Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఉద్యమానికి సంపూర్ణ మద్దతు
- ప్రయివేటీకరణతో ప్రజలకు నష్టం : సీతారాం ఏచూరి
- కార్పొరేట్ల లాభాల కోసమే అమ్మేస్తున్నారని వ్యాఖ్య
న్యూఢిల్లీ: విశాఖ స్టీల్‌ప్లాంట్‌ను మూతపడనివ్వ బోమని సీపీఐ(ఎం) ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి స్పష్టం చేశారు. విశాఖ ఉక్కు మనందరి హక్కు అన్నారు. స్టీల్‌ప్లాంట్ పరిరక్షణ కోసం జరిగే ఉద్యమంలో సీపీఐ(ఎం) కలిసి నడుస్తుందన్నారు. వైజాగ్ స్టీల్‌ప్లాంట్ ప్రయివేటీకరణకు వ్యతిరేకంగా పరిరక్షణ పోరాట కమిటీ ఆధ్వర్యంలో జరుగుతున్న చలో ఢిల్లీ ఆందోళన మంగళవారం కూడా కొనసాగింది. ఏపి భవన్లో జరిగిన ఆందోళనకు సీపీఐ(ఎం), సీపీఐ, టీడీపీ, వైసీపీ, కాంగ్రెస్, సీపీఐఎంఎల్, జేఎన్యూయస్యూ, రైతు సంఘాలు మద్దతు తెలిపాయి. ఈ సందర్భంగా సీపీఐ(ఎం) ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి మాట్లాడుతూ విశాఖ స్టీల్‌ప్లాంట్ ఏర్పాటుకోసం జరిగిన ఉద్యమంలోనూ, తర్వాత దాన్ని కాపాడుకునే ఉద్యమంలోనూ సీపీఐ(ఎం) భాగస్వామ్యం ఉందనీ, ఆయా ఉద్యమాలను బలపరిచిందని గుర్తుచేశారు. స్టీల్‌ప్లాంట్ ప్రయివేటీకరణకు వ్యతిరేకంగా జరిగే ఉద్యమంలోనూ కలిసి నడుస్తామన్నారు. ఈ ఉద్యమాన్ని పార్లమెంట్ లోపల, వెలుపల బలపరుస్తామన్నారు. ప్రజల వీరోచిత పోరాటంతో ఏర్పడిన స్టీల్‌ప్లాంట్‌ను అమ్మనియ్యబోమని స్పష్టం చేశారు. కేంద్ర ప్రభుత్వం చెప్పే కథలన్ని చాలా విన్నామనీ, ప్రయివేటీకరణతో లూటీ తప్ప, విస్తరణ ఎక్కడా జరగలేదనీ, జరగదని తెలిపారు. కార్పొరేట్ల లాభాల కోసం చేసే ప్రక్రియలో భాగంగానే ఈ ప్రయివేటీకరణ అన్నారు. ఒకప్పుడు ఇంగ్లండ్ ప్రధాని మార్గరేట్ థాచర్ ప్రభుత్వం వ్యాపారం చేయదని అన్నారనీ, అలాంటి ఇంగ్లండ్‌లోనే ప్రయివేటులో ఉన్న బ్రిటిష్ రైల్వేను తిరిగి జాతీయీకరణ చేస్తున్నారని మోడీ సర్కార్ తెలుసుకోవాలని హితవు పలికారు. ప్రజలకు సేవ చేయాలంటే ప్రయివేటీకరణతో కుదరదని అన్నారు. అభివృద్ధిచెందిన దేశాల్లో తిరిగి జాతీయీకరణ జరుగుతుందని తెలిపారు. స్పెయిన్ తన వైద్య సౌకర్యాలను జాతీయీకరణ చేసిందనీ.. దాన్ని చూసి మోడీ సర్కార్ నేర్చుకోవాలని హితవు పలికారు. దేశ సంపదకు ప్రజలే యజమానులనీ, ప్రభుత్వాలు కేవలం మేనేజర్లు మాత్రమేనని అన్నారు. యజమాని అంగీకారం లేకుండా, ఏ మేనేజర్ అమ్మలేడని తెలిపారు. ఒకవేళ అమ్మాలని ప్రయత్నిస్తే ఆ మేనేజర్‌ను దించేస్తామని స్పష్టం చేశారు. పార్లమెంట్లో చర్చ లేకుండా బిల్లులను ఆమోదించడం తప్పుడు పద్దతిలో జరుగుతున్నదని తెలిపారు. బిల్లులను పరిశీలించేందుకు స్టాండింగ్ కమిటీలకు కూడా పంపించటం లేదని, ఏ వేదికపైకి కూడా చర్చకు వెళ్లటం లేదని అన్నారు. వైజాగ్ స్టీల్‌ప్లాంట్ అమ్మకం జరిగితే, మోడీ దేశాన్ని అమ్మేస్తాడని సీపీఐ(ఎం) ఏపీ రాష్ట్ర కార్యదర్శి పి.మధు అన్నారు. విశాఖ ఉక్కును అమ్మడానికి ప్రయత్నించిన మోడీ సర్కార్ నైతిక పరాజయం పొందిందని విమర్శించారు. పెద్ద ఎత్తున ఉద్యమిస్తాన్న కార్మికులకు నైతిక మద్దతు లభించిందని తెలిపారు.దేశవ్యాప్తంగా ప్రభుత్వ రంగాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉందన్నారు. అలాగే జగన్, చంద్రబాబు కలిసి పోరాడాలని సీపీఐ ఏపీ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ అన్నారు. ఈ ఉద్యమ కేక నరేంద్ర మోడీకి వినపడాలంటే, అది పార్లమెంట్‌లోనే జరగాలన్నారు. స్టీల్‌ప్లాంట్‌ను అమ్మడమంటే, ప్రజల జీవితాలను అమ్మడమేనని జేఎన్‌యూఎస్‌యూ అధ్యక్షురాలు ఐషీఘోష్ అన్నారు. స్టీల్‌ప్లాంట్ కార్మికుల ఉద్యమానికి సంపూర్ణ మద్దతు ఉంటుందని తెలిపారు. ఇదేదో స్టీల్‌ప్లాంట్ ఉద్యోగుల ఉద్యమం మాత్రమే కాదనీ, ఇది దేశ ప్రజల ఉద్యమమని అన్నారు. నల్ల చట్టాలను రద్దు చేయాలని దేశానికి అన్నం పెట్టే రైతన్నలు ఉద్యమిస్తోన్నారనీ, కానీ సమస్యలు పరిష్కరించకుండా యూఏపీఏ కేసులు నమోదు చేస్తున్నారని విమర్శించారు.