Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కిసాన్ సంసద్‌లో ఏకగ్రీవ తీర్మానం
న్యూఢిల్లీ : కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ధరల భరోసా, వ్యవసాయ సేవల చట్టాన్ని (కాంట్రాక్ట్ ఫార్మింగ్ చట్టం) వెంటనే రద్దు చేయాలని కిసాన్ సంసద్ డిమాండ్ చేసింది. కిసాన్ సంసద్ (రైతుల పార్లమెంట్) గురువారం జోరు వర్షంలోనూ జరిగింది. మూడు సెషన్లు జరగగా, అందులో సభ్యులు కాంట్రాక్టు ఫార్మింగ్ చట్టంపై సుదీర్ఘంగా చర్చించారు. అనంతరం రైతు వ్యతిరేకమైన చట్టాన్ని కిసాన్ సంసద్ రద్దు చేసింది. కనుక కేంద్ర ప్రభుత్వం కూడా ఈ చట్టాన్ని రద్దు చేయా లని కిసాన్ సంసద్‌లో ప్రవేశపెట్టిన తీర్మానాన్ని ఏకగ్రీ వంగా ఆమోదించారు. మొదటి సెషన్‌కు ప్రేమ్‌సింగ్ భాంగు, గుర్నమ్ సింగ్ చాదుని, రెండో సెషన్‌కు అతుల్ కుమార్ అంజన్, గగన్‌దీప్ సింగ్, మూడో సెషన్‌కు అనురాధ భార్గవ్, హర్బన్స్ సింగ్ సంఘ స్పీకర్లు, డిప్యూటీ స్పీకర్లగా వ్యవహరించారు. కిసాన్ సంసాద్ పరిష్కరించిన అంశాలపై పార్లమెంటు ఆధిపత్యానికి పోకుండా చూడాలని రాష్ట్రపతిని కోరింది. నియమాలు, రాజ్యాంగ నిబంధనల ప్రకారం పార్లమెంటు కార్యకలాపాలను నిర్వహించడంలో మోడీ నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని పేర్కొంది. పార్లమెంటు ఉభయ సభలలో ప్రజల సమస్యలు చర్చించటానికి అనుమతించటం లేదని తెలిపింది. మోడీ ప్రభుత్వం కాంట్రాక్ట్ ఫార్మింగ్ చట్టాన్ని మోసపూరితంగా, ఉద్దేశపూర్వకంగా తప్పుదోవ పట్టించే శీర్షికను ఇచ్చిందని కిసాన్ సంసద్ విమర్శించింది. ''రైతుల సాధికారత, రక్షణ లేదా ధర భరోసా'' అనే పదాలను చట్టం శీర్షికలో ఉపయోగించినప్పటికీ, ఇది కేవలం ''కాంట్రాక్ట్ ఫార్మింగ్, కార్పొరేట్ ఫార్మింగ్ ప్రమోషన్ యాక్ట్'' అని స్పష్టం చేసింది.
ఇది వనరుల దోపిడీకి దారితీస్తుందని విమర్శించింది. భూమి అన్యాక్రాంతం, వ్యవసాయం రైతుల చేతుల్లో నుంచి కార్పొరేట్ల చేతుల్లోకి వెళ్లి ఇతర దేశాలలో ఇలాంటి విధానాల ద్వారా జరిగిందని తెలిపింది. ప్రభుత్వం ప్రకటించిన కనీస మద్దతు ధర కంటే ఎక్కువ రైతుకు కంపెనీ సరసమైన ధర చెల్లించేలా చూసే నిబంధనలు లేవని స్పష్టం చేసింది. 'వ్యవసాయం, మార్కెట్లు' రాజ్యాంగం ప్రకారం రాష్ట్రానికి సంబంధించినవని, అయితే కాంట్రాక్ట్ వ్యవసాయం, వ్యవసాయ వ్యాపార సంస్థల పద్ధతులను నియంత్రించడానికి కాంట్రాక్ట్ ఫార్మింగ్ ప్రమోషన్ యాక్ట్ రాష్ట్ర ప్రభుత్వాల అధికారాలను తొలగిస్తుందని తెలిపింది. హర్యానాలోని మహేంద్రగఢ్ జిల్లా నార్నాల్లో ముఖ్యమంత్రి సమక్షంలో మూడు నల్ల వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఆందోళన చేసిన యువ రైతు రంగ్లాల్ను పోలీసులు అరెస్టు చేసి, తప్పుడు కేసులు బనాయించారని సంయుక్త కిసాన్ మోర్చా (ఎస్కేఎం) విమర్శించింది.