Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- తగ్గిన మహిళా కార్మిక భాగస్వామ్యం
- 16.1 శాతానికి దిగజారిన వైనం
- మహమ్మారి ప్రభావమే : కేంద్రం
న్యూఢిల్లీ : దేశంలో కరోనా మహమ్మారి ప్రభావం మహిళల ఉపాధిపై పడింది. దేశ కార్మికశక్తిలో వారి భాగస్వామ్యాన్ని తగ్గేలా చేసింది. గతేడాది జూలై-సెప్టెంబర్ త్రైమాసికంలో మహిళా భాగస్వామ్యం రేటు 16.1 శాతానికి పడిపోయింది. సాక్షాత్తూ ప్రభుత్వ గణాంకాలే ఈ విషయాన్ని స్పష్టం చేయడం గమనార్హం. మహమ్మారి ప్రభావం, దేశంలో విస్తరిస్తున్న ఉద్యోగ సంక్షోభాన్ని ఇది ప్రతిబింబించింది.
ఇలా లెక్కిస్తారు..
16 ఏండ్ల నుంచి 64 ఏండ్ల మధ్య వయస్సు ఉన్న వారిని పరిగణనలోకి తీసుకుంటారు. ఉద్యోగం చేస్తున్నవారు ఉపాధి కోసం వెతుకుతున్నవారి సంఖ్యను బట్టి గణాంకాలు తయారు చేస్తారు. అయితే పూర్తిస్థాయి విద్యార్థులు,గృహిణిలు, 64 ఏండ్లకు పైబడిన వారు ఈ జాబితాలోకి రారని గణాంక అధికారులు తెలిపారు.
కరోనా దెబ్బ..
కరోనా మహమ్మారి వ్యాప్తిని అరికట్టడా నికి భారత్లో కఠిన లాక్డౌన్ విధించినప్పు డు గతేడాది ఏప్రిల్-జూన్ త్రైమాసికంలో మహిళా కార్మికుల భాగస్వామ్యం రికార్డు స్థాయిలో 15.5 శాతానికి పడిపోయిందని కేంద్రం విడుదల చేసిన నివేదికలో వెల్లడైంది. ప్రపంచబ్యాంకు అంచనాల ప్రకారం.. భారత దేశంలో మహిళా కార్మికుల భాగస్వామ్యం రేటు 2005లో అధికంగా 26 శాతానికి పడిపోయింది. ఆ తర్వాత 2019లో ఇది 20.3శాతంగా నమోదు కావడం గమనార్హం. భారత్లో మహిళలు ఎక్కువగా తక్కువ నైపుణ్యం కలిగిన వృత్తుల్లో ఉద్యోగాలు చేస్తున్నారు. అయితే, మహమ్మారి కారణంగా వారి ఉపాధి తీవ్రంగా దెబ్బతిన్నదని నిపుణులు తెలిపారు. గతేడాది సెప్టెంబర్ నాటికి మహిళల్లో నిరుద్యోగ రేటు 15.8 శాతానికి తాకింది. పురుష కార్మికుల్లో ఇది 12.6 శాతంగా ఉండటం గమనార్హం. కేంద్రం మాత్రం ఈ విషయంలో ఏమీ పట్టనట్టు వ్యవహరిస్తున్నదని ఆర్థికవేత్తలు ఆరోపించారు.