Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- నిరసనల మధ్య మూజువాణి ఓటుతో పచ్చజెండా
- లోక్‌సభలో వ్యతిరేకించిన ప్రతిపక్షాలు
- పెగాసస్, రైతుసమస్యలపై దద్దరిల్లిన పార్లమెంట్
- పీవీ సింధూకి అభినందనలు
న్యూఢిల్లీ : ఇన్సురెన్సు రంగాన్ని ప్రయివేట్‌పరం చేసే జనరల్ ఇన్సూరెన్స్ బిజినెస్ (జాతీయకరణ) సవరణ బిల్లు లోక్‌సభలో ఆమోదం పొందింది. దీన్ని ప్రతిపక్షాలు తీవ్రంగా వ్యతిరేకించాయి. అయినప్పటీకి బిల్లును మోడీ సర్కార్ మూజువాణి ఓటు నెగ్గించుకున్నది. తొలుత బిల్లును కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టారు. దీనిపై ప్రతిపక్షాలు తమ వ్యతిరేకతను వ్యక్తం చేశాయి. అధిర్ రంజన్ చౌదరి (కాంగ్రెస్), ఎన్‌కె ప్రేమ్‌చంద్రన్ (ఆర్ఎస్పీ), ఎఎం ఆరీఫ్ (సీపీఐ(ఎం) తదితరులు వ్యతిరేకించారు. అయినా చర్చ జరపకుండా కేవలం మూజువాణి ఓటుతో బిల్లు ఆమోదం పొందినట్టు ప్రకటించారు. మరోవైపు సోమవారం కూడా పెగాసస్, రైతు సమస్యలపై పార్లమెంట్ ఉభయ సభలు దద్దరిల్లాయి. ప్రతిపక్ష పార్టీల ఎంపీలు వెల్‌లోకి దూసుకెళ్లి ఆందోళన చేపట్టారు. ప్లకార్డులు చేబూని పెద్ద ఎత్తున నినాదాల హౌరెత్తించారు. పార్లమెంట్ ఉభయ సభలు ప్రారంభం కాగానే టోక్కో ఒలింపిక్స్‌లో కాంస్య పతకం గెలుచుకున్న పీవీ సింధూకి అభినందనలు తెలిపాయి.తొలుత లోక్స భ ప్రారంభం కాగానే ప్రతిపక్ష ఎంపీలు వెల్‌లోకి దూసుకెళ్లారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాల హౌరెత్తించారు. ప్రతిపక్షాల ఆందోళన నడుమే స్పీకర్ ఓం బిర్లా ప్రశ్నోత్తరాలు నిర్వహించేందుకు ప్రయత్నించారు. దీంతో ప్రతిపక్షాలు తమ ఆందోళనను ఉధృతం చేశాయి. కొద్దిసేపు ప్రశ్నోత్తరాలు నిర్వహించినప్పటికీ, సభలో నెలకొన్న గందరగోళంతో సభను వాయిదా వేశారు. అలాగే తిరిగి ప్రారంభమైన సభలో ఎటువంటి మార్పు రాలేదు. దాంతో సభ పలుమార్లు వాయిదా పడింది. ప్రతిపక్షాల ఆందోళన నడుమా బీమా సవరణ బిల్లును కేంద్రం ఆమోదించుకున్నది. మరోవైపు రాజ్యసభలో కూడా ఇదే పరిస్థితి నెలకొన్నది.కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ నేతృత్వంలో మంగళవారం 'మాక్ పార్లమెంట్' నిర్వహించనున్నారు. దీనిలో ప్రతిపక్షాలన్నీ పాల్గొననున్నాయి. ఈ విషయమై దాదాపు 14 పార్టీలు మంగళవారం సమావేశం కానున్నాయి. వీరందరికీ రాహుల్ లంచ్ ఏర్పాటు చేశారు. సభలో తమ వాదనను ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోవడం లేదనీ, అందుకే తాము మాక్ పార్లమెంట్ వైపు మొగ్గు చూపామని ప్రతిపక్ష నేతలు పేర్కొన్నారు.