Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- దద్దరిల్లిన పార్లమెంట్
న్యూఢిల్లీ: రైతు సమస్యలు, పెగాసస్‌పై పార్లమెంట్ దద్దరిల్లింది. ఉభయ సభల్లో జై కిసాన్..జై జవాన్ నినాదాలు హౌరెత్తాయి. 41 ఏండ్ల విరామానికి తెరదించుతూ టోక్కో ఒలింపిక్స్‌లో కాంస్య పతకం సాధించిన పురుషుల హాకీ జట్టుకు పార్లమెంట్ అభినందనలు తెలిపింది. అదే విధంగా బాక్సర్ లవ్లీనాకు కూడా ఉభయ సభలు అభినందనలు తెలిపారు. మరోపక్క పెగాసస్ హ్యాకింగ్ వ్యవహారం, రైతు చట్టాలు తదితర అంశాలపై పార్లమెంట్లో అదే గందరగోళం కొనసాగింది. దాంతో ఉభయ సభలు వాయిదా పర్వం తొక్కాయి. తొలుత లోక్‌సభలో ప్రశ్నోత్తరాల సమయం ప్రారంభం కాగానే ప్రతిపక్షాలు ఆందోళన తెలిపాయి. సభ్యులు ప్లకార్డులు ప్రదర్శిస్తూ.. వెల్ వద్దకు దూసుకెళ్లారు. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాల హౌరెత్తించారు. ప్రతిపక్షాల నిరసనల మధ్య సభ పలు మార్లు వాయిదా పడి, శుక్రవారానికి వాయిదా పడింది. రాజ్యసభలో కూడా ఇదే పరిస్థితి నెలకొనడంతో అక్కడ వాయిదాల పర్వం కొనసాగింది. కానీ రాజ్యసభలో ప్రతిపక్షాల ఆందోళన నడుమ మూడు బిల్లులు ఆమోదం పొందాయి. ఎసెన్షియల్ డిఫెన్స్ బిల్లు, ఎన్‌సిఆర్ ఎయిర్ క్వాలిటీ మేనేజ్మెంట్ బిల్లు, రాజ్యంగ (షెడ్యూల్డ్ తెగల) ఆర్డర్ సరవణ బిల్లు రాజ్యసభలో మూజువాణి ఓటుతో ఆమోదం పొందాయి.
సెలక్ట్ కమిటీకి పంపాలి
ఎసెన్షియల్ డిఫెన్స్ బిల్లును సెలక్ట్ కమిటీకి పంపాలని సీపీఐ(ఎం) రాజ్యసభ పక్షనేత ఎలమారం కరీం డిమాండ్ చేశారు. గురువారం రాజ్యసభలో ఈ బిల్లును కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ప్రవేశపెట్టారు. ప్రతిపక్షాల ఆందోళన నడుమే, తూతూ మంత్రపు చర్చ జరిగింది. సభ్యులు మాట్లాడేందుకు ఒక నిమిషం, రెండు నిమిషాలే అవకాశం ఇచ్చారు. సీపీఐ(ఎం) తరఫున ఎలమారం కరీం మాట్లాడుతూ ఎసెన్షియల్ డిఫెన్స్ బిల్లు క్రూరమైనదనీ, దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని అన్నారు. ఈ బిల్లు దేశంలోని కార్మిక వర్గానికి సంబంధించిన సమ్మె హక్కు నిషేధిస్తుందనీ, ఇది కార్మికులు ప్రాథమిక హక్కులను ఉల్లంఘిస్తోందని అన్నారు. అలాగే ఐఎల్ఒ కన్వెన్షన్‌కు కూడా వ్యతిరేకంగా ఉందని తెలిపారు. ఈ బిల్లును విస్తృత పరిశీలన కోసం సెలక్ట్ కమిటీకి పంపాలని డిమాండ్ చేశారు. ఈ బిల్లుపై చర్చకు ముందు పెగాసస్ నిఘాపై చర్చ జరపాలని డిమాండ్ చేశారు. అనంతరం కరీం మీడియాతో మాట్లాడుతూ ఎసెన్షియల్ డిఫెన్స్ బిల్లుకు 10 సవరణలు ప్రతిపాదించాననీ, కానీ అనుమతించ లేదని అన్నారు. సెలక్ట్ కమిటీకి పంపించాలని డిమాండు కూడా నిరాకరణకు గురైందని తెలిపారు. అలాగే రైతులకు వ్యతిరేకంగా తీసుకొచ్చిన రాజధాని ప్రాంత వాయు నాణ్యత కమిషన్ బిల్లు సీపీఐ(ఎం) వ్యతిరేకిస్తోందని ఆపార్టీ ఎంపి జర్నాదాస్ బైద్యా అన్నారు. దేశంలో ప్రజాస్వామ్య విలువలు పడిపోయాయని, కార్మికులు, రైతులు, మహిళలు, దళితులు, గిరిజనలపై ఆర్థిక, సామాజిక దాడులు జరుగుతున్నాయని అన్నారు.
పెగాసస్‌పై చర్చ జరగాలి
పెగాసస్‌పై చర్చ జరిపి తీరాలని, పార్లమెంట్ ఉభయ సభల్లో ప్రధాని మోడీ, హౌ మంత్రి అమిత్ షా సమాధానం ఇవ్వాలని వామపక్ష ఎంపీలు డిమాండ్ చేశారు. గురువారం నాడిక్కడ ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సీపీఐ(ఎం) ఎంపీలు ఎలమారం కరీం, ఎఎం ఆరీఫ్, సోమప్రసాద్, వి.శివదాసన్, జాన్ బిట్రాస్, సీపీఐ ఎంపీ బినరు విశ్వం, ఎల్జేడీ ఎంపీ శ్రేయమ్స్ కుమార్ మాట్లాడారు. తాము రైతు సమస్యలు, పెగాసస్ నిఘా వ్యవహారం, ధరల పెరుగుదల అంశాలపై చర్చ జరగాలని కోరుతున్నామన్నారు. పెగాసస్‌పై జరిగిన చర్చ జరిపి, ప్రధాని మోడీ, అమిత్ షా సమాధానం ఇవ్వాలని తాము డిమాండ్ చేస్తే, అధికార పక్షం ఐటీ మంత్రి సమాధానం ఇచ్చారని చెబుతున్నారన్నారు. దాన్ని తాము అంగీకరించటం లేదని పేర్కొన్నారు. పార్లమెంట్ సమావేశాలు సజావుగా జరగకపోవడానికి కేంద్ర ప్రభుత్వమే బాధ్యత వహించాలని అన్నారు. ఈ సందిగ్ధతపై రాజ్యసభ చైర్మెన్, ప్రభుత్వం ఎటువంటి చర్యలు జరపలేదని తెలిపారు. ప్రతిపక్షాలతో చర్చించటం లేదన్నారు. చర్చ లేకుండానే కీలకమైన బిల్లులు ఆమోదిస్తున్నారనీ, ఇది అప్రజాస్వామ్యమని అన్నారు. బిల్లులను స్టాండింగ్ కమిటీ, సెలక్ట్ కమిటీలకు పంపటం లేదనీ, మోడీ పాలనలో కేవలం 12 శాతమే పరిశీలన జరిగిందని తెలిపారు. గతంలో 75 శాతం బిల్లులు పరిశీలనకు వెళ్లి, పార్లమెంట్ ఉభయ సభలకు వచ్చేవని చెప్పారు. దీన్ని తాము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని అన్నారు.