Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- బేటీ బచావో.. బేటీ పడావో ప్రచారమే..
- బాలికల స్కూల్ డ్రాపౌట్లపై మోడీ సర్కార్ బేఖాతర్
- విధాన జోక్యమే కాదు.. క్షేత్రస్థాయిలోనూ నిశితపరిశీలన..నిధులివ్వాలి : నిపుణుల అభిప్రాయం
మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఏడేండ్ల కాలంలో పలు పథకాలకు పేర్లు మార్చింది. ఎవరూ పట్టించుకోని వర్గాలకు అండగా ఉంటామంటూ బీజేపీ ప్రచారం చేసుకుంటున్నది. వాస్తవానికి పేదలకు, సామాన్యతరగతికి చెందిన వారి కోసమంటూ ప్రవేశపెట్టిన పథకాలెన్నో అటకెక్కాయి. అందులో ఒకటి బేటీ బచావో.. బేటీ పడావో. ఈ పథకం అమలవుతున్న తీరుచూస్తే అంతా ఉత్తిదేనని స్పష్టమవుతున్నది. బాలికలు స్కూలు దశలోనే చదువు మానేస్తుంటే.. మోడీ సర్కార్ లైట్ తీసుకుంటున్నది. కేవలం విధానజోక్యం కాదు. క్షేత్రస్థాయిలోనూ నిశితపరిశీలన, నిధులు కేటాయించాల్సిన అవసరమున్నదని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
న్యూఢిల్లీ : కేంద్రంలోని మోడీ సర్కారు 'బేటీ బచావో-బేటీ పడావో' అంటూ ప్రచారాలు చేసుకుంటున్నది. అయితే, దేశంలో క్షేత్రస్థాయిలో పరిస్థితులు మాత్రం ఇందుకు పూర్తి విరుద్ధంగా ఉన్నాయి. ఇందుకు ఇటీవల విడుదలైన యూనిఫైడ్ డిస్ట్రిక్ట్ ఇన్ఫర్మే షన్ సిస్టమ్ ఫర్ ఎడ్యుకేషన్ ప్లస్ నివేదికతో పాటు పలు నివేది కలు, అధ్యయనాలు దీనిని తెలియజేస్తున్నాయి. పాఠశాలల్లో బాలి కల డ్రాపౌట్లు అధికంగా ఉన్నాయన్నదే ఆ నివేదికల సారాంశం. దీంతో మోడీ సర్కారు పథకాలు కేవలం మాటలకే పరిమితమయ్యాయనీ, చేతల్లో మాత్రం శూన్యమని విద్యావేత్తలు నిపుణులు ఆందోళన వ్యక్తం చేశారు. పాఠశాలల్లో బాలికల డ్రాపౌట్ రేటును తగ్గించడానికి విధానపరమైన జోక్యాలు మాత్రమే కాదనీ, అంతకు మించి అవసరముంటుందని తెలిపారు. ఇందుకు కేంద్ర విద్య మంత్రిత్వ శాఖ ''ఎడ్యుకేషన్ ఎట్ గ్లాన్స్'' డాక్యుమెంట్‌ను కూడా ఉటంకించారు.
దీని ప్రకారం.. ప్రైమరీ స్థాయిలో (ఒకటి నుంచి ఐదో తరగతి వరకు) బాలికల కంటే బాలుర డ్రాపౌట్లు అధికంగా ఉన్నాయి. ఇక అప్పర్ ప్రైమరీ లెవల్లో (ఆరో తరగతి నుంచి ఎనిమిదో తరగతి వరకు ) బాలికల డ్రాపౌట్లు ఎక్కువగా ఉండటం గమనార్హం. ఇక ఇది సెకండరీ లెవల్లో (తొమ్మిది, పదో తరగతుల్లో) విరుద్ధంగా ఉన్నది. ఇక్కడ బాలికలతో పోల్చుకుంటే బాలుర డ్రాపౌట్ శాతం ఎక్కువగా ఉన్నది. కేంద్రంలో మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత దేశ విద్య వ్యవస్థలో వచ్చిన మార్పులు ఏమీ లేవనీ, ఇందుకు బాల, బాలికల స్కూల్ డ్రాపౌట్లే దీనికి నిదర్శనమని విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేశారు. ముఖ్యంగా, బాలికల డ్రాపౌట్ రేటు పెరగడం ఆందోళనకరమన్నారు. మణిపూర్, మిజోరాం, మేఘాలయ వంటి ఈశాన్య రాష్ట్రాల్లో ప్రైమరీ స్థాయిలో బాలికల డ్రాపౌట్లు అధికంగా ఉండటం గమనార్హం. ముఖ్యంగా మణిపూర్‌లో ఇది అత్యధికంగా 8.7శాతంగా ఉన్నది.
2019-20 నివేదిక ప్రకారం.. జాతీయస్థాయిలో 15శాతానికి పైగా బాలికల డ్రాపౌట్లు ఉన్నాయి. అయితే, రాష్ట్రాల సమాచారంతో పోల్చుకుంటే ఇది మరింత అధికంగా ఉండే అవకాశం ఉన్నదని నిపుణులు చెప్పారు. ఇక దేశంలోని 14 రాష్ట్రాల్లో డ్రాపౌట్లు జాతీయస్థాయి శాతంతో పోల్చుకుంటే అధికంగా ఉన్నాయి. ఇందులో అసోం దాదాపు 33 శాతంతో అధిక డ్రాపౌట్లు కలిగి ఉండటం గమనార్హం. కాగా, ఈ 14 రాష్ట్రాల్లో 12 రాష్ట్రాలు ఈశాన్య, తూర్పు భారతానికి చెందినవే. ఇక ఆ మిగిలిన రెండు రాష్ట్రాలు గుజరాత్, మధ్యప్రదేశ్‌లలో సెకండరీ లెవల్లో బాలికల డ్రాపౌట్లు అధికంగా ఉన్నాయి. కాగా, ఈ విషయంలో దక్షిణాది, పశ్చిమ రాష్ట్రాలు చక్కటి ప్రదర్శనను కనబర్చాయనీ, ఈ విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉన్నదని విద్యావేత్తలు, నిపుణులు చెప్పారు.
యూడీఐఎస్ఈ 2013-14 నివేదిక ప్రకారం.. దేశవ్యాప్తంగా ప్రైమరీ లెవల్లో ఆరు కోట్ల మందికి పైగా బాలికల పేర్లు నమోదయ్యాయి. అయితే, 2019-20లో ఇది అప్పర్ ప్రైమరీ లెవల్లో బాలికల సంఖ్య ఈ స్థాయిలో లేదు. కేవలం 35 లక్షల మంది బాలికల పేర్లు నమోదు కావడం గమనార్హం.
యునైటెడ్ నేషన్స్ ఎడ్యుకేషనల్, సైంటిఫిక్ అండ్ కల్చరల్ ఆర్గనైజేషన్స్ 2019 నివేదిక ప్రకారం.. దేశంలో ఐదు నుంచి 19 ఏండ్ల మధ్య గల బాలికల్లో దాదాపు 28 లక్షల మంది బాలికలు వైకల్యంతో (చూపు, వినికిడి, శారీరక లోపం) ఉన్నారు. ఇందులో 20 లక్షల మందికి పైగా గ్రామీణ ప్రాంతాల్లోనే ఉండటం గమనార్హం. అయితే, వీరి విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పాఠశాలల్లో ప్రత్యేక సదుపాయాలు, సౌకర్యాలు కల్పించకపోవడంతో స్కూల్ డ్రాపౌట్లు పెరుగుతున్నాయని నిపుణులు చెప్పారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కేవలం విదానపరమైన నిర్ణయాలకే పరిమితం కాకుండా క్షేత్రస్థాయి వాస్తవ పరిస్థితులను పరిగణలోకి తీసుకొని డ్రాపౌట్లను తగ్గించాలని సూచించారు. విద్యకు కేటాయించే బడ్జెట్‌ను మరింత పెంచాలని తెలిపారు.