Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- క్యూ1లో రూ.6,504 కోట్ల లాభాలు
- పెరిగిన షేరు ధర
న్యూఢిల్లీ : దేశంలోనే అతిపెద్ద విత్త సంస్థ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) ఆకర్షణీయ ఆర్థిక ఫలితాలను ప్రకటించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్ నుంచి జూన్‌తో ముగిసిన తొలి త్రైమాసికం (క్యూ1)లో 55.24 శాతం వృద్థితో రూ.6,504 కోట్ల నికర లాభాలు సాధించింది. త్రైమాసిక ఫలితాల్లో ఇది వరకు ఎప్పుడూ ఈ స్థాయి రికార్డ్ లాభాలను ఆర్జించలేదు. గతేడాది ఇదే త్రైమాసికంలో రూ.4,189.4 కోట్ల లాభాలు నమోదు చేసింది. ముంబయి కేంద్రంగా పని చేస్తోన్న ఈ ప్రభుత్వ రంగ బ్యాంక్ క్యూ1లో పన్నుల చెల్లింపునకు ముందు రూ.8,922.86 కోట్ల లాభాలు నమోదు చేసింది. బ్యాంక్ నికర వడ్డీపై ఆదాయం (ఎన్ఐఐ) 12 శాతం పెరిగి రూ.27,638 కోట్లకు చేరింది. ఎస్బీఐ మెరుగైన ఆర్థిక ఫలితాల నేపథ్యంలో బుధవారం ఆ బ్యాంక్ షేర్‌కు డిమాండ్ నెలకొంది. బీఎస్ఈలో 2.37 శాతం లేదా రూ.10.60 పెరిగి రూ.457.05కు చేరింది. దీంతో మార్కెట్ కాపిటలైజేషన్ రూ.4.08 లక్షల కోట్లకు ఎగిసింది. కాగా.. గడిచిన క్యూ1లో బ్యాంక్ రుణ పుస్తకం ఆశ్చర్యకరంగా కేవలం 5.8 శాతం పెరుగుదలతో రూ.25.23 లక్షల కోట్లకు చేరింది. 2020-21 ఇదే క్యూ1లో రూ.23.85 లక్షల కోట్లుగా ఉంది. ఇదే సమయంలో రూ.34.2 లక్షల కోట్లుగా ఉన్న డిపాజిట్లు.. గడిచిన క్యూ1లో రూ.37.2 లక్షల కోట్లకు చేరాయి. క్రితం క్యూ1లో రిటైల్ రుణాల్లో 16.47 శాతం, వ్యవసాయ అడ్వాన్సుల్లో 2.48 శాతం, ఎస్ఎంఇలో 2.01 శాతం వృద్థిని కనబర్చడంతో దేశీయ రుణాల పెరుగుదల 5.6 శాతంగా ఉంది. మరోవైపు బ్యాంక్ మొండి బాకీల్లో పెరుగుదల ఉండటం గమనార్హం. జూన్ త్రైమాసికం ముగింపు నాటికి బ్యాంక్ స్థూల నిరర్థక ఆస్తులు (జీఎన్‌పీఏ) 5.32 శాతానికి చేరాయి. ఇంతక్రితం మార్చి త్రైమాసికం నాటికి 4.98 శాతంగా, గతేడాది జూన్ త్రైమాసికం నాటికి 5.44 శాతంగా జీఎన్‌పీఏ నమోదయ్యింది. కాగా 2021 జూన్ ముగింపు నాటికి నికర నిరర్థక ఆస్తులు 1.77 శాతానికి పెరగ్గా... ఇంతక్రితం మార్చితో ముగిసిన త్రైమాసికం నాటికి 1.50 శాతంగా నమోదయ్యాయి. గడిచిన త్రైమాసికంలో మొండి బాకీల కోసం రూ.10,051.96 కోట్లు కేటాయించింది. ఏడాది క్రితం ఇదే త్రైమాసికంలో రూ.12,501 కోట్లు, గడిచిన మార్చి త్రైమాసికంలో ఎన్‌పిఎల కోసం రూ.11,051.03 కోట్లు కేటాయించింది.
ఆర్థిక అక్షరాస్యతపై క్యాంపెయిన్
హైదరాబాద్ : ఆర్థిక అక్షరాస్యతపై అవగాహన పెంచడానికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) ఉద్దేశించిన ప్రతీ బ్లాక్‌కు సెంటర్ ఫర్ ఫైనాన్సీయల్ లిటరసీ (సీఎఫ్ఎల్)ను ఎస్బీఐ గురువారం తెలంగాణలోని జనగాంలో ప్రారంభించింది. ఈ తొలి సీఎఫ్ఎల్ను తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ బ్యాంకింగ్ అంబుడ్స్‌మన్ టి శ్రీనివాసరావు లాంచనంగా ప్రారంభించారు. పొదుపు, చెల్లింపులు, క్రెడిట్, ప్రభుత్వ మద్దతు పథకాలు, బీమా, పెన్షన్ ఉత్పత్తులు, అందుబాటులో ఉన్న ప్రాథమిక ఆర్థిక ఉత్పత్తులు, ఆర్థిక క్రమశిక్షణ, ఇతర బ్యాంకింగ్ సేవలపై అవగాహన తదితర వాటిపై అవగాహన పెంచడానికి ఈ క్యాంపులను నిర్వహిస్తుంది. దీనికి ఆర్బీఐ రీజినల్ డైరెక్టర్ కె నిఖిల, నాబార్డ్ చీఫ్ జనరల్ మేనేజర్ వై కష్ణారావు, ఎస్బీఐ చీఫ్ జనరల్ మేనేజర్ అమిత్ జింగ్రాన్, జనరల్ మేనేజర్ ఎం యశోద బాయి తదితరులు హాజరయ్యారు.