Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ధరలు పెరుగుదలకు నిరసన.. ప్రతిపక్ష ఎంపీల ర్యాలీ
న్యూఢిల్లీ : పెట్రోల్, డీజిల్, వంట గ్యాస్ తదితర ఇంధన, నిత్యావసరాల ధరలు పెంపునకు నిరసనగా ప్రతిపక్ష పార్టీల ఎంపీలు పార్లమెంట్‌కు సైకిల్ ర్యాలీ నిర్వహించారు. కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీతో పాటు ప్రతిపక్ష ఎంపీలంతా సైకిల్ తొక్కుకుంటూ పార్లమెంట్ సమావేశాలకు హాజరయ్యారు. కాన్స్టిట్యూషన్ క్లబ్లో రాహుల్ గాంధీ ప్రతిపక్ష పార్టీల ఎంపీలతో అల్పాహార విందు సమావేశం మంగళవారం నిర్వహించారు. కాంగ్రెస్‌తో పాటు, ఎన్సీపీ, శివసేన, సీపీఐ(ఎం), సీపీఐ, ఎస్పీ, ఐయూఎంఎల్, ఆర్ఎస్పీ, కేరళ కాంగ్రెస్, టీఎంసీ, ఎల్జేడీ, ఆర్జేడి, జార్ఖండ్ ముక్తి మోర్చా, నేషనల్ కాన్ఫరెన్స్.. ఇలా 14 ప్రతిపక్ష పార్టీలకు చెందిన నేతలు ఈ భేటీలో పాల్గొన్నారు. ప్రభుత్వంపై అనుసరించాల్సిన ఉమ్మడి వ్యూహాన్ని రచించేలా వారితో రాహుల్ సమాలోచనలు జరిపారు. ఈ సందర్భంగా రాహుల్ మాట్లాడుతూ ప్రతిపక్షాలన్నీ ఏక తాటిపైకి వచ్చి బలమైన శక్తిగా నిలబడటం చాలా కీలకమని అన్నారు. విపక్షాలు ఐకమత్యంగా ఉండాలనీ, ఏకతాటిగా బలమైన శక్తిగా నిలిచినప్పుడే ప్రజావాణిని సమర్ధవంతంగా వినిపించగలుగుతామని పిలుపునిచ్చారు. అనంతరం కాన్స్టిట్యూషన్ క్లబ్ నుంచి రైల్ భవన్ మీదుగా ప్రతిపక్ష ఎంపీలు సైకిల్ ర్యాలీ చేపట్టారు. అందరూ కలిసి పార్లమెంట్‌కు చేరుకున్నారు. సైకిల్స్‌కు ప్లకార్డులు తగిలించి నినాదాలతో హౌరెత్తించారు.
ఎసెన్షియల్ డిఫెన్స్ సర్వీసెస్ బిల్లుకు లోక్‌సభ ఆమోదం
ఎసెన్షియల్ డిఫెన్స్ సర్వీసెస్ బిల్లుకు లోక్‌సభ మంగళవారం ఆమోదం తెలిపింది. ప్రభుత్వ యాజమాన్యంలోని ఆర్డినెన్స్ ఫ్యాక్టరీల్లో పని చేసే సిబ్బంది సమ్మె చేయకుండా నిరోధించేందుకు ఈ బిల్లును రూపొందించారు. దేశవ్యాప్తంగా 41 ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలలో దాదాపు 70 వేల మంది పని చేస్తున్న విషయం తెలిసిందే. ఈబిల్లును మంగళవారం లోక్‌సభలో ప్రవేశపెట్టారు. దేశభద్రత, ప్రజల ఆస్తులు, ప్రాణాలను కాపాడటంకోసం అత్యవసర రక్షణ రంగ సేవల నిర్వహణ కోసం ఈ బిల్లును రూపొందించినట్టు ప్రభుత్వం తెలిపింది. రక్షణ మంత్రిత్వశాఖ పరిధిలోని డిఫెన్స్ డిపార్ట్మెంట్ కింద ఇండియన్ ఆర్డినెన్స్ ఫ్యాక్టరీస్ పని చేస్తోంది. ఏదైనా పనిని నిలిపేయడం వల్ల డిఫెన్స్ ఎక్విప్మెంట్ లేదా గూడ్స్ ఉత్పత్తిపై ప్రతికూల ప్రభావం పడే అవకాశం ఉందని భావిస్తే, ఆకార్యకలాపాలను ఎసెన్షియల్ డిఫెన్స్ సర్వీ సెస్‌గా ప్రకటించే అధికారం ఈబిల్లువల్ల ప్రభుత్వానికి లభిస్తుంది. ఎసెన్షి యల్ డిఫెన్స్ సర్వీసెస్‌తో సంబంధం ఉన్న పారిశ్రామిక సంస్థలు, యూని ట్లను కూడా ఈ బిల్లు పరిధిలోకి తీసుకొచ్చారు. వీటిలో కూడా ఉద్యోగుల సమ్మెను నిషేధించే అధికారం ప్రభుత్వానికి లభిస్తుంది. ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ బోర్డును కార్పొరేటీకరిస్తామని కేంద్ర ప్రభుత్వం జూన్‌లో ప్రకటించింది. ఇది జరిగితే అమ్యునిషన్, ఇతర ఎక్విప్మెంట్ను తయారుచేసే 41 ఫ్యాక్టరీలు ప్రభుత్వ యాజమాన్యంలోని 7 కార్పొరేట్ సంస్థల పరిధిలోకి వస్తాయి. ఈ బిల్లుపై ఎటువంటి చర్చ జరగకుండానే ముజువాణి ఓటుతో ఆమోదం పొందింది. ప్రతిపక్షాలు వ్యతిరేకించినప్పటికీ బిల్లను మోదించుకున్నారు.