Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ: ఇటీవలి కాలంలో దేశంలోని వివిధ రాష్ట్రాల్లో కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు కరోనా కట్టడికి తీసుకుంటున్న చర్యలు, కరోనా పరీక్షలు, వ్యాక్సినేషన్, కొత్తగా నమోదవుతున్నా కేసులు వంటి అంశాలపై చర్చ నడుస్తోంది. మరీ ముఖ్యంగా కేరళలో రోజువారీ కేసులు అధికంగా నమోదవుతుండటంపై దేశవ్యాప్తంగా ఆందోళన వ్యక్తమవుతోంది. అయితే, కేరళలో రోజువారీ కేసులు అధికంగా నివేదించబడటానికి అక్కడ చేస్తున్న అధిక పరీక్షలే కారణమని డేటా ద్వారా తెలుస్తోంది. కరోనా పరీక్షలు నిర్వహించడంలో కేరళ దేశంలోనే టాప్‌లో ఉండటంతో పాటు.. దేశ సగటు పరీక్షల కంటే అధికంగా నిర్వహిస్తోంది. మిలియన్ జనాభాకు కేరళ వారం రోజుల సగటు 4,587 పరీక్షలతో దేశంలోనే టాప్‌లో ఉంది. ఈ విషయంలో దేశంలోని చాలా పెద్ద రాష్ట్రాలు సైతం కేరళ కంటే చాలా వెనుకబడి ఉన్నాయి. అత్యంత తక్కువగా రాజస్థాన్‌లో (378) సగటు పరీక్షలు నిర్వహించబడ్డాయి. బెంగాల్, హర్యానా, మధ్యప్రదేశ్, గుజరాత్ వంటి రాష్ట్రాల్లోనూ మిలియన్ జనాభాలో 1,000 కంటే తక్కువగా పరీక్షల సగటు నమోదైంది. అసోం, ఢిల్లీలో మాత్రమే వరుసగా 3563, 3336 పరీక్షలు నిర్వహించబడ్డాయి. చాలా రాష్ట్రాల్లో ప్రస్తుత పరీక్షా రేట్లు గతంలో సాధించిన గరిష్ట స్థాయిల కంటే చాలా తక్కువగా ఉన్నాయని డేటా చూపిస్తోంది. దేశంలోని 14 పెద్ద రాష్ట్రాల్లో, ప్రస్తుత సగటు మిలియన్‌కు 2,000 కంటే తక్కువ పరీక్షలు నిర్వహిస్తున్నాయి. అంటే కేరళలో నిర్వహిస్తున్న పరీక్షలతో పోలిస్తే సగం కంటే తక్కువగా ఉన్నాయి. బీహార్‌లో ప్రతి మిలియన్ జనాభాకు కేవలం 1,196, ఉత్తరప్రదేశ్‌లో 1,052 పరీక్షలు నిర్వహిస్తున్నారు. చిన్న రాష్ట్రాల్లో, గోవా, సిక్కిం, త్రిపురలకు టెస్టింగ్ రేటు సగటున 2,000 నుంచి 3,000 మధ్య ఉండగా, మణిపూర్, మేఘాలయలలో 1,500 నుంచి 2,000 మధ్య ఉంది. మిలియన్ జనాభాకు వెయ్యి కంటే తక్కువ పరీక్షలు చేసిన జాబితాలో చిన్న రాష్ట్రాల్లో నాగాలాండ్ మాత్రమే ఉంది.