Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- బీమా సవరణబిల్లుకు సీపీఐ(ఎం) అడ్డు
- రాజ్యసభలో పెడతాం : కేంద్ర మంత్రి
- ప్రయివేటీకరణ అంగీకరించం: ప్రతిపక్షాలు.. ఆరుగురు ఎంపీల సస్పెన్షన్
న్యూఢిల్లీ: బీమా రంగాన్ని ప్రయివేటీకరణ చేసేందుకు తీసుకొచ్చిన సాధారణ బీమా జాతీయకరణ సవరణ బిల్లును సీపీఐ(ఎం) అడ్డుకున్నది. బుధవారం రాజ్యసభలో ఈ బిల్లును కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టేందుకు ప్రయత్నించారు. దీన్ని సీపీఐ(ఎం) పక్షనేత ఎలమారం కరీం అడ్డుకున్నారు. కోట్లాది మంది ప్రజలకు జీవితాలకు సంబంధించిన ఈ బిల్లు ప్రవేశపెట్టడానికి వీల్లేదనీ, చూస్తూ ఊరుకోమని స్పష్టం చేశారు. ఈ బిల్లును విస్తృత పరిశీలన కోసం సెలెక్టు కమిటీకి పంపాలని ఆయన డిమాండ్ చేశారు. కేంద్ర మంత్రి బిల్లు ప్రవేశపెట్టేందుకు ప్రయత్నించగా, ఎలమారం కరీం లేచి పాయింట్ ఆఫ్ ఆర్డర్ లేవనెత్తారు. అయితే దీనికి చైర్ అనుమతించలేదు. దీంతో తీవ్ర గందరగోళం నెలకొన్నది. వెంటనే బిల్లు ప్రవేశపెట్టడాన్ని గురువారానికి వాయిదా వేశారు. రాజ్యసభలో ఆరుగురు సభ్యులపై సస్పెన్షన్ వేటు పడింది. ప్లకార్డులతో నిరసన ప్రదర్శన చేపట్టినందుకుగానూ ఆరుగురు తృణమూల్ కాంగ్రెస్ సభ్యులను చైర్మెన్ వెంకయ్యనాయుడు ఒకరోజు సస్పెండ్ చేశారు. బుధవారం ఉదయం కూడా రాజ్యసభలో టీఎంసీతో పాటు ఇతర ప్రతిపక్ష ఎంపీలు పెగాసస్ అంశంపై చర్చ జరగాలని డిమాండ్ చేస్తూ నిరసనకు దిగారు. ప్లకార్డులు ప్రదర్శిస్తూ వెల్‌లోకి దూసుకెళ్లి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ప్రతిపక్ష సభ్యులు ఆందోళన విరమించాలనీ, తమ తమ సీట్లలో కూర్చోవాలని చైర్మెన్ వెంకయ్య తొలుత సూచించారు. లేదంటే ప్లకార్డులు పట్టుకున్నందుకు 255 నిబంధనను అమలు చేయాల్సి వస్తుందని హెచ్చరించారు. అయినా వారు పట్టువిడవలేదు. దీంతో రాజ్యసభ ఛైర్‌ను అగౌరవపర్చిన వారిపై 255 నిబంధనను అమలు చేస్తున్నట్టు ప్రకటించిన వెంకయ్య సభను మధ్యాహ్ననికి వాయిదా వేశారు. ఆ తరువాత రాజ్యసభ సెక్రెటేరియట్ నిబంధనకు గురైన సభ్యుల పేర్ల జాబితాను విడుదల చేసింది. టీఎంసీకి చెందిన డోలా సెన్, మహ్మద్ నదీముల్ హక్, అబిర్ రంజన్ బిశ్వాస్, శాంత ఛెత్రి, అర్పితా ఘోష్, మౌసమ్ నూర్‌ను ఒకరోజు పాటు సస్పెండ్ చేస్తున్నట్టు ప్రకటించింది.
వాయిదాలే..వాయిదాలు
పార్లమెంట్ వర్షాకాల సమావేశాలను పెగాసస్ నిఘా వ్యవహారం, రైతు సంబంధిత అంశాలు కుదిపేస్తున్నాయి. ప్రతిపక్షాల ఆందోళన, ప్రభుత్వం మంకుపట్టు వల్ల చర్చలు జరగడం లేదు. బుధవారం కూడా ప్రతిపక్షాలు నిరసనలకు దిగడంతో ఉభయ సభలు వాయిదా పడ్డాయి. లోక్‌సభ ప్రారంభం కాగానే ప్రతిపక్ష ఎంపీలు తమ సీట్లలో నుంచి లేచి ఆందోళన చేపట్టారు. ప్లకార్డులు చేతబట్టి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దీంతో ప్రశ్నోత్తరాలు చేపట్టకుండానే స్పీకర్ సభను అరగంట పాటు వాయిదా వేశారు. ఉదయం 11.30 గంటలకు తిరిగి సభ ప్రారంభమైనప్పటికీ ఎలాంటి మార్పు రాలేదు. ప్రతిపక్షాల ఆందోళనలు కొనసాగడంతో మరోసారి సభను మధ్యాహ్నం 12 గంటల వరకు వాయిదా వేశారు. తిరిగి ప్రారంభమైన సభలో అదే గందరగోళం కొనసాగింది. పలుమార్లు వాయిదా పడి, చివరికి గురువారానికి వాయిదా పడింది. అటు రాజ్యసభలోనూ ఇదే గందరగోళం నెలకొన్నది. పెగాసస్‌తో హ్యకింగ్ వ్యవహారంపై చర్చకు పట్టుబట్టిన ప్రతిపక్ష ఎంపీలు వెల్‌లోకి దూసుకెళ్లి నినాదాలు చేశారు. దీంతో సభను మధ్యాహ్నం 2 గంటల వరకు వాయిదా వేస్తున్నట్టు చైర్మన్ ప్రకటించారు. అనంతరం ప్రారంభమైన సభలో ప్రతిపక్షాల ఆందోళన కొనసాగింది. దీంతో సభలో తీవ్ర గందరగోళం నెలకొంది. దీంతో సభ పలుమార్లు వాయిదా పడి, చివరికి గురువారానికి వాయిదా పడింది.
నాలుగు బిల్లులు ఆమోదం
ప్రతిపక్షాల ఆందోళన నడుమ పార్లమెంట్ ఉభయ సభల్లో నాలుగు బిల్లులు ఆమోదం పొందాయి. లోక్‌సభలో ఒకటి, రాజ్యసభలో మూడు బిల్లులు ఆమోదం పొందాయి. లోక్‌సభలో కొబ్బరి అభివృద్ధి బోర్డు సవరణ బిల్లు ఆమోదం పొందింది. అలాగే రాజ్యసభలో ఎయిర్ పోర్ట్స్ ఎకనామిక్ రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా సవరణ బిల్లు, డిపాజిట్ ఇన్సూరెన్స్ మరియు క్రెడిట్ గ్యారెంటీ కార్పొరేషన్ (సవరణ) బిల్లు, పరిమిత బాధ్యత భాగస్వామ్య (సవరణ) బిల్లులు ఆమోదం పొందాయి. చర్చలు లేకుండానే బిల్లులు మూజువాణి ఓటుతో ఆమోదం పొందాయి. దీనిపై కాంగ్రెస్ లోక్‌సభ పక్షనేత అధిర్ రంజన్ చౌదరి మాట్లాడుతూ చర్చ లేకుండా చట్టాలను ఆమోదించడం ద్వారా ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారని విమర్శించారు.
పెగాసస్ నిఘాపై చర్చ జరపాలి...హౌం మంత్రి సమాధానం ఇవ్వాలి
జాతీయ భద్రత కోసం పెగాసస్ నిఘా వ్యవహారంపై పార్లమెంట్ ఉభయ సభల్లో చర్చ జరపాలనీ, కేంద్ర హౌం మంత్రి సమాధానం ఇవ్వాలని 14 ప్రతిపక్ష పార్టీలు డిమాండ్ చేశాయి. ఈమేరకు బుధవారం ఆయా పార్టీలు సంయుక్త ప్రకటన విడుదల చేశాయి. పెగాసస్‌తో పాటు రైతుల సమస్యలు, రైతు ఉద్యమంపై కూడా చర్చ జరపాలని డిమాండ్ చేశాయి. అయితే కేంద్ర ప్రభుత్వం ప్రతిపక్షాలపై తప్పుడు ప్రచారం చేస్తుందని విమర్శించాయి. పార్లమెంటరీ ప్రజాస్వామ్యాన్ని గౌరవించి, చర్చ జరపాలని పునరుద్ఘాటిం చాయి. మల్లికార్జున ఖర్గే, ఆనంద్ శర్మ (కాంగ్రెస్), శరద్ పవర్ (ఎన్సీపీ), ఎలమారం కరీ (సీపీఐ(ఎం), టిఆర్ బాలు, తిరుచ్చి శివ (డీఎంకే), బినరు విశ్వం (సీపీఐ), రాంగోపాల్ యాదవ్ (ఎస్పీ), డెరిక్ ఓబ్రయిన్, కళ్యాణ్ బెనార్జీ (టీఎంసీ), సంజరు రౌత్, వినాయక్ రౌత్ (శివసేన), మనోజ్ కుమార్ ఝా (ఆర్జెడి), సుశీల్ గుప్తా (ఆప్), ఈటి మహ్మద్ బషీర్ (ఐయూఎంఎల్), మసూదీ (నేషనల్ కాన్ఫెరెన్స్), ఎన్‌కె ప్రేమ్‌చంద్రన్ (ఆర్ఎస్పీ), ఎంవి శ్రేయమ్స్ కుమార్ (ఎల్జేడీ) తదితరులు సంతకాలు చేశారు.
కాంగ్రెస్, ఎస్ఏడీ ఎంపీల వాగ్వాదం
శిరోమణి అకాలీదళ్ (ఎస్ఏడీ) ఎంపీ, మాజీ కేంద్ర మంత్రి హర్సిమ్రత్ కౌర్ బాదల్, కాంగ్రెస్ ఎంపీ రవనీత్ సింగ్ బిట్టు మధ్య వాగ్వాదం జరిగింది. కేంద్ర ప్రభుత్వం కొత్తగా తీసుకొచ్చిన సాగు చట్టాలపై వీరు పార్లమెంటు వెలుపల బుధవారం బిగ్గరగా పరస్పర ఆరోపణలకు దిగా రు. వ్యవసాయ చట్టాలకు సంబంధించిన బిల్లులను పార్ల మెంటులో ప్రవేశపెట్టినపుడు కాంగ్రెస్ పార్లమెంటు నుంచి పారిపోయిందని హర్సిమ్రత్ కౌర్ బాదల్ ఆరోపించారు. ఈ ఆరోపణలపై రవనీత్ సింగ్ బిట్టు స్పందిస్తూ, కేంద్ర క్యాబినెట్లో కౌర్ ఉన్నపుడే ఈ బిల్లులు ఆమోదం పొందా యన్నారు. దీనిపై కౌర్ స్పందిస్తూ, వాళ్ళని అడగండి. రాహుల్ గాంధీ ఎక్కడీ సోనియా గాంధీ ఎక్కడీ పార్లమెంటులో ఈ బిల్లులు ఆమోదం పొందినపుడు సోనియా, రాహుల్ ఎక్కడ ఉన్నారో అడగండన్నారు.