Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- జార్ఖండ్‌లో దారుణం.. సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్ దిగ్భ్రాంతి
రాంచీ : జార్ఖండ్‌లోని ధన్‌బాద్ జిల్లాలో ఓ సిట్టింగ్ న్యాయమూర్తిని దారుణంగా హత్యచేశారు. జిల్లాకోర్టు అదనపు సెషన్స్ జడ్జి ఉత్తమ్ ఆనంద్‌ను గుర్తు తెలియని వ్యక్తులతో ఆటోతో ఢకొీట్టి చంపారు. తొలుత పోలీసులు ఈ ఘటనను ప్రమాదంగా భావించారు. అయితే, సిసిటివి రికార్డులను పరిశీలించగా హత్యఅని తేలింది. ఈ ఘటనపై దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన బార్ అసోసియేషన్ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం జడ్జీ ఉత్తమ్ ఆనంద్ బుధవారం తెల్లవారుజామున 5 గంటల సమయంలో జాగింగ్ చేసేందుకు ఇంటినుండి బయటకు వచ్చారు. రోడ్డు పక్కన జాగింగ్ చేస్తుండగా ఆటో వచ్చి ఆయన్ను ఢకొీట్టి వేగంగా వెళ్లింది. తీవ్ర గాయాలైన జడ్జీని ఒక వ్యక్తి గమనించి వెంటనే ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ ఆనంద్ కన్నుమూశారు. అయితే చనిపోయిన వ్యక్తి జడ్జి అని తెలియకపో వడంతో కొన్ని గంటల వరకు ఈ విషయం బయటకు రాలేదు. మరోవైపు జాగింగ్‌కు వెళ్లిన జస్టిస్ ఆనంద్ ఇంటికి తిరిగి రాకపోవడంతో కుటుంబసభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. రంగంలోకి దిగిన పోలీసులు ఆటోను స్వాధీనం చేసుకోవడంతో పాటు, ఇద్దరు అనుమానితులను బుధవారం రాత్రి అరెస్టు చేశారు. పట్టపగలు నడిరోడ్డుపై జడ్జి హత్యకు గురికావడంపై సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్ (ఎస్సిబిఎ) దిగ్బ్రాంతి వ్యక్తం చేసింది. ఈ విషయాన్ని సుప్రీంకోర్టు దృష్టికి తీసుకుని వెళ్లింది. సిబిఐ విచారణ జరిపించాలని డిమాండ్ చేసింది. ఎస్సిబిఎ అధ్యక్షులు, సీనియర్ న్యాయవాది వికాస్ సింగ్ గురువారం ఉదయం జస్టిస్ డివై చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం ముందుకు తీసుకుని వచ్చారు. ఈ ఘటనను 'న్యాయవ్యవస్థపై తీవ్రమైన దాడి'గా అభివర్ణించారు. అయితే, ఈ విషయాన్ని ప్రధాన న్యాయమూర్తి దృష్టికి తీసుకుని వెళ్లమని ధర్మాసనం సూచించింది. దీనిపై చీఫ్ జస్టిస్ ఎన్.వి.రమణ స్పందిస్తూ ' ఈవిషయంపై జార్ఘండ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి, రిజిస్ట్రార్ జనరల్‌తో మాట్లాడాను. కేసును హైకోర్టు విచారిస్తుంది' అని తెలిపారు.