Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పిల్లలు, మహిళల పోషణపై తీవ్ర ప్రభావం
- ఉత్తరప్రదేశ్, బెంగాల్, మహారాష్ట్ర, తమిళనాడు, బీహార్ రాష్ట్రాల్లో అధికం
- కేంద్రం పూర్తి వాటా విడుదల నోచనివైనం
న్యూఢిల్లీ : దేశంలో భారీగా అంగన్వాడీల్లో పోస్టు లు ఖాళీగా ఉండటంతో పాటు ప్రభుత్వ ఆమోదం లభించిన అన్ని అంగన్వాడీ కేంద్రాలు పనిచేయకపో వడంతో పిల్లలు, మహిళల పోషణపై తీవ్ర ప్రభావం పడుతోంది. కొన్ని రాష్ట్రాల్లో అయితే, ఈ పరిస్థితులు మరింత దారుణంగా ఉన్నాయి. తాజాగా ఓ పార్లమెంట్ సభ్యుడు అడిగిన ప్రశ్నకు సమాధానంగా కేంద్ర మహిళా, శిశు అభివృద్ధి శాఖ మంత్రి స్మృతి ఇరానీ మాట్లాడుతూ.. దేశవ్యాప్తంగా అంగన్ వాడీల లో వివిధ స్థాయిలలో 1.93 లక్షల పోస్టులు ఖాళీగా ఉన్నాయని చెప్పారు. మరీ ముఖ్యంగా ఐదు రాష్ట్రాల్లో ఏకంగా 1.29 లక్షల పోస్టులు ఖాళీగా ఉన్నాయని వెల్లడించారు. వాటిలో అత్యధికంగా ఉత్తర ప్రదేశ్‌లో 50,670, బెంగాల్లో 33,439, మహారాష్ట్రలో 19,478, తమిళనాడులో 15,720, బీహార్‌లో 9,828 అంగన్వాడీల్లో వివిధ స్థాయిల్లో పోస్టులు ఖాళీగా ఉన్నాయి. అంగన్వాడీలను ఎక్కువగా మహిళలు నిర్వహిస్తున్నారు. ఇవి అణగారిన వర్గాలకు చెందిన పిల్లలు, మహిళలకు పోషకాహారం అందించడంలో కీలక పాత్ర పోషిస్తున్నాయి. అయితే, రికార్డు స్థాయిలో పోస్టులు ఖాళీగా ఉండటంతో పాటు ప్రభుత్వ ఆమోదం పొందిన అన్ని అంగన్వాడీ కేంద్రాలు పనిచేయకపోవడంతో పేద పిల్లలు, మహిళల పోషణపై ప్రత్యక్ష ప్రభావం పడుతోంది. కేంద్ర మంత్రి మరో ప్రశ్నకు స్పందిస్తూ.. 6నెలల నుంచి 6సంవత్సరాల మధ్య వయస్సు గల 9.27లక్షల మందిపిల్లలు తీవ్రమైన పోషకా హార లోపంతో బాధపడుతున్నారనీ, అందులో 4లక్షలమంది ఒక్క యూపీలోనే ఉన్నారని చెప్పారు. అయితే, యూపీలో అంగన్వాడీ వర్కర్లు, హెల్పర్లల ఖాళీ పోస్టుల గురించి రాష్ట్ర అంగన్వాడీ ప్రెసిడెంట్ వీణా గుప్తు మాట్లాడుతూ.. ఒక్క యూపీలోనే లక్ష పోస్టులు ఖాళీగా ఉన్నాయని అన్నారు. దీనికి కారణంగా ప్రభుత్వం తీసుకున్న పలు అంశాలను ప్రస్తావించారు. అందులో 62 ఏండ్లకు పైబడిన వారికి ఇచ్చే గౌరవ వేతనం నిలిపివేయడం, 2011 నుంచి కొత్త నియామకాలు చేపట్టకపోవడం వంటి అంశాలు ఉన్నాయి. ప్రస్తుతం కరోనా వ్యాప్తి నివారణ చర్యలు, టీకాలు, వివిధ సర్వేలు, రోగ నిరోధకత, పోషకాహార భోజనం పంపిణీ వంటి పలుకీలక బాధ్యతలను అంగన్వాడీలు నిర్వహిస్తు న్నాయి. అయితే, పోస్టులు ఖాళీగా ఉన్న ప్రాంతాల్లో లక్షలాది మంది చిన్నారులు, మహిళలపై తీవ్ర ప్రభావం పడుతోంది.
దేశ అవసరాలకు తగినంతగా లేని అంగన్వాడీలు
ప్రస్తుతం, దేశవ్యాప్తంగా 14 లక్షల అంగన్వాడీ కేంద్రాలు ఉన్నాయి, అందులో 13.87 లక్షలు మాత్రమే పనిచేస్తున్నా యి, మిగతా 12,265 కేంద్రాలు పనిచేయడం లేదు. వీటి లో 2,191 పోస్టులు చైల్డ్ డెవలప్ మెంట్ ప్రాజెక్ట్ ఆఫీసర్లు లేదా సిడిపివో పోస్టులు ఖాళీగా ఉన్నాయి.. ఇవి మొత్తం మంజూరు చేసిన పోస్టుల్లో 31 శాతం ఉన్నాయి. సుమారు 17,000 సూపర్ వైజర్ల పోస్టులు, మొత్తం మంజూరు చేసిన పోస్టుల్లో 33 శాతం, 71,000కు పైగా కార్మికుల పోస్టులు, 1లక్షకు పైగా సహాయకుల పోస్టులు ఖాళీగా ఉన్నాయి. కాగా, దేశ అవసరాల కంటే చాలా తక్కువ సం ఖ్యలో అంగన్వాడీ కేంద్రాలున్నాయని గణాంకాలు చెబుతు న్నాయి. ప్రస్తుతం 50 శాతం మంది పిల్లలు మాత్రమే అంగన్వాడీ స్కీమ్ పరిధిలో ఉన్నారనీ, మరిన్ని కేంద్రాలు ఏర్పాటు చేయాల్సిన అవసరాన్ని నొక్కిచెబుతున్నాయి.
నిధుల మంజూరు అంతంత మాత్రమే..
అంగన్వాడీలో అందించే ప్రోగ్రామ్స్‌లో కామన్ సర్వీసెస్‌కు కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాల వాటా 60:40 శాతం కాగా, ఎస్‌ఎన్‌పీకి 50:50 శాతంగా ఇరు ప్రభుత్వాలు నిధులు సమకూరుస్తున్నాయి. అయితే, 2018-19 నుంచి 2020-21 ఈ మూడు సంవత్సరాలలో, అన్ని రాష్ట్రాలకు రూ.54,505 కోట్లు మంజూరు చేయగా, అందులో రూ.48,044 కోట్లు మాత్రమే కేంద్రం విడుదల చేసింది. అంటే రూ.6,460 కోట్లు విడుదలకు నోచుకోలేదు. పలు రాష్ట్ర ప్రభుత్వాలు సైతం తమకు కేటాయించిన నిధులను వినియోగించకపోవడం గమనార్హం. వాటిలో పైన పేర్కొన్న రాష్ట్రాలు టాప్‌లో ఉన్నాయి. ఇక దేశంలో పంజా విసిరిన కరోనా మహమ్మారి.. సరైన ప్రణాళికలు లేకుండా విధించిన లాక్డౌన్ కారణంగా అన్ని అంగన్వాడీలు తాత్కాలికంగా మూతపడటంతో చిన్నారులు, మహిళల పోషణపై తీవ్ర ప్రభావం పడిందనీ, దీని పరిష్కారం దిశగా ప్రభుత్వం సైతం అడుగులు వేయకపోవడం దారుణమైన విషయమని నిపుణులు, విశ్లేషకులు పేర్కొంటున్నారు. భావితరాలపై దీని ప్రభావం పడుతుందని ఆందోళన వ్యక్తంచేస్తున్నారు.
కనీస వేతనం.. సామాజిక భద్రత లేదు
అంగన్వాడీ వర్కర్లు, హెల్పర్లు ప్రభుత్వ ఉద్యోగులుగా పరిగణించబడరు. వారు కనీస వేతన చట్టం పరిధిలోకి కూడా రారు. వారికి అందించే తక్కువ మొత్తాన్ని 'గౌరవ వేతనం'గా పేర్కొంటారు. కేంద్రం నిర్ణయించిన గౌరవ వేతనం ఒక వర్కర్‌కు రూ.4,500, మినీ అంగన్వాడీ వర్కర్‌కు రూ.3,500, హెల్పర్‌కు రూ.2,250 నెలకు అందజేస్తారు.
అయితే, చాలా రాష్ట్రాల్లో నెలనెలా ఈ గౌరవ వేతనాలు అందక ఆందోళనలు చేసిన ఘటనలు అనేకం. దీనికి తోడు ప్రభుత్వం నుంచి వీరికి సమాజిక భద్రత సైతం లేకుండా ఉందని అంగన్డీ కార్మికులు పేర్కొంటున్నారు. అందుకే పీఫ్, కనీస వేతనం, ప్రభుత్వ ఉద్యోగ గుర్తింపును తమకు కల్పించాలని చాలా కాలం నుంచి డిమాండ్ చేస్తున్నారు.