Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఉపాధి పనిదినాలు 200కు పెంచాలి : లకార్మిక స్టాండింగ్ కమిటీ
న్యూఢిల్లీ: కరోనా సంక్షోభం కారణంగా పట్టణ పేదల పరిస్థితి మరింతదారుణంగా మారిందనీ, ప్రభుత్వంసైతం ఈ విషయంలో పెద్దగా దృష్టి సారించలేదని కార్మిక పార్ల మెంటరీ స్టాండింగ్ కమిటీ పేర్కొంది. కరోనా కారణంగా తలెత్తిన దుర్భర పరిస్థతుల్లో ఎం ఎన్ఆర్ఈజీఎస్ లాంటి ఉద్యోగ హామీ పథకం తో పాటు అనధికారిక కార్మికులకు నగదును అందజేయాలని సిఫారసు చేసింది. తాజాగా లోక్సభలో ప్రవేశపెట్టిన 'పెరుగుతున్న నిరు ద్యోగం, ఉద్యోగాలు/ జీవనోపాది నష్టంపై కోవిడ్-19 ప్రభావం' అనే దానిపై పార్లమెంటరీ కమిటీ తన నివేదికలో.. దేశంలో కరోనా పంజా విసిరిన సమయంలో వలస కార్మికుల సంక్షోభంపై స్పందించడంలో కేంద్ర కార్మిక మంత్రిత్వ శాఖ సైతం ఆలస్యం చేసిందని పార్లమెంటరీ కమిటీ పేర్కొంది. ''లక్షలాది మంది వలస కార్మికులు నిస్సహాయిలుగా తమ స్వస్థలాలకు వెళ్తున్నప్పుడు.. యావత్ దేశం కన్నీటి దశ్యాలను చూస్తున్న వేళ.. సంబంధిత మంత్రిత్వ శాఖ స్పందించడానికి రెండు నెలల పాటు.. జూన్-2020 వరకు రాష్ట్ర ప్రభుత్వాలకు లేఖ రాయడానికి వేచి ఉండటం, సుప్రీంకోర్టు కలుగజేసుకున్న తర్వాత వలస కార్మికులపై అవసరమైన, వివరణాత్మక డేటా సేకరించడం ఆశ్చర్యంగా ఉంది'' అని ఈ కమిటీ పేర్కొంది. సంక్షోభాలు తలెత్తిన సమయంలో ప్రజలకు మేలు చేసే పథకాలు అమలు చేయాల్సిన బాధ్యత కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపై ఉంటుందనీ, ఆ విధంగా చర్యలు తీసుకోవాల్సిన అవసరముందని కమిటీ స్పష్టం చేసింది. కరోనా కారణంగా విధంచిన లాక్డౌన్తో ఉద్యోగాలు/ఉపాధి కోల్పోవడంతో కలిగిన నష్టాన్ని భర్తీ చేయడానికి పేదలకు నగదు మద్దతును అందజేయాలని సూచించింది. ఎంఎన్ఆర్ఈజీఎస్ గరిష్ట పని దినాలను 100 రోజుల నుంచి 200 రోజులకు పెంచాలని పేర్కొంది. గ్రామీణ ఉపాధి హామీ చట్టం మాదిరిగా పట్టణ శ్రామిక శక్తి కోసం ఉపాధి హామీ కార్యక్రమాన్ని అమలు చేయాల్సిన అవసరం ఉందని పార్లమెంటరీ కమిటీ పేర్కొంది.''ఉద్యోగాలు కోల్పోవడం, పెరుగుతున్న నిరుద్యోగం, రుణ భారం, పోషకాహారం, ఆరోగ్యం, విద్య వంటి అంశాలు అసంఘటిత కార్మికుల కుటుంబాలపై సుదీర్ఘ ప్రభావం చూపుతున్నాయనీ, కోలుకోలేని నష్టాన్ని కలిగించే విధంగా ఉన్నాయని కమిటీ పేర్కొంది.