Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ : ఆఫ్ఘనిస్తాన్‌లో చాలా వేగంగా మారుతున్న పరిస్థితులపై చర్చించేందుకు రష్యా ఏర్పాటు చేసిన కీలక సమావేశానికి భారత్‌ను ఆహ్వానించలేదు. ఈ సమావేశానికి పాకిస్తాన్, చైనా, అమెరికా హాజరవుతున్నాయని సంబంధిత వర్గాలు తెలిపాయి. ఆఫ్ఘనిస్తాన్‌లో తాలిబన్ తన దాడులను కొనసాగిస్తుండగా, మరోవైపు రష్యా ఈ హింసను ఆపేందుకు, ఆఫ్ఘన్ శాంతి క్రమాన్ని వేగిరపరిచేందుకు కీలకమైన పక్షాలతో సమావేశమవడానికి చర్యలు తీసుకుంటోంది. విస్తృత త్రైపాక్షిక సమావేశం ఈ నెల 11న కతార్‌లో జరగనున్నది. గతంలో మార్చి 18, ఏప్రిల్ 30న చర్చలు జరిగాయి. ప్రధాన పక్షాలన్నీ వుండేలా మాస్కో ఫార్మాట్లో చర్చలు జరిపేందుకు సిద్ధమవుతున్నామని రష్యా తెలిపింది. ఆఫ్ఘనిస్తాన్‌లో పరిస్థితులను ప్రభావితం చేయగల భారత్, ఇతర దేశాలతో కలిసి పనిచేస్తామని గత నెల్లో రష్యా విదేశాంగ మంత్రి సెర్గి లావ్రోవ్ ప్రకటించారు. ఈ వ్యాఖ్యల నేపథ్యంలో రాబోయే విస్తృత త్రైపాక్షిక సమావేశంలో భారత్ కూడా వుంటుందని ఊహాగానాలు తలెత్తాయి. ఆఫ్ఘన్ ఘర్షణలకు సంబంధించి వివిధ అంశాలపై అమరికాతో రష్యాకు విభేదాలున్నా ఇరు దేశాలు కలిసి తాలిబన్ హింసకు ఒక పరిష్కారాన్ని కనుగొనాలని ప్రయత్నిస్తున్నాయి. కాగా రాబోయే ఆఫ్ఘన్ సమావేశంపై భారత్ ఇంకా ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు. ఇదిలావుండగా, ఆఫ్ఘన్ పరిస్థితులపై చర్చించేందుకు శుక్రవారం (6వ తేదీన) ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి సమావేశమవడాన్ని సానుకూల పరిణామంగా భారత్‌లో ఆఫ్ఘన్ రాయబారి ఫరీద్ అభివర్ణించారు.