Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఆరోగ్యం, ఆర్థిక పరిస్థితులపై ప్రభావం పడుతుంది
- ఆహార భద్రతా ప్రమాణాల సంస్థకు 170 మంది వ్యక్తులు, సంస్థల లేఖ
న్యూఢిల్లీ: ఆహార పదర్థాల ఫోర్టిఫికేషన్ను (ఆహార పదార్థాలలో కృత్రిమంగా సూక్ష్మ పోషకాలను చేర్చడం) తప్పనిసరి చేయవద్దని పేర్కొంటూ దేశంలోని 170 మందికి పైగా ప్రముఖ వ్యక్తులు, వివిధ సంస్థలు కలిసి ఆహార భద్రతా ప్రమాణాల సంస్థకు (ఎఫ్ఎస్ఎస్ఏఐ) లేఖను పంపారు. కొన్ని ఆహార పదార్థాల్లో కృత్రిమంగా సూక్ష్మ పోషకాలను చేర్చడం తప్పనిసరి చేయాలనే భారత ప్రభుత్వ ప్రణాళికపై లేఖలో ఆందోళన వ్యక్తం చేశారు. ఫోర్టిఫికేషన్ తప్పనిసరి చేయడం ద్వారా ఆరోగ్యంపైనే కాకుండా ఆర్థిక పరిస్థితులపై కూడా ప్రభావం పడే అవకాశముందని పేర్కొన్నారు. పోషకాలు ఒంటరిగా పనిచేయవు, కానీ సరైన శోషణ కోసం ఒకదానిమరొకటి అవసరం కాబట్టి ఫోర్టిఫికేషన్ ఖచ్చితమైన పరిష్కారం చూపదనే విషయాన్ని ప్రస్తావించారు. ఈ లేఖపై సంతకం చేసిన వారిలో అలయన్స్ ఫర్ సస్టైనబుల్ అండ్ హౌలిస్టిక్ అగ్రికల్చర్ సహా పలువురు వైద్య నిపుణులు, పోషకాహార నిపుణులు, వ్యవసాయ శాస్త్రవేత్తలు, రైతు సంస్థలు, విద్యావేత్తలు, పౌర సమాజ సంస్థలు, సంబంధిత శాఖలకు చెందిన పౌరులు ఉన్నారు.
ఆహార పదర్థాల సింథటిక్ లేదా కెమికల్ ఫోర్టిఫికేషన్ ఆరోగ్యం, ఆర్థిక వ్యవస్థపై ప్రతికూల ప్రభావాన్ని కలిగి ఉంటుందని తెలిపారు. ఇది పెద్ద సంస్థలకు అనుకూలంగా మార్కెట్ మార్పులు, చిన్న, అనధికారిక, స్థానిక సూక్ష్మ సంస్థల వారు జీవనోపాధిని కోల్పోవడం జరుగుతుందన్నారు. ఫోర్టిఫికేషన్కు స్వతంత్ర, నిర్ణయాత్మక సాక్ష్యాలు లేకపోవడంతో తలెత్తిన హానికరమైన, అనారోగ్యం, సామాజిక-ఆర్థిక ప్రభావాలను వారు ఉదహరించారు. కాగా, ఈ ఏడాది జనవరిలో ఎఫ్ఎస్ఎస్ఏఐ.. విటమిన్ ఏ, డీతో వంటనూనె, ప్యాకేజ్డ్ పాలను తప్పనిసరిగా ఫోర్టిఫికేషన్ చేయడంపై ముసాయిదా నిబంధనలను జారీ చేసింది. అలాగే, విటమిన్ బీ12, ఐరన్, ఫోలిక్ యాసిడ్తో 2024 నుండి బియ్యం ఫోర్టిఫికేషన్ను తప్పనిసరి చేయాలని కూడా ప్రభుత్వం ఆలోచిస్తోంది. ''దేశంలో రక్తహీనత, సూక్ష్మ పోషకాల లోపాన్ని'' ఉటంకిస్తూ 15 రాష్ట్రాల్లోని ఒక్కో జిల్లాలో పీడీఎస్ ద్వారా బియ్యం ఫోర్టిఫికేషన్, సరఫరాపై ప్రభుత్వం మూడేండ్ల పైలట్ పథకాన్ని కూడా ప్రారంభించింది. ఇక దీనిని ప్రభుత్వ తప్పనిసరి చేయడం కారణంగా ప్రజలు ఫోర్టిఫికేషన్ ప్యాకేజ్డ్ ఆహారంపై ఆధారపడటాన్ని సృష్టిస్తుందనీ, స్థానిక ఉత్పత్తులపై ప్రజల దృష్టిని లేకుండా చేస్తుందని ఈ లేఖలో పేర్కొన్నారు.
దీని కారణంగా స్థానికంగా ఆరోగ్య, ఆర్థిక పరిస్థితులు ప్రతికూలంగా మారుతాయని ఆందోళన వ్యక్తం చేశారు. అలాగే, పోషకాలు అధికంగా కలిగిన వైవిధ్యభరితమైన ఆహార ఉత్పత్తులను అధికం చేయడంపై దృష్టి సారించి.. దీని కోసం స్థానిక కమ్యూనిటీలు, రైతులు, మహిళా సంఘాలకు ఆహార ఉత్పత్తి కోసం మద్దతు ఇవ్వవచ్చునని లేఖలో పేర్కొన్నారు.