Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కాల్పుల ఘటనపై ఎఫ్ఐఆర్ నమోదు
- రెండు రాష్ట్రాల మధ్య రహదారుల దిగ్బంధనాలు
న్యూఢిల్లీ : అసోం, మిజోరాం మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతూనే ఉన్నాయి. ఇరు రాష్ట్రాల సరిహద్దు ప్రాంతంలో శాంతిని నెలకొల్పేందుకు కేంద్ర ప్రభుత్వం ఒకవైపు చర్యలు ప్రారంభించింది. ఇదే సమయంలో ఈ నెల 26న చోటుచేసుకున్న హింసాత్మక ఘటనకు సంబంధించి ఎఫ్ఐఆర్ నమోదు, దాడికి పాల్పడిన వారి సమాచారం ఇచ్చేందుకు రివార్డులు, నిత్యావసర వస్తువుల రవాణాకు అడ్డంకులతో ఆ ఉద్రిక్తతలు మరింత పెరుగుతున్నాయి. మూడు రోజుల క్రితం అసోంలోని కాచర్ జిల్లా సరిహద్దు ప్రాంతం వద్ద ఇరు రాష్ట్రాలకు చెందిన పోలీసులు, ప్రజల మధ్య ఘర్షణ రేగిన విషయం తెలిసిందే. ఈ సమయంలో చోటుచేసుకున్న కాల్పుల్లో ఆరుగురు అసోం పోలీసులతో పాటు ఒక పౌరుడు మరణించారు. ఈ నేపథ్యంలో సరిహద్దు ప్రాంతంలో శాంతిని నెలకొల్పోందుకు రెండు రాష్ట్రాలకు చెందిన అధికారులతో చర్చలు జరిపిన కేంద్రం కేంద్ర హోంశాఖ తటస్థ కేంద్ర బలగాలను మోహరిస్తామని బుధవారం ప్రకటించింది. రెండు రాష్ట్రాలకు చెందిన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులు, డిజిపిలతో కేంద్ర హోంశాఖ కార్యదర్శి అజరుభల్లా ఢిల్లీలో సమావేశమయ్యారు.
సమాచారం ఇస్తే రివార్డు..
అయితే హింసాత్మక ఘటనపై అసోంలోని ధోలై పోలీసుస్టేషన్లో ఐపిసిలోని పలు సెక్షన్లు, ఆయుధ చట్టంలోని సెక్షన్ 25(1ఎ), ప్రభుత్వ ఆస్తుల నష్ట నివారణ చట్టం-1984 కింద ఈనెల 27న ఎఫ్ఐఆర్ నమోదైంది. అంతరాష్ట్ర సరిహద్దుకు హింసకు కారకులైన వారికి అరెస్టు చేసేందుకు తగిన సమాచారం ఇచ్చిన వారికి రూ.5 లక్షల రివార్డు ఇస్తామని అసోం స్పెషల్ డిజిపి జిపి.సింగ్ కేంద్ర హోంశాఖ చర్చలు జరిపిన బుధవారం నాడునే ట్విట్టర్ ద్వారా ప్రకటించారు. అదేవిధంగా ఈనెల 26న అసోం పోలీసులపై కాల్పులు జరిపిన మిజోరాం పోలీస్ సిబ్బంది, ఇతరులకు సంబంధించి రాష్ట్ర పోలీసులు ఒక ఫొటో గ్యాలరీని కూడా సిద్ధం చేశారని అసోం ట్రిబ్యూన్ పేర్కొంది. దీని గురించి ప్రస్తావిస్తూ నిందితులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని జిపి.సింగ్ పేర్కొన్నారు.
దిగ్బంధనాలతో సరుకుల రవాణాపై ప్రభావం
మరోవైపు మిజోరాంకు వెళ్లే జాతీయ రహదారిని అసోంకు చెందిన బరాక్ లోరు ప్రజలు దిగ్బంధించడం వలన నిత్యావసర వస్తువుల రవాణాపై ప్రభావం పడుతోందని, దీనిపై జోక్యం చేసుకోవాలని కోరుతూ మిజోరాం హోంశాఖ కార్యదర్శి లాల్బిక్సాంగి బుధవారం కేంద్ర హోంశాఖ కార్యదర్శికి లేఖ రాశారు. ఈ దిగ్బంధనం మిజోరాం ప్రజలపై తీవ్ర ప్రభావం చూపుతుందని అన్నారు. అదేవిధంగా అసోం-మిజోరాంలను కనెక్టు చేసే ఇతర రహదారులపై కూడా వాహనాల కదలికలు ఆగిపోయాయని పేర్కొన్నారు. అసోంలోని హైలాకండి జిల్లా మహమ్మద్పూర్, రామ్నాథ్పూర్ రైల్వే స్టేషన్ల పరిధిలో ట్రాక్లను కొంతమంది దుండగులు తొలగించారని తెలిపారు.