Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ : దేశరాజధాని న్యూఢిల్లీలోని ప్రతిష్టాత్మక జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ (జేఎన్‌యూ)లో గతేడాది చోటు చేసుకున్న హింస కేసులో ఢిల్లీ పోలీసులు ఏ ఒక్కరినీ అరెస్టు చేయలేదని కేంద్ర హౌం మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఈ మేరకు సమాచారాన్ని పార్లమెంటులో తెలిపింది. గతేడాది జనవరిలో.. మాస్కులు ధరించి సాయుధులైన కొందరు వ్యక్తులు యూనివర్సిటీ క్యాంపస్‌లోకి ప్రవేశించి హింసాత్మక చర్యలకు దిగిన విషయం విదితమే. విద్యార్థులు, అధ్యాపకులను తీవ్రంగా కొట్టడంతో పాటు యూనివర్సిటీ ఆస్తులకు తీవ్ర నష్టం కలిగించారు. కాగా, ఈ ఘటనలో 31 మంది విద్యార్థులు, ఇద్దరు అధ్యాపకులు, ఇద్దరు గార్డులు గాయాలపాలయ్యారు. పార్లమెంటులో కేంద్ర హౌం శాఖ సహాయ మంత్రి నిత్యానంద్ రారు వెల్లడించిన సమాచారం ప్రకారం.. జేఎన్‌యూ హింసకు సంబంధించిన కేసులో వసంత్ కుంజ్ పోలీస్ స్టేషన్లో నమోదైన మూడు కేసుల దర్యాప్తు కోసం క్రైమ్ బ్రాంచ్ ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) ఏర్పాటైంది. డీఎంకే ఎంపీ దయానిధి మారన్ అడిగిన ప్రశ్నకు కేంద్ర మంత్రి పై విధంగా సమాధానమిచ్చారు.
కాగా, గతేడాది జేఎన్‌యూలో చోటుచేసుకున్న హింస దేశవ్యాప్తంగా తీవ్ర చర్చకు దారి తీసింది. ఈ రభస సృష్టించింది ఏబీవీపీ విద్యార్థులేనన్న ఆరోపణలు కూడా వినబడ్డాయి. ఈ ఘటనలో జేఎన్‌యూ స్టూడెంట్స్ యూనియన్ ప్రెసిడెంట్ అయిషీ ఘోశ్‌పై తీవ్రంగా దాడి జరిగింది. ఆమె తలకు, చేతికి తీవ్ర గాయాలయ్యాయి. దేశవ్యాప్తంగా తీవ్ర చర్చకు దారి తీసిన ఇంతటి హింసాత్మక ఘటనకు సంబంధించిన కేసులోనూ ఎలాంటి అరెస్టులు చోటు చేసుకోకపోవడం గమనించాల్సిన అంశమని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేశారు. క్యాంపస్‌లోకి ప్రవేశించిన దుండగులను నియంత్రించలేకపోవడం, హింసను పట్టించుకోక పోవడం, నిఘా వ్యవస్థ వంటి వైఫల్యాలను ఈ సందర్భంగా జేఎన్‌యూ విద్యార్థులు, సామాజిక కార్యకర్తలు ఎత్తి చూపారు.