Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- వడ్డీలోనూ రాయితీ
న్యూఢిల్లీ : కరోనా సంక్షోభంతో దేశంలో బంగారం తనఖా రుణాలకు భారీగా డిమాండ్ పెరిగింది. ఈ అవకాశాన్ని అందిపుచ్చు కోవడానికి ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ సంస్థ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) మరో అడుగు ముందుకు వచ్చింది. ఖాతాదారులకు ఇబ్బందులను తగ్గించడానికి యోనో యాప్‌తో సులభంగా పసిడి రుణాలు అందించేలా చర్యలు తీసుకుంది. పైగా బంగారు రుణాలను తీసుకునేవారికి వడ్డీరేట్లపై రాయితీని ప్రకటించింది. ఈ తనఖా అప్పులపై సుమారు 0.75 శాతం డిస్కౌంట్ కల్పిస్తున్నట్టు గురువారం ఓ ప్రకటనలో వెల్లడించింది. రాయితీ వడ్డీ రేటు 2021 సెప్టెంబర్ 30 వరకు వర్తిస్తుందని తెలిపింది. యోనో యాప్‌తో తక్కువ పేపర్ వర్క్, వేగంగా ప్రాసెసింగ్‌తో పసిడి రుణం పొందవచ్చు. ఇందుకు ఖాతాదారులు ముందుగా తమ మొబైల్లోని యోనో యాప్‌లోకి లాగిన్ కావాలి. హోమ్ పేజీలో ఎగువ ఎడమవైపు ఉన్న మెనూను క్లిక్ చేసి.. లోన్స్ ఆప్షన్లను ఎంపిక చేసుకోవాలి. అనంతరం గోల్డ్ లోన్ మీద క్లిక్ చేయడం ద్వారా సులభంగా ఆభరణాల వివరాలు, నెలవారీ ఆదాయం సమాచారం ఇవ్వడం ద్వారా అప్లికేషన్ పూర్తి అవుతుంది. దీంతో బంగారంతో దగ్గరలో ఉన్న ఎస్బీఐ బ్యాంకును సంప్రదించడం ద్వారా సులభంగా రుణాలు పొందవచ్చని ఆ బ్యాంక్ వెల్లడించింది. రెండు పాస్‌పోర్టు సైజు పోటోలు, కెవైసి డాక్యూమెంట్లను ఇవ్వడం ద్వారా బ్యాంకు సిబ్బంది బంగారం స్వచ్ఛత, బరువును నిర్ధారించిన తరువాత లోహం విలువను బట్టి రుణం మంజూరు చేస్తారు. 18 ఏళ్లు పైబడిన వారు మాత్రమే ఈ తనఖా రుణం పొందానికి అర్హులు. కనీసం రూ.20,000 నుంచి గరిష్టంగా రూ.50 లక్షల వరకు అప్పు పొందడానికి వీలుంది. ప్రస్తుతం ఎస్బీఐ పసిడి రుణాలపై కనిష్టంగా 7.5 శాతం వడ్డీ రేటును అమలు చేస్తోంది.