Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ : దేశ రాజధానిలో దళిత బాలికపై లైంగికదాడి, హత్య జరిగిన ఘటనపై సీపీఐ(ఎం) పొలిట్‌బ్యూరో సభ్యురాలు బృందా కరత్ కేంద్ర హౌం మంత్రి అమిత్ షాకి లేఖ రాశారు. ఆదివారం సాయంత్రం పురానా నంగల్ గావ్‌లో జరిగిన ఈ ఘటనపై వెంటనే చర్యలు తీసుకోవాలనీ, న్యాయం జరిగేలా చూడాలని ఆమె మంత్రిని కోరారు. ఈ కేసులో నలుగురిని అరెస్టు చేసినప్పటికీ సదర్ థానా కంటోన్మెంట్ ఏరియా పోలీసుల పాత్ర దిగ్భ్రాంతి కలిగిస్తోందని ఆమె ఆ లేఖలో పేర్కొన్నారు.
ఢిల్లీ సీపీఐ(ఎం) కార్యదర్శివర్గ సభ్యులైన నాథూ ప్రసాద్, ఆశా శర్మలతో కలిసి బృందా కరత్ బాధితురాలి తల్లిని కలిసి మాట్లాడారు. విషయం తెలిసి తల్లి షాక్‌లో వున్న సమయంలోనే, ఆ బాలికకు నేరస్తులే బలవంతంగా దహన సంస్కారాలు జరిపారని ఆమె తెలిపారు. ఈ విషయం పట్ల వారి కమ్యూనిటీ ప్రజలు కూడా చాలా ఆగ్రహంతో వున్నారు, ఎందుకంటే వారి సాంప్రదాయానుసారం చిన్న పిల్లలను సమాధి చేయాలి గానీ దహనం చేయరాదు. కానీ ఈ కేసులో ఆమె తల్లే పిల్లని దహనం చేయడానికి అంగీకరించిందని అసత్యాలు ప్రచారం చేయడం చూస్తుంటే హత్రాస్ కేసులో ఏం జరిగిందో ఇక్కడా అదే జరిగిందని తెలుస్తున్నదని బృందా కరత్ ఆ లేఖలో పేర్కొన్నారు. ఇక్కడ బాధితురాలి కుటుంబం చేసిన నేరమల్లా వారు పేద, దళిత కుటుంబం. శ్మశాన వాటికలోని కూలర్ నుండి తాగునీరు తెచ్చుకోవడానికి ఆ బాలిక వెళ్ళింది. వారికి తల దాచుకొన నీడ లేదు. తల్లిదండ్రులిద్దరికి పని లేదు. చెత్త కాగితాలు ఏరుకునే వారు. ఈ బాలిక వారికి చాలా ఆలస్యంగా పుట్టిన ఏకైక కుమార్తె. ఆ అమ్మాయి పట్ల అఘాయిత్యంగా వ్యవహరించడమే కాకుండా, హతమార్చి, పైగా వారి తల్లిదండ్రులను అక్రమంగా నిర్బంధించడం చాలా పెద్ద నేరమని ఆమె పేర్కొన్నారు. ఇదే ప్రాంతంలో గతంలో కూడా రెండు లైంగికదాడులు జరిగాయన్నారు.
ఢిల్లీ పోలీసులు నేరుగా కేంద్ర హౌం శాఖ పరిధిలోకి వస్తారని అయినా ఇంతవరకు ఈ కేసులో జోక్యం చేసుకోకపోవడం విచారకరమని బృందా పేర్కొన్నారు. వెంటనే ఈ విషయంలో కలగచేసుకుని న్యాయం జరిగేలా చూడాలని ఆమె కోరారు. కుమార్తెను పోగొట్టుకున్న తల్లిదండ్రులకు ఏం చేసినా నష్టం భర్తీ కాదు, కానీ వారికి ఆర్థికంగా సాయపడడం ప్రభుత్వ బాధ్యతని ఆమె పేర్కొన్నారు. ఇందులో జోక్యం వున్న పోలీసు సిబ్బంది పట్ల తక్షణమే చర్యలు తీసుకోవాలని బృందా, అమిత్ షాను కోరారు.