Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అత్యున్నత న్యాయస్థానం మాజీ జడ్జిలు సహా పలువురు లాయర్లు
న్యూఢిల్లీ: ఇప్పటికే దేశంలో సంచలనంగా మారిన 'పెగాసస్' వ్యవహారం రోజురోజుకూ ముదురుతోంది. ఇదివరకే పలువురు రాజకీయ నేతలు, కేంద్ర మంత్రుల పేర్లు పెగాసస్ లక్ష్య జాబితాలో ఉండటంతో ప్రతిపక్షాలు కేంద్రంపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నాయి. పెగాసస్ అంశంపై పార్లమెంట్లో చర్చించాలని డిమాండ్ చేస్తుంటే.. ప్రభుత్వ మొండివైఖరీతో సమావేశాలు సైతం వాయిదాల పర్వంతో ముందుకు సాగుతున్నాయి. ఇలాంటి తరుణంలో మరో సంచలన విషయం వెలుగులోకి వచ్చింది. పెగాసస్ లక్ష్య మొబైల్ నెంబర్లలో దేశ అత్యున్నత న్యాయస్థానం మాజీ న్యాయమూర్తులతో పాటు రిజిస్ట్రార్లు, పలువురు న్యాయవాదులకు చెందినవి కూడా ఉన్నాయని తాజాగా 'ది వైర్' తన కథనంలో పేర్కొంది. దేశంలో అత్యున్నత న్యాయస్థానంలోని కీలక వ్యక్తులపై పెగాసస్‌ను ప్రయోగించడం సంచలనంగా మారింది. ఎన్.కె గాంధీ, టీఐ.రాజ్‌పుత్‌లు ఇద్దరూ సుప్రీంకోర్టులోని కీలకమైన రిట్ విభాగంలో పనిచేశారు. పెగసస్ లక్ష్యంగా ఉన్న వందలాది నెంబర్లలో వీరివి కూడా ఉన్నాయి. అలాగే, గతేడాది పదవీ విరమణ చేసిన జస్టిస్ అరుణ్ మిశ్రా పేరిట గతంలో నమోదైన రాజస్థాన్ మొబైల్ నెంబర్ సైతం పెగాసస్ డేటాబెస్‌లో ఉన్నట్టు దివైర్ కథనం పేర్కొంది. అలాగే, పదుల సంఖ్యలో న్యాయవాదుల నెంబర్లు ఈ జాబితాలో ఉండగా, వారిలో పలువురు మానవ హక్కుల కేసులు, పలు కీలక అంశాలకు సంబంధించిన కేసుల్లో పాలుపంచుకున్నవారు ఉన్నారు. ప్రముఖ న్యాయవాది విజరు అగర్వాల్ కుటుంబ సభ్యులకు చెందిన నెంబర్, అగస్టా వెస్ట్‌ల్యాండ్ హెలికాప్టర్ డీల్ కేసుతో సంబంధం ఉన్న ఢిల్లీకి చెందిన న్యాయవాది అల్జో పి.జోసెఫ్ నెంబర్లు ఉన్నాయి. మాజీ అటార్నీ జనరల్ ముకుల్ రోహత్గీ ఛాంబర్లో పనిచేస్తున్న జూనియర్ న్యాయవాది ఎం తంగతురై నెంబర్ కూడా ఉండటంపై వారు ఆశ్చర్యం వ్యక్తం చేసినట్టు ఈ కథనం పేర్కొంది. ఈ నెల 5న సుప్రీంకోర్టు పెగాసస్‌పై విచారణ జరపనున్న నేపథ్యంలో పెగసస్ లక్ష్యంగా సుప్రీంకోర్టు కీలక వ్యక్తులు, ప్రముఖ న్యాయవాదుల నెంబర్లు ఉన్నాయనే అంశం కీలకంగా మారింది. దీంతో సుప్రీంకోర్టు విచారణపై ప్రస్తుతం సర్వత్రా ఆసక్తి నెలకొంది.
పెగాసస్ వ్యవహారంపై సుప్రీం విచారణ నేడే
పెగాసస్ నిఘాపై సీనియర్ జర్నలిస్టులు ఎన్.రామ్, శశి కుమార్‌లు దాఖలు చేసిన పిటిషన్‌పై సుప్రీం కోర్టు గురువారం విచారణ జరపనుంది. జర్నలిస్టులు, న్యాయవాదులు, మంత్రులు, ప్రతిపక్ష నేతలు, రాజ్యాంగ కార్యకర్తలు, పౌర సమాజ కార్యకర్తలతో సహా 142మందిపై పెగాసస్ స్పైవేర్‌ను ఉపయోగించి నిఘా పెట్టడంపై మాజీ లేదా సిట్టింగ్ సుప్రీం న్యాయమూర్తితో స్వతంత్ర దర్యాప్తు జరిపించాలని వారు ఆ పిటిషన్లో కోరారు. దానిపై ప్రధాన న్యాయమూర్తి ఎన్.వి.రమణ నేతృత్వంలోని సుప్రీం బెంచ్ గురువారం విచారించనుంది.