Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- విశాఖ స్టీల్‌ప్లాంట్ ప్రయివేటీకరణ నిర్ణయాన్ని కేంద్రం వెనక్కి తీసుకోవాలి
- జంతర్ మంతర్ ధర్నాలో నేతలు స్పష్టం
- జోరు వానలో తెలుగోడి ఆందోళన
- అడుగడుగున ఢిల్లీ పోలీసులు నిర్భందం
న్యూఢిల్లీ: స్టీల్‌ప్లాంట్ అమ్మడానికి, కొనడానికి ఎవ్వరినీ విశాఖలో అడుగుపెట్టనీయమని నేతలు పేర్కొన్నారు. తెలుగు జాతి గర్వించతగ్గ పరిశ్రమను ప్రయివేటీకరణ చేయాలని కేంద్రం తీసుకున్న నిర్ణయంపై పునరాలోచన చేయాలని డిమాండ్ చేశారు. స్టీల్‌ప్లాంట్ ప్రయివేటీకరణపై ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు స్పందించాలని అన్నారు. దేశాన్ని అభివృద్ధి చేసేందుకు మోడీ సర్కార్ ప్రయత్నించటం లేదనీ, దేశాన్ని అదానీ, అంబానీలకు అమ్మేందుకు మాత్రమే మొగ్గు చూపుతున్నారని విమర్శించారు. ఆ రకంగానే విధానాలు అమలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మోడీ సర్కార్ దేశ ప్రజల సంపదను లూటీ చేస్తుంటే..చూస్తూ ఊరుకోమని స్పష్టం చేశారు. ప్రజా ఉద్యమంతో తిరుగుబాటు చేస్తామనీ, అందులో భాగంగానే వైజాగ్ స్టీల్ ప్లాంట్ ఉద్యమమని పేర్కొన్నారు.సోమవారం నాడిక్కడ స్థానిక జంతర్ మంతర్ వద్ద విశాఖ స్టీల్‌ప్లాంట్ పరిరక్షణ పోరాట కమిటీ ఆధ్వర్యంలో భారీ ధర్నా జరిగింది. దీంతో విశాఖలోని ఉద్యమం హస్తినకు చేరింది. ఢిల్లీలో ఉక్కు పిడికిలి బిగించి స్టీల్‌ప్లాంట్ ఉద్యోగులు కదం తొక్కారు. జోరు వానలో సైతం తెలుగోడి ఆందోళన కొనసాగింది. ఈ పోరాటానికి సీపీఐ(ఎం), సీపీఐ, ఎల్జేడీ, వైసీపీ, టీడీపీ ఎంపీలు సంఘీభావం తెలిపారు. సీఐటీయూ, ఏఐటీయూసీ, ఐఎఫ్టీయూ, ఏఐకేఎస్, ఏఐఎడబ్ల్యూయూ, ఐద్వా నేతలు మద్దతు తెలిపారు. సీపీఐ(ఎం), సీపీఐ, కాంగ్రెస్ పార్టీల నేతలు తమ మద్దతును తెలిపారు. తొలిత స్టీల్‌ప్లాంట్ ప్రచారకర్తగా ఉన్న పివి సింధూ టోక్కో ఒలింపిక్స్‌లో కాంస్య పతకం గెలుచుకున్న నేపథ్యంలో ఆమెకు అభినందనలు తెలిపారు. అనంతరం ఇటీవలి కాలంలో మరణించిన కార్మిక నేతలకు సంతాపం తెలిపారు.సీఐటీయూ ప్రధాన కార్యదర్శి తపన్ సేన్ మాట్లాడుతూ దేశాన్ని అమ్మేందుకు మోడీ సర్కార్ వివిధ రూపాల్లో విధానాలు అమలు చేస్తున్నదనీ, అందులో భాగంగానే స్టీల్‌ప్లాంట్‌ను అమ్మాలని చూస్తోందని విమర్శించారు. విశాఖ స్టీల్‌ప్లాంట్‌లో సహా దుర్గాపూర్, సేలం వంటి స్టీల్ప్లాంట్లను కూడా అమ్మకానికి పెట్టారని అన్నారు. అలాగే దేశంలోని ప్రభుత్వ రంగ సంస్థల్లో పెట్టుబడుల ఉపసంహరణకు మోడీ సర్కార్ చర్యలు వేగవంతం చేసిందని విమర్శించారు. ప్రభుత్వ రంగం సంస్థలకు లేని సొంత గనులు, జిందాల్ వంటి ప్రయివేట్ సంస్థలకు ఎలా వస్తున్నాయని ప్రశ్నించారు. స్టీల్‌ప్లాంట్ గురించి మోడీకి ఏం తెలుసనీ, దాన్ని అమ్మేందుకు ప్రయత్నిస్తురని ప్రశ్నించారు. అమ్మడానికి వస్తే తమ సత్తా చూపిస్తామని స్పష్టం చేశారు.ఏఐటీయూసీ ప్రధాన కార్యదర్శి అమర్జిత్ కౌర్ మాట్లాడుతూ దేశాన్ని అదానీ, అంబానీలు కబ్జా చేస్తున్నారనీ, అందుకు మోడీ సర్కార్ సహకారం అందిస్తోన్నారని విమర్శించారు. దాన్ని ఆపడానికి తాము సంకల్పంతో ఉన్నామని అన్నారు. లాక్డౌన్లో కూడా ప్రభుత్వ రంగ సంస్థలు లాభాల్లో ఉన్నాయనీ, కరోనా రెండో దశలో ఆక్సిజన్ కూడా అందించాయని తెలిపారు. అప్పుడు అదానీ, అంబానీలు ఎక్కడికి వెళ్లారని ప్రశ్నించారు. దేశ సంపద ఎక్కడికి వెళ్తుందంటే...కరోనా సమయంలో కోట్లాది మంది ప్రజలు తీవ్రమైన ఇక్కట్లు పడుతుంటే... కొంత మంది కుబేరులుగా నిలిచారని తెలిపారు. ఇప్పుడు అర్థమవుతుంది కదా దేశ సంపద ఎక్కడి వెళ్తుందో అని అన్నారు. విశాఖ ఉక్కు దేశ ప్రజల హక్కు అని స్పష్టం చేశారు.
సర్కారు లూటీని అడ్డుకుందాం : ఎలమారం కరీం
విశాఖ స్టీల్‌ప్లాంట్ పరిరక్షణ కోసం పోరాడాలి..లేదంటే ప్రాణత్యాగానికి సిద్ధం కావాలని సీపీఐ(ఎం) పార్లమెంటరీ పార్టీ నేత ఎలమారం కరీం అన్నారు. ప్రభుత్వ ఆస్తుల లూటీలో భాగమే ప్రభుత్వ రంగ సంస్థల ప్రయివేటీకరణ అని విమర్శించారు. ప్రజల ఉద్యమంతో ఏర్పాడిన విశాఖ ఉక్కు దేశ పరిశ్రమలకే ఆదర్శమని అన్నారు. అనేక మంది ప్రజల త్యాగాలతో వచ్చిన ఉక్కు పరిశ్రమను ప్రయివేటీకరణ కాకుండా చూసేందుకు తమ వంత ప్రయత్నంగా పార్లమెంట్లో పోరాడుతామని తెలిపారు. కాకపోతే తాము ఈ అంశాలను లేవనెత్తేందుకు ప్రయత్నిస్తున్నామనీ, కానీ చర్చలకు మోడీ సర్కార్ అనుమతించటం లేదని స్పష్టం చేశారు. ఇప్పటికే వాయిదా తీర్మానాలు, నోటీసులు ఇచ్చామని కానీ తిరస్కరించారని తెలిపారు. చర్చల కోసం తాము ఉద్యమిస్తే, సభలను వాయిదా వేస్తున్నారనీ, ముజూవాణి ఓటుతో బిల్లులను ఆమోదించుకుంటున్నారని వివరించారు.
అన్ని రాజకీయ పార్టీలు రోడ్డుపైకి రావాలి బి.వి రాఘవులు
అన్ని రాజకీయ పార్టీలు రోడ్డుపైకి రావాలనీ, అప్పుడే కేంద్ర ప్రభుత్వం వెనక్కి తగ్గుతుందని సీపీఐ(ఎం) పొలిట్ బ్యూరో సభ్యులు బివి రాఘవులు స్పష్టం చేశారు. వైజాగ్ స్టీల్‌ప్లాంట్ లాభాల్లో ఉండటమే కాకుండా, నాణ్యమైన ఉత్పత్తి అందిస్తోందని గుర్తు చేశారు. నాణ్యమైనది కనుకనే కొనడానికి సిద్ధపడుతున్నారని అన్నారు. లాభ, నష్టాలతో సంబంధం లేకుండా ఏదేశమైన అభివృద్ధి చెందాలంటే, ప్రభుత్వ రంగంలో పరిశ్రమలు ఉండాలని అన్నారు. చైనాతో పోటీ పడాలని మోడీ సర్కార్ కోరుకుంటుందనీ, దాన్ని అందరం కోరుకోవాలని తెలిపారు. చైనాలో ప్రభుత్వం ఆధీనంలోనే పరిశ్రమలు ఉంటాయనీ, అలాగే మన దేశంలో కూడా ఉండాలని అన్నారు. స్టీల్‌ప్లాంట్ ఉద్యోగుల పోరాటం దేశ భవిష్యత్తుకు సంబంధించిందని అన్నారు. కార్మికుల్లో ఐక్యత విజయానికి సంకేతమని, ఐక్యతను చీల్చే ప్రయత్నం చేస్తే తిప్పికొట్టాలని పిలుపు నిచ్చారు. విశాఖ ఉక్కు ఇనుము మాత్రమే కాదని, అది తెలుగు ప్రజల ప్రాణమని అన్నారు. అన్ని అంశాల్లో ఏకాభిప్రాయం లేని పార్టీలన్ని విశాఖ ఉక్కు కోసం ఐక్యంగా ఉన్నాయని, అలాగే అన్ని పార్టీలు రోడ్లపైకి వస్తే విశాఖ ఉక్కు పరిశ్రమను ఎవరు అమ్ముతారని ప్రశ్నించారు. అయితే ఎన్డీఏ, బీజేపీ ప్రమాదాన్ని మనం గుర్తించాలని, నిరసన తెలిపే రాజద్రోహం కేసులు పెడుతున్నారని విమర్శించారు. తెలుగు జాతి ఆత్మ గౌరవానికి సంబంధించిన విశాఖ ఉక్కు కోసం జరిగే పోరాటంలో సీపీఐ(ఎం) ముందుంటుందనీ, ప్రాణాలైన అర్పిస్తామని స్పష్టం చేశారు.
కిసాన్ సంసద్‌లో తీర్మానం చేస్త్ణాం బి.వెంకట్
విశాఖ స్టీల్ ప్లాంట్‌కు మద్దతుగా కిసాన్ సంసద్ (రైతుల పార్లమెంట్)లో తీర్మానం చేస్తామని ఏఐఏడబ్ల్యూయూ ప్రధాన కార్యదర్శి బి.వెంకట్ వెల్లడించారు. ఢిల్లీలో జరుగుతున్న రైతు ఉద్యమానికి వైజాగ్ స్టీల్ ప్లాంట్ ఉద్యోగులు అందించిన సహకారం మరిచిపోలేనిదని అన్నారు. కార్మికుల ఉద్యమానికి రైతులు అండగా ఉంటారని తెలిపారు. ఐద్వా కోశాధికారి ఎస్.పుణ్యవతి మాట్లాడుతూ స్టీల్‌ప్లాంట్ ఉద్యమానికి తమ సంపూర్ణ మద్దతు ఉంటుందని అన్నారు. పోరాడి సాధించుకున్న స్టీల్‌ప్లాంట్‌ను, పోరాడి రక్షించుకోవాలని సూచించారు.
కార్మికులు, రైతులు ఐక్యతతో ఉద్యమ్ణం విజూ కృష్ణన్
దేశంలోని కార్మికులు,రైతులు ఐక్యంగా ఉద్యమించాల్సిన అవసరం ఉందని ఏఐకేఎస్ సహాయ కార్యదర్శి విజూ కృష్ణన్ అన్నారు. ఢిల్లీ సరిహద్దుల్లో ఎనిమిది నెలలుగా రైతుల ఉద్యమం కొనసాగుతున్నదనీ, ఆరు వందల మంది రైతులు మరణించారని తెలిపారు. విశాఖ ఉద్యమం, ఐక్య ఉద్యమానికి ప్రతీక అన్నారు. స్టీల్ ప్లాంట్లానే, వ్యవసాయాన్ని కూడా కార్పొరేట్లకు అమ్మేసేందుకు మోడీ సర్కార్ సిద్ధపడిందని విమర్శించారు. కార్మికులు, రైతులు ఐక్యం అవ్వడంపై మోడీ గుండెల్లో భయం నెలకొందని అన్నారు. అందులో భాగంగానే ఢిల్లీ పోలీసులు రైతులకు మద్దతు ఇవ్వడానికి వచ్చారని స్టీల్ ఉద్యోగులపై నిర్భందం విధించారని తెలిపారు. రైతుల ఉద్యమానికి మద్దతు ఇవ్వకూడదా? ఇవ్వడం తప్పా? అని ప్రశ్నించారు. దేశాన్ని అమ్మడానికి కార్మికులు, రైతులు అనుమతించరనీ, ప్రజా సంపదను కాపాడేందుకు పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు.
బీజేపీ సర్కార్ మూర్ఖత్వం. నారాయణ (సీపీఐ)
బీజేపీ ప్రభుత్వం మూర్ఖత్వంతో వ్యవహారిస్తున్నదని సీపీఐ కార్యదర్శి కె.నారాయణ అన్నారు. అన్ని వర్గాల నుంచి వ్యతిరేకత పెరిగినా, తాము పట్టుకున్న కుందేలుకు మూడే కాళ్లు అన్నట్టు ఉందని విమర్శించారు. ఒకపక్క కేంద్ర మంత్రి విశాఖ ఉక్కు నాణ్యమైనదని అంటునే, మరోపక్క దాన్ని అమ్మేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. కాంగ్రెస్ నేతలు గిడుగు రుద్రరాజు, సుంకర పద్మశ్రీ మాట్లాడుతూ స్టీల్‌ప్లాంట్ ప్రయివేటీకరిస్తే చూస్తూ ఊరుకోమని స్పష్టం చేశారు.
అడుగడుగున ఢిల్లీ పోలీసుల నిర్భందం
స్టీల్‌ప్లాంట్ ప్రయివేటీకరణ వ్యతిరేకిస్తూ చలో ఢిల్లీ ధర్నాలో పాల్గొనేందుకు ఢిల్లీ వచ్చిన వైజాగ్ స్టీల్ ఉద్యోగులపై ఢిల్లీ పోలీసుల అడుగడుగున నిర్భందం విధించారు. ఎక్కడిక్కడే అడ్డుకున్నారు. బస చేసిన హౌటల్స్ వద్దనే అడ్డుకుని బయకు వెళ్లనియ్యలేదు. రైల్వే స్టేషన్ నుంచి జంతర్ మంతర్‌కు చేరుకనేందుకు ఆటో ఎక్కిన వారిని సైతం పోలీసులు దింపేశారు. ధర్నా జరిగే ప్రదేశానికి కాలినడక వెళ్లేవారిపై కూడా ఆంక్షలు విధించారు. ఢిల్లీ పోలీసుల నిర్భందాలను ఎదుర్కొని వందలాది మంది స్టీల్ ఉద్యోగులు ధర్నాలో పాల్గొన్నారు.