Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- లాన్సెట్‌లో ప్రచురితమైన బ్రిటన్ అధ్యయనం వెల్లడి
న్యూఢిల్లీ: సాధారణంగా కరోనా బారినపడితే దీర్ఘకాలం పాటు వైరస్ సంబంధిత అనారోగ్య లక్షణాలు ఉంటాయని ఇప్పటికే పలు అధ్యయనాలు పేర్కొన్నాయి. వాటిల్లో కొన్ని నెలల వరకు ఊపిరి పీల్చుకోవడంలో ఇబ్బంది, అలసటతో పాటు మరికొన్ని అనారోగ్య ఇబ్బందులు ఉన్నాయి. అయితే ఈ విషయంలో చిన్నారులకు సంబంధించి తాజా ఓ అధ్యయనం గుడ్‌న్యూస్ చెప్పింది.
చిన్నారుల్లో కరోనా వైరస్ ప్రభావం సుదీర్ఘకాలం పాటు ఉండే అవకాశం లేదని బ్రిటన్‌లో నిర్వహించిన అధ్యయనం పేర్కొంది. ప్రస్తుతం వెలుగుచూసిన కొత్త వేరియంట్ల ప్రభావం సైతం చిన్నారులపై దీర్ఘకాలం పాటు ఉండే అవకాశం లేదనీ, కాస్త తక్కువగానే వాటి ప్రభావం పిల్లలపై ఉంటుందని ఈ నివేదిక పేర్కొంది.
ముఖ్యంగా వైరస్ బారినపడిన ఆరు రోజుల్లోనే చిన్నారులు కోలుకుంటున్నట్టు తెలిపింది. నాలుగు వారాలకంటే ఎక్కువగా కరోనా లక్షణాలతో బాధపడేవారి చిన్నారుల సంఖ్య తక్కువేనని పేర్కొంటున్న బ్రిటన్‌లో జరిపిన అధ్యయన వివరాలు తాజాగా ప్రముఖ అంతర్జాతీయ మెడికల్ జర్నల్ లాన్సెట్ చైల్డ్ అండ్ అడోలిసెంట్ హెల్త్‌లో ప్రచురితమైంది.
పిల్లల్లో కరోనా తీవ్రత, లక్షణాలను అంచనా వేసేందుకు బ్రిటన్‌లోని కింగ్స్ కాలేజీ లండన్ పరిశోధకులు ఈ అధ్యయనం చేపట్టారు. ఇందులో భాగంగా బ్రిటన్ ప్రభుత్వం కరోనా బాధితుల పర్యవేక్షణ కోసం రూపొందించిన 'జోయి కోవిడ్ స్టడీ యాప్' నుంచి గతేడాది సెప్టెంబర్ 1 నుంచి ఈ ఏడాది ఫిబ్రవరి 22 వరకు సేకరించిన కోవిడ్ రోగుల డేటాను ఉపయోగించారు. మొత్తం 5-17 ఏండ్ల వారి 2.5 లక్షల మంది డేటాను విశ్లేషించడంతో పాటు వారి తల్లిదండ్రులు అందించిన వివరాల ఆధారంగా ఈ నివేదికను రూపొందించినట్టు పరిశోధకులు వెల్లడించారు.
కరోనా బారినపడిన చిన్నారుల్లో తలనొప్పి, అలసట, గొంతునొప్పి, వాసన కోల్పోయే లక్షణాలే అధికంగా ఉన్నప్పటికీ.. ఇవి సరాసరిగా ఆరురోజుల వరకు ఉండి.. అదే వారంలో తగ్గిపోతున్నాయని ఈ అధ్యయనం పేర్కొంది.