిడవిట్లో పేర్కొన్నారు.