Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఏడాదిన్నర అవుతున్నా నియామక ఆర్డర్లు ఇవ్వని ప్రభుత్వం
చెన్నై: పశువైద్యుల నియామకం కోసం పరీక్ష నిర్వహించి ఏడాదిన్నర అవుతున్నా.. అందులో ఉత్తీర్ణులైన వారికి అపాయింట్మెంట్ ఆర్డర్లు ఇవ్వడం లేదని పేర్కొంటూ తమిళనాడులో పశువైద్యులు నిరసనలకు దిగారు. వెంటనే తమకు నియామక ఆదేశాలు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. తమిళనాడు ప్రభుత్వం శాశ్వత ప్రాతిపదికన పశువైద్య వైద్యులను నియమించక దశాబ్దానికి పైగా అవుతోంది. చివరగా 2009 ఈ నియామకాలు చేపట్టగా.. మళ్లీ గతేడాది (2020) ఫిబ్రవరిలో వెటర్నరీ వైద్యులను ఎంపిక చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం పరీక్షలు నిర్వహించింది. ఇందులో 1,141 మంది ఉత్తీర్ణత సాధించారు. పశువైద్యుల నియామకం కోసం పరీక్షలు నిర్వహించి ఏడాదిన్నర అవుతున్నా.. ఇప్పటికీ వారికి నియామకాల ఆదేశాలు అందివ్వలేదు. ఈ క్రమంలోనే చెన్నైలోని వల్లువర్ కొట్టం సమీపంలో భారీ నిరసన ర్యాలీ చేపట్టారు. నియామకాలను వేగవంతం చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. తమకు వెంటనే అపాయింట్మెంట్ అర్డర్లు (పోస్టింగ్) అందివ్వాలని డిమాండ్ చేశారు. ఈ నిరసనలో దాదాపు వేయి మందివరకు పశువైద్యులు పాల్గొన్నారు. కాగా, పశువైద్యుల నియామకాల కోసం నిర్వహించిన పరీక్షలో ఉత్తీర్ణులైన వారిలో చాలా మంది ఇదివరకు ఉన్న ఉపాధిని వదిలిపెట్టి.. పోస్టింగ్ అర్డర్లు పొందడానికి వేచి ఉన్నారు. ఫలితాలు వెలువడిన ఆరు నెలల నుంచి వారు ఉపాధి లేకుండా ఉన్నారు. ఈ క్రమంలోనే తాము ఆర్థికంగా అనేక ఇబ్బందులు ఏదుర్కొంటు న్నామని పేర్కొన్నారు. తమలో చాలా మంది పేద, గ్రామీణ నేపథ్యాల నుంచి వచ్చినవారు ఉన్నారనీ, ఇందులో చాలా మందికి ఇప్పటికే వివాహం అయింది. పలువురికి పిల్లలు కూడా ఉన్నారు. పోస్టింగ్లు ఇవ్వడంలో ప్రభుత్వ సాగదీత చర్యల కారణంగా తమ జీవితాలు తీవ్రంగా దెబ్బతింటున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయంపై ఇప్పటికే పలుమార్లు రాష్ట్ర పశుసంవర్థక మంత్రిత్వ శాఖకు లేఖలు సైతం రాశామని పేర్కొన్నారు.